తమిళనాడులో భారీ వర్షాలు

తమిళనాడులో భారీ వర్షాలుచెన్నై : ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్థంభించిపోయింది. వరదలతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. 12 జిల్లాల్లో శనివారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.
తమిళనాడువ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. కోయంబత్తూరు, తిరువూర్‌, మధురై, థేనీ, దినిదిగుల్‌ జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో కుండపోత వాన కురిసింది. ఇక, నీలగిరి జిల్లాలోని ఐదు తాలుకాలను వర్షం ముంచెత్తింది. తంజావూర్‌, తిరువారూర్‌, నాగపట్నం, మైలదుత్తురై, పుదుకోట్టై, శివగంగై, రామనాథపురం, విరుదునగర్‌, తూత్తుకుడి, తెంకాసి, తిరునెల్వేలి, కన్యాకుమారి తదితర ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసాయి.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలు కారణంగా పలు రైళ్లను కూడా రద్దు చేశారు రైల్వే అధికారులు. నీలగిరి మౌంటైన్‌ రైల్వేలోని కల్లార్‌, కూనూర్‌ సెక్షన్ల మధ్య ట్రాక్‌పై కొండచరియలు, చెట్లు కూలిపడటంతో ఈ నెల 16 వరకు ఆ రూట్స్‌లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. మెట్టుపాళయం నుంచి ఉదగమండలం వరకు నడిచే 06136, 06137 ప్యాసింజర్‌ ప్రత్యేక రైళ్లను శుక్రవారం నుంచి 16వ తేదీ వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Spread the love