గుప్పుమంటున్న గుడుంబా..

నవతెలంగాణ – చివ్వేంల
గుడుంబా రహిత తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా వాటిని అరికట్టడం లో ఎక్కడో ఓ దగ్గర విఫలమవుతూనే ఉన్నాయి. నాటు సారా తాగి ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలు కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాని నిషేధం పై గట్టి చర్యలు చేపట్టింది. కానీ దాన్ని వ్యాపారం గా చేసుకుని బతుకుతున్నా కొందరు రహస్యంగా సారా తయారు చేస్తూ గ్రామాలకు తరలిస్తున్నట్లు సమాచారం.
యథేచ్ఛగా సారా అమ్మకాలు..మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో, తండాలలో యథేచ్ఛగా నాటు సారా అమ్మకాలు నిర్వహిస్తున్న ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఈ తతంగమంతా తెలిసిన ఎక్సైజ్ అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.  మద్యానికి అలవాటు పడ్డ గ్రామాలలోని రోజు వారి కూలీలు తక్కువ ధరకు సారా లభిస్తుండడం తో వాటిని సేవించి అనారోగ్యం పాలవుతున్నట్లు సమాచారం.
సారా తయారీ ఎక్కడ? మండలంలోని వివిధ గ్రామాలలో, తండాలలో విచ్చలవిడిగా సారా లభించడంతో అసలు ఇది ఎక్కడ తయారు చేస్తున్నారనే అనుమానం ప్రజలలో మొదలైంది. మండల పరిధిలో పదుల సంఖ్యలో గిరిజన తండాలు ఉండడంతో సారా తయారీ అక్కడే జరుగుతుందా లేక రూటు మార్చి గుడుంబా వ్యాపారులు  మరెక్కడైనా తయారు చేసి గ్రామాలలో అడ్డాలనుఏర్పాటు చేసుకొని సప్లయ్ చేస్తున్నారా అనే అనుమానం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. సారా తయారీ అంటే ఎక్సైజ్ అధికారులు గిరిజన తండాలపై మాత్రమే దాడులు నిర్వహిస్తారనే ఆరోపణలు ఉన్నాయి.మద్యానికి బానిసైన వారు బెల్టుషాపుల లో కొనుగోలు చేయడం కోకొల్లలు చూశాం. అయితే ఇదే సమయంలో మద్యానికి అలవాటు పడ్డ కూలీలు అంత ఖర్చు పెట్టి మద్యం తాగలేక ప్రత్యామ్నాయం వైపు ఆలోచన చేసినట్లు సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకున్న పలువురు గుడుంబా వ్యాపారులు తిరిగి నాటుసారాను తయారు చేస్తున్నట్లు పలువురుఆరోపిస్తున్నారు..గ్రామాలలో నాటు సారా కు అలవాటు పడ్డ కూలీల బలహీనతను ఇంకా కూడా గుడుంబా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. నాటు సారా ను  నియంత్రించడంలో ఎక్సైజ్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక మహిళలు సారా తమ కుటుంబం లోకి ప్రవేశించి ఎప్పుడు చిచ్చుపెడుతుందోని భయాందోళనకు గురవుతున్నారు. ఇకనైనా ఎక్సైజ్ అధికారులు గట్టి నిఘా పెంచి అక్రమసారా వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు కోరుకుంటున్నారు.
Spread the love