
– జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఆదివారం నల్గొండ జిల్లాలో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. పరీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని, అన్ని పరీక్ష కేంద్రాలలో పరీక్షల సవ్యంగా జరిగిందని ఆమె తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష మధ్యాహ్నం 1:00గంటకు ముగిసిందని చెప్పారు. జిల్లాలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షకు 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా,పరీక్షలు రాసేందుకు జిల్లా నుండి 16,899 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 13616 మంది హాజరయ్యారని, 3283 మంది గైర్హాజరయ్యారని, పరీక్షకు హాజరైన వారి శాతం 80.57 గా ఉన్నట్లు ఆమె వెల్లడించారు. పరీక్షల సక్రమ నిర్వహణకు గాను తనతో పాటు జిల్లా ఎస్పీ చందనా దీప్తి బందోబస్తును పర్యవేక్షించారని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, అలాగే జిల్లాలోని సీనియర్ అధికారులు సైతం పరీక్షను పర్యవేక్షించినట్లు తెలిపారు. గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా నిర్వహించినందుకు గాను ఆమె అధికారులను, సిబ్బందిని అభినందించారు.
పరీక్షా కేంద్రాల తనిఖీ..
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమైన వెంటనే ఉదయం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి లో ఉన్న ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో కల్పించిన సౌకర్యాలు, హాజరైన అభ్యర్థులు, గైర్హాజరైన వారి వివరాలు, ఇతర వివరాలను పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా దేవరకొండ రోడ్ లో ఉన్న సందీప్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని, అలాగే సెయింట్ ఆల్ఫాన్సస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్-1 పరీక్ష కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర తనిఖీ చేసి గ్రూప్ -1 పరీక్షలను పర్యవేక్షించారు. ఈ తనిఖీలో నల్గొండ ఆర్డిఓ రవి, స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.