– కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
నవతెలంగాణ-ఆసిఫాబాద్
పంట సాగులో ఎదురయ్యే సమస్యలను అధిగమించడంతో పాటు అధిక దిగుబడికి మెలకువలు అందించేందుకు రైతు నేస్తం కార్యక్రమం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం 15వ ధారావాహిక కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆర్. శ్రీనివాస్ రావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో వరి పంటలో స్వల్పకాలిక రకాల సాగు, ముఖ్యమైన పంటలలో కలుపు యాజమాన్యంపై రాష్ట్ర స్థాయి శాస్త్రవేత్తల ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 3 రైతు నేస్తం వీసీ యూనిట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంటల సాగులో ఎదురయ్యే సమస్యలను ప్రతి మంగళవారం జరిగే రైతు నేస్తం ముఖాముఖి కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ముందు ఉంచి, సందేహాలు నివృత్తి చేసుకొని మంచి దిగుబడులు సాధించాలన్నారు. కార్యక్రమములో సహాయ వ్యవసాయ సంచాలకులు మిలింద్ కుమార్, వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్ పాల్గొన్నారు.