నేడు, రేపు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

– ఎల్లో హెచ్చరిక జారీ
– రాష్ట్రంలో 220పైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో గురు, శుక్రవారాల్లో 11 జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షం పడే అవకాశాలున్నాయనీ, మిగతా ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్‌ కె.నాగరత్న ప్రకటించారు. భారీవర్ష సూచన ఉన్న జాబితాలో ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలున్నాయి. వచ్చే మూడ్రోజులు మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశముంది. రాష్ట్రం మీదుగా బలమైన ఉపరిత గాలులు వీచే సూచనలున్నాయి. బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 220కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. జనగామ జిల్లా, మండల పరిధిలోని వడ్లకొండ గ్రామంలో అత్యధికంగా 8.53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని బచ్చన్నపేటలో 6.8 సెంటీమీటర్ల వాన పడింది. మొత్తం మీద 51 ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది.

Spread the love