Saturday, July 11, 2026
E-PAPER
Homeసోపతిభాషా చర్చను రగిలించిన 'ఇడుపు కాయితం'

భాషా చర్చను రగిలించిన ‘ఇడుపు కాయితం’

- Advertisement -

ఒక సినిమా విడుదల కాకముందే దానిలోని కథా నేపథ్యాన్ని బట్టి, అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటులను బట్టి చర్చల్లో నిలవడం సర్వసాధారణం. కానీ పేరును బట్టి కూడా చర్చల్లో నిలవడం చాలా అరుదు. అంతేకాకుండా ఒక సినిమా పేరు కూడా ఒక భాషా చరిత్రను వెలికితీయగలదా? ఒక ప్రాంతీయ పదం గురించి తెలుగునాట చర్చను రగిలించగలదా? అనే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానమే ‘ఇడుపు కాయితం’. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఒక సినిమా పేరు ‘ఇడుపు కాయితం’ అందరిలో అలాంటి ఆసక్తినే రేకెత్తించింది. ఈ సినిమా పేరు ప్రకటించిన క్షణం నుంచే సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రశ్న విస్తతమైన చర్చకు దారి తీసింది. అదేంటంటే ‘ఇడుపు కాయితం’ అంటే ఏమిటి? కొందరు ఇది విడాకులకు సంబంధించిన పదమన్నారు. మరికొందరు భూమి లావాదేవీల్లో ఉపయోగించే పత్రమని వాదించారు. మరి సత్యం ఏమిటి?

ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే భాష, చరిత్ర, గ్రామీణ జీవన విధానం అనే మూడు కోణాలను పరిశీలించాలి. తెలంగాణ గ్రామీణ మాండలికంలో ‘ఇడుపు’ అంటే విడిపోవడం, వదిలేయడం, సంబంధాన్ని తెంచుకోవడం అనే అర్థాలు ఉన్నాయి. అలాగే తెలుగు నిఘంటువులను పరిశీలించినా ‘ఇడుపు’ (లేదా విడుపు) అంటే వదిలివేయడం, త్యాగం చేయడం, విడిచిపెట్టడం లేదా హక్కును వదులుకోవడం అనే అర్ధాన్ని సూచిస్తున్నాయి. ఇది కేవలం భార్యాభర్తల సంబంధానికే కాకుండా, ఒక హక్కు లేదా బంధాన్ని వదులుకోవడం అనే భావాన్నీ సూచించే పదంగా స్థానిక వాడుకలో కనిపిస్తుంది. ‘కాయితం’ అనేది ‘కాగితం’ అనే పదానికి తెలంగాణ యాసలో వచ్చిన రూపం. అంటే పత్రం లేదా ఆంగ్లంలో డాక్యుమెంట్‌. అందువల్ల ఇడుపు ‘కాగితం కాయితం’ అనే ఈ పదబంధాన్ని పరిశీలించి చూస్తే ఒక వ్యక్తి తనకు సంబంధించిన దేనిపైనైనా సరే పూర్తిగా ఇష్టపూర్వకంగానో లేదా సామాజిక ఒత్తిళ్ల వల్లనో హక్కును వదులుకోవడానికో లేదా త్యాగం చేయడానికో వేరొకరికి రాసి ఇచ్చే పత్రం అని అర్థం వస్తుంది.

అంతేకాదు ‘ఇడుపు కాయితం’ తెలంగాణ గ్రామీణ మాండలికంలో వినిపించే ఒక జానపద ప్రాంతీయ పదబంధం. ఇది పూర్వం గ్రామీణ సమాజంలో బంధాలను వదులుకోవడానికి, హక్కులను త్యాగం చేయడానికి, ఆర్థిక లావాదేవీల్లో రాసుకునే పత్రంగా విస్తతంగా వాడుకలో ఉన్న పదబంధం అని కొన్ని విశ్లేషణలు చెబుతున్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల పెద్దలు చెప్పే మౌఖిక సమాచారం ప్రకారం గ్రామీణ ఆర్థిక, భూముల లావాదేవీల వ్యవస్థలో కూడా ఈ పదానికి పెద్ద చరిత్రే ఉంది. చట్టపరమైన అవగాహన లేని రోజుల్లో, రిజిస్ట్రేషన్‌ ఫీజులు భరించలేని గ్రామీణ పేద, మధ్యతరగతి ప్రజలు ఈ పద్ధతిని వాడేవారు. పూర్వీకుల ఆస్తిలో ఆడపిల్లలకు వచ్చే వాటాను, వారు తమ అన్నదమ్ముల కోసం ‘ఇకపై ఈ భూమిపై మాకు ఎలాంటి హక్కులు లేవు’ అని రాసిచ్చేవారు. తీసుకున్న అప్పు తీర్చలేక, దానికి బదులుగా భూమిని అప్పు ఇచ్చిన వ్యక్తికి ‘ఇడిపి వేయడం’ (వదిలేయడం) అనేవారు. లభ్యమవుతున్న భాషా ఆధారాలు, కథనాలు, విశ్లేషణలు పరిశీలిస్తే ఈ పదబంధం ‘ఇడుపు కాయితం’ ప్రధానంగా భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోయినప్పుడు గ్రామ పెద్దల సమక్షంలో రాసుకునే విడాకుల పత్రం అనే అర్థంలోనే ఎక్కువగా నమోదైంది.

పూర్వ కాలం గ్రామీణ సమాజంలో (ముఖ్యంగా హిందూ వివాహ చట్టం, 1955 రాకముందు) కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి లేనప్పుడు భార్యాభర్తలు విడిపోవాలనుకుంటే కుల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టేవారు. ‘ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నాపై నీకు ఎలాంటి హక్కులు లేవు’ అని భర్త భార్యకు, లేదా భార్య భర్తకు రాసిచ్చేవారు. దీనినే ‘విడుదల కాగితం’ లేదా ‘ఇడుపు కాయితం’ అనేవారు. సామాజిక మాధ్యమాల్లో వినిపించే ప్రతి వివరణను చారిత్రక సత్యంగా స్వీకరించడం సరైంది కాదు. భాషా పరిశోధనలో మౌఖిక సంప్రదాయాలకు విలువ ఉన్నప్పటికీ, ప్రజల జ్ఞాపకాల్లో ఉన్న ప్రతి విషయం చరిత్ర కాదు. పరిశోధన, ఆధారాలు, విశ్లేషణ కలిసినప్పుడే అది చరిత్ర అవుతుంది. అవి లిఖిత ఆధారాలతో బలపడినప్పుడే చారిత్రక నిర్ధారణగా పరిగణిస్తారు. ‘ఇడుపు కాయితం’ కూడా అలాంటి పదమే. దీనిని అనేక సందర్భాలలో వాడారని మౌఖిక ఆధారాలు, వాదనలు ఉన్నా, దీనిని విస్తతంగా ప్రధానంగా భార్యాభర్తలు తమ మధ్య బంధాలను చెరిపి వేసుకుంటున్నప్పుడు రాసుకునే పత్రంగా వాడారన్న దానినే ఆధారాలు, కథనాలు, విశ్లేషణలు ఎక్కువగా బలపరుస్తున్నాయి.

ననుబోలు రాజశేఖర్‌, 9885739808

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -