Saturday, May 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహుస్నాబాద్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం చేస్తా: మంత్రి పొన్నం

హుస్నాబాద్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం చేస్తా: మంత్రి పొన్నం

- Advertisement -

– భూ నిర్వాసితులకు త్వరలోనే పేమెంట్ చేసి కాల్వల నిర్మాణం చేస్తాం
– హుస్నాబాద్ లో హోల్సేల్ కూరగాయల మార్కెట్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఎల్లమ్మ చెరువు, అర్బన్ పార్క్, పట్టణ సుందరికరణతో పాటు నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీగార్డెన్స్ లో ప్రభుత్వం  హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం హుస్నాబాద్ ఆర్డిఓ రామ్మూర్తి రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని ఆర్డీఓ చదివి వినిపించారు. నియోజకవర్గ స్థాయి చేపట్టిన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వినిపించారు.

ఈ సందర్భంగా మంత్రి  పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల ఐదు నెలల పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరియు రాష్ట్ర మంత్రుల సహకారంతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గంలో విజయవంతంగా అమలు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. 250 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రైతులకు అందించామని, మరణించిన 679 మంది రైతు కుటుంబాలకు రూ.49 కోట్ల 96 లక్షల రూపాయల రైతు బీమా అందించామని అన్నారు . రూ 150 కోట్ల రూపాయలతో 3,515 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా కొన్ని  నిర్మాణాలు పూర్తిగా మరికొన్ని వివిధ నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు .ఇప్పటివరకు రూ 74 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు వివిధ దశలలో చెల్లించడం జరిగిందని తెలిపారు. 57,963 గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 45 వేల మందికి పింఛను అందిస్తున్నామని పేర్కొన్నారు.

పది సంవత్సరాలు కొత్త పింఛన్లను మంజూరు చేయలేదని త్వరలోనే కొత్తగా మరింత మందికి పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కొత్తగా 13000 మందికి రేషన్ కార్డులను మంజూరు చేసి వాటిలో నమోదైన 38 వేలమందికి మరియు పాత కార్డులలో 23 వేల మందిని అదనంగా చేర్చి మొత్తం 61 వేల మందికి ప్రతినెల 6 కిలోల సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధిని కల్పించడమే కాకుండా పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి డబుల్ వెల్ఫేర్ ఎస్సీ సభ్యులను ద్వారా రోడ్లను అభివృద్ధి చేశామని, కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు.

హుస్నాబాద్ నుండి అక్కన్నపేట వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచామని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి నిర్మాణం తన బాధ్యత అని భూ నిర్వాసితులకు త్వరలోనే పేమెంట్ చేసి కాల్వల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. కోహెడ మండలం తంగేళ్లపల్లిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం వేగంగా జరుగుతుందని అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ గత ఏడాది ప్రారంభమైందని కాలేజీ భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందని, మెన్ కు, ఉమెన్ కు ప్రత్యేకంగా హాస్టల్ నిర్మాణం చేస్తామని తెలిపారు. 

విద్యాభివృద్ధిలో  భాగంగా ఏటిసి సెంటర్ నిర్మాణం, న్యాక్  శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని, 250 పడకలతో ఆసుపత్రి అభివృద్ధి చెందుతుందని అన్నారు .మెడికల్ కాలేజ్ కూడా సాంక్షన్ చేసుకొని పీజీ తో ప్రారంభిస్తామని అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం 540 హోటల్లలో మరియు 250 స్వయం సహాయక సంఘాలకు స్టీల్ బ్యాంకులను పంపిణీ చేశామని వాటిని ఉపయోగించాలని సూచించారు. ఒంటిమామిడి లాగా హుస్నాబాద్ లో హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.  చిగురుమామిడిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మిస్తామని, ముల్కనూరు, సైదాపూర్, ఎల్కతుర్తి బస్టాండ్లను అభివృద్ధి చేస్తామని అన్నారు. పార్టీలకు అతీతంగా హుస్నాబాద్ విద్యా, వైద్య, వ్యవసాయం, మౌలిక వసతుల తో పాటు అన్ని రకాలుగా అభివృద్ధికి అందరం కలిసి పని చేద్దామని అన్నారు. హుస్నాబాద్ లో కబడ్డీ అకాడమీ ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతుందని, కోతుల బెడదని తగ్గించేందుకు ఆలోచన చేస్తున్నామని అన్నారు.

ఎలాంటి బెడద లేని ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయాలని అన్నారు. స్థానిక సంస్థల ద్వారా త్రాగునీరు ఇతర వసతులు ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని హుస్నాబాద్ క్లీన్ అండ్ గ్రీన్ గా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని అన్నారు. భీమదేవరపల్లి మండలం వంగరలో నవోదయ విద్యాలయం స్థాపనకు ప్రయత్నం జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా స్వయం సహాయక  సంఘాలకు రూ.128 కోట్ల రూపాయల విలువైన బ్యాంకు లింకేజి చెక్కులను,  కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను, నేతన్న భీమా చెక్కులను పంపిణీ చేశారు. 109 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్, మిషన్ వాత్సల్య పోస్టర్లను రిలీజ్ చేశారు. అంతకుముందు వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -