Thursday, August 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుశ్రమ ఎక్కువ..హక్కులు తక్కువ

శ్రమ ఎక్కువ..హక్కులు తక్కువ

- Advertisement -

​మహిళల వద్ద 11 శాతమే భూమి కూలిలో కోత..రుణాల్లో కొరత
సాగు రంగంలో తీవ్ర వివక్ష..దేశానికి ఏటా రూ.2 లక్షల కోట్ల నష్టం!
ఆర్య. ఎజి రూపొందించిన హర్ హార్వెస్ట్ నివేదిక వెల్లడి

న‌వతెలంగాణ – బిజినెస్‌ ‌డెస్క్‌
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏండ్లు అవుతున్నా గ్రామీణ భారతదేశంలో కోట్లాది మంది మహిళా శ్రామికులకు ఆర్థిక, సామాజిక న్యాయం ఇంకా దూరపు కొండగానే మిగిలింది. దేశీయ వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలుస్తూ పగలూ రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్న వీరికి తగిన గుర్తింపు, సమాన వనరులు లభించడం లేదు. దీంతో భారత వ్యవసాయ రంగానికి ప్రతియేటా రూ.2 లక్షల కోట్ల వరకు భారీ ఉత్పత్తి నష్టం వాటిల్లుతోందని అగ్రిటెక్‌ ‌కంపెనీ, సమీకృత ధాన్యాల వాణిజ్య వేదిక ‘ఆర్య. ఎజి’ రూపొందించిన ‘హర్ హార్వెస్ట్’ నివేదిక వెల్లడించింది. మహిళలు ఎదుర్కొంటున్న భూమి యాజమాన్యం, వేతనాలు, రుణాలు, వ్యవసాయ ఇన్‌పుట్‌‌లు, నిల్వ సదుపాయాలు, మార్కెట్ల లభ్యత తదితర వ్యవస్థాగత అసమానతల కారణంగా దేశం భారీ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయి సాగు పనుల్లో పురుషులతో సమానంగా శ్రమిస్తున్నప్పటికీ.. వేతనాలు, భూమి యాజమాన్య హక్కులు, ఆర్థిక వనరుల లభ్యతలో చూపుతున్న తీవ్ర అసమానతల వల్ల భారత వ్యవసాయ రంగానికి ప్రతియేటా 2.5 నుంచి 4 శాతం మేర ఉత్పత్తి నష్టం వాటిల్లుతోందని ఈ నివేదిక సమగ్రంగా విశ్లేషించింది. 2013లో ప్రారంభమైన ఈ అగ్రిటెక్ కంపెనీ.. రైతులకు పంట కోత అనంతర నిల్వ వసతులు, ఆర్థిక సాయం, మార్కెట్ లింకేజీలను అందిస్తోంది.

రూ. వంద పనికి మహిళకు 82 రూపాయలే
ప్రస్తుతం దేశంలో గ్రామీణ మహిళా శ్రామిక శక్తిలో ఏకంగా 77 శాతం మంది ఉపాధి కోసం ప్రత్యక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. పురుషులు ఉపాధి వేటలో భాగంగా ఇతర రంగాలు, సమీప పట్టణాలకు తరలివెళ్తుండటంతో వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యం 2017-18లో 57 శాతంగా ఉండగా.. అది కాస్తా 2023-24 నాటికి 64 శాతానికి పైగా పెరిగింది. పొలంలో విత్తనం నాటే స్థాయి నుంచి పంట కోతల వరకు సగానికి పైగా క్షేత్రస్థాయి శ్రమలో మహిళలే ముందుంటున్నారు. అయితే వేతనాల విషయానికి వచ్చేసరికి దశాబ్దాలుగా వివక్షే రాజ్యమేలుతోంది. తీవ్ర స్థాయిలో శారీరక శ్రమ చేసినప్పటికీ పురుషులతో పోలిస్తే మహిళా కూలీలకు 20 నుంచి 30 శాతం తక్కువ వేతనం ఇస్తున్నారు. పురుష కూలీలు రోజుకు సగటున రూ.100 ఆర్జిస్తుంటే.. అదే పనికి మహిళలకు కేవలం రూ.82 మాత్రమే అందడం శ్రమ దోపిడీకి అద్దం పడుతోంది.

​భూమి హక్కులకు 47.7 శాతం మంది దూరం..
దేశంలో మొత్తం సాగుభూమిలో మహిళల పేరిట ఉన్నది కేవలం 11.72 శాతం మాత్రమే. అయితే 47.7 శాతం మంది మహిళలు వ్యవసాయ రంగంలో ఉచితంగా పనిచేసే కుటుంబ సహాయకులు గానే పరిగణించబడుతున్నారు. పట్టాదారు పుస్తకాల్లో పేర్లు లేవనే ఒకే ఒక్క సాంకేతిక కారణంతో బ్యాంకులు, ప్రభుత్వ యంత్రాంగం వీరిని అధికారికంగా రైతులుగా అంగీకరించడానికి నిరాకరిస్తున్నాయి.

​దిగుబడి 30 శాతం పెరగొచ్చు..
ఆధునిక యుగంలోనూ కొనసాగుతున్న ఈ వ్యవస్థాగత అన్యాయాన్ని సరిదిద్ది, మహిళా రైతులకు సమగ్ర వనరులు, భూహక్కులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తే వారి పొలాల దిగుబడి ఒక్కసారిగా 20 నుంచి 30 శాతం వరకు పుంజుకుంటుందని ఆర్య.ఎజి అధ్యయనం స్పష్టం చేసింది. దీనివల్ల వారి కుటుంబ ఆదాయాలు పెరిగి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సమూలంగా మారుతుంది. అలాగే డ్రోన్లు, మార్కెటింగ్ సమాచారాన్ని నేరుగా మహిళా సంఘాలకు చేరవేయడంతో సాధికారిత కల్పించవచ్చని సూచించింది. ‘మహిళా రైతు చేతికి ఇచ్చే ప్రతి రూపాయి రెట్టింపు పనిచేస్తుంది. అది నేడు ఉత్పత్తిని పెంచితే రేపు కుటుంబ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది.’ అని నివేదిక పేర్కొంది. ఐక్యరాజ్యసమితి సమాచారం ప్రకారం రాబోయే కాలాన్ని మహిళా రైతు సంవత్సరంగా పాటించనున్న నేపథ్యంలో భూమి యాజమాన్యంతో సంబంధం లేకుండా సాగు చేసే ప్రతి మహిళనూ అధికారికంగా రైతుగా గుర్తించాలనీ, పూచీకత్తు లేని రుణాలు అందించాలనీ, మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌‌పిఒ)ను మార్కెట్ శక్తిగా మలచాలని ఈ నివేదిక ప్రభుత్వాన్ని కోరింది.

దళారుల దోపిడీ
పట్టాదారు గుర్తింపు లేకపోవడం వల్ల మహిళా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, ప్రభుత్వ రాయితీలు, సబ్సిడీ విత్తనాలు, బ్యాంకు రుణాలు, మద్దతు ధరల సదుపాయాలు అందడం లేదు. ఆర్థిక మూలధనం లేకపోవడంతో వారు ఆధునిక యంత్రాలు, నాణ్యమైన విత్తనాలు వాడలేక పంట దిగుబడులను కోల్పోతున్నారు. పైగా పంట చేతికి వచ్చాక నిల్వ చేసుకునే ఆర్థిక సామర్థ్యం లేక, దళారులు అడిగిన తక్కువ ధరలకే పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తుతోంది. ఈ ప్రతికూలతలతో రూ.48.7 లక్షల కోట్ల విలువైన భారత వ్యవసాయ రంగం ప్రతియేటా 2.5 నుండి 4 శాతం మేర ఉత్పత్తి కోల్పోవాల్సి వస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -