హెచ్చరిక..వాట్సాప్ గ్రూపులో ఆ మెసేజ్ పెడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం

నవతెలంగాణ-హైదరాబాద్ : తరచూ వాట్సాప్ గ్రూపుల్లో ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది. ఫ్యామిలీ గ్రూపుల నుంచి పార్టీలు, ఫ్రెండ్స్‌కు సంబంధించిన గ్రూపుల వరకు అన్ని గ్రూపుల్లో ఇదే జరుగుతుంటుంది. ముఖ్యంగా పొలిటికల్ పార్టీలకు సంబంధించిన గ్రూపుల్లో నిత్యం ఏదో ఒక డిబెట్ చూస్తుంటాం. సాధారణ సమయాల్లో చర్చల మీద చర్చలు చేస్తుంటారు. ఇక ఎన్నికలు, ఫలితాల వేళ ఎలాంటి చర్చలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని చర్చలు అక్కడితోనే ముగుస్తుండగా.. మరికొన్ని తీవ్ర వివాదానికి దారి తీస్తుంటాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ కీలక హెచ్చరిక చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. బెదిరింపు పోస్టులు పెడితే అస్సలు ఊరుకోము అని అన్నారు. అలాంటి వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాకుండా అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని తీవ్ర హెచ్చరిక చేశారు. వివాదాస్పద పోస్టుల విషయంలో ముఖ్యంగా గ్రూపు అడ్మిన్‌లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కాగా, మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

Spread the love