
– అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని రైతుల విన్నపం
నవతెలంగాణ – కోహెడ
మండలంలోని వింజపల్లి గ్రామ శివారులోని మోయ తుమ్మెద వాగు నుండి ప్రభుత్వ అనుమతులు లేకుండా జోరుగా సాగుతున్న పరిస్థితి నెలకొంది. విశ్వసనీయ సమాచారం మేరకు వింజపల్లి గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గ్రామస్థుల సమాచారం మేరకు వాగు సమీపంలో ఉన్న బొలెరో వాహనాన్ని శనివారం పోలిసులు పట్టుకుని స్థానిక పోలిస్ స్టేషన్ కు తరలించారు. మోయతుమ్మెదవాగులో అక్రమంగా ఇసుకను బొలెరోలో తరలిస్తున్న వాహనాన్ని గ్రామస్థులు అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఠాణాకు తీసుకెళ్ళారు. గ్రామానికి చెందిన పలువురు అక్రమ ఇసుక రవాణదారులు సంబంధిత అధికారుల కల్లుగప్పి బొలెరాల ద్వారా యథేచ్చగా అక్రమ ఇసుక తరలిస్తున్నారు. అలాగే గ్రామ సమీపంలో ఇసుక డంపులు పోసి రాత్రి వేళలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మోయతుమ్మేద వాగు పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని పలువురు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. వేసవికాలం కావడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్ల నిర్మాణ పనుల సాకుతో ఇతర ప్రాంతాలకు నిత్యం వాహనాలు యధేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాయని పలువురు అసహానం వ్యక్తం చేస్తున్నారు.