అడవిలోని పింకి అమ్మను వెదుక్కుంటూ, పొరపాటున హైదారాబాద్ చేరింది. ఎత్తైన చెట్లు, వేలాడే పూల గుత్తులు, కాయలతో ఒంగిపోయిన కొమ్మలు కనపడలేదు. తిరుగాడే జంతువులు అసలే లేవు. రకరకాల వాహనాలు, వింత మనుషులు కనపడ్డారు. నెమ్మదిగా ఒక ఇంటి గోడ మీద వాలింది. కాలికి ఏదో కుచ్చుకున్నట్లు అనిపించి కిందకు చూసింది. గోడ నిండా పాతిన గాజు పెంకులు. లేత పాదానికి చిన్న గాయం. ఇంతలో బౌ వ్… భౌ వ్… మంటూ, చెవులు పగిలే పోయే అరపులు వినిపించి అటు దిక్కు చూసింది. రెండు కుక్కలు. తోడేళ్ళ మాదిరిగా అనిపించాయి. అలాంటి వాటిని పింకీ ఎప్పుడూ చూడలేదు. ‘చాలా ప్రమాద కరమైనవే’ అనిపించింది. దిట్టంగా బలిసి – పొగరుగా, కోపంగా ఉన్నాయి. ఊర పిచ్చుకను చూసి మొరగ సాగాయి. ఇంటికి ముందు వైపు రెండు పూలు లేని క్రోటన్ మొక్కలు కనిపించాయి. వాటి మీద వాలి కొద్దిసేపు ఆకులతో, వాటి మీద వాలే తుమ్మెదలతో ఆడుకుందా మనుకుంది. కానీ వాటి కోరలు ఎలుగుబంటి కోరల్లా ఉన్నాయి. కండ్లు చింత నిప్పుల్లా మండు తున్నాయి. అవి కుండీల్లోని మొక్కల కంటే ఎత్తుగా ఉన్నాయి. ‘నేను వాలానంటే నోటితో అందుకొని పిప్పర మెంటులా చప్పరించేస్తాయి’ అనుకుంది
ఇంతలో ఇంట్లో నుంచి నిక్కరు, టి షర్ట్ వేసుకున్న కండ్ల జోడు అమ్మాయి వెలుపలకు వచ్చింది. అటూ… ఇటూ… చూసి, గొడవైపు చూసింది. పిడికెడంత పిచ్చుక కనిపించింది. ”మమ్మీ మన టైగర్స్ ఇంటి మీద పిట్టను కూడా వాలనియ్యడం లేదే ….. ఇంక దొంగ వచ్చాడంటేనా….. వాడు అయిపోయినట్లే…” అనుకుంటూ కుక్కలను పిలుచుకొని లోపలకు వెళ్లింది. పింకీకి అక్కడ ఉండాలని పించలేదు. గాలిలోకి లేచింది. అమ్మను వెదుక్కుంటూ వెళ్ళ సాగింది. కొంత దూరం వెళ్ళగానే గేదెల అరుపులు చెవిలో పడ్డాయి. కిందకు చూసింది. అప్పుడప్పుడూ అడవిలోకి, పశువుల కాపరులు తోలుకుని వచ్చే గేదెలు – తనకు పరిచయమే. వాటి మీద తను నల్లని రంగు పిట్టలతో, పొడుగు తోక ఎర్రని పిట్టలతో కలిసి ఆడుకునేది. గంతులు వేసేది. గేదెలు తమకేమీ పట్టనట్లు, తోకలు ఊపుకుంటూ ఒంగి పచ్చ గడ్డి మేసుకుంటూ ఉండేవి. ఇక్కడ అలాంటివే రేకుల పాకలో కనిపించడంతో ప్రాణం లేచి వచ్చింది. రివ్వున పాక వైపు వెళ్లింది. భరించ లేని దుర్గంధం, పశువుల పేడతో, బురదతో, రొచ్చు రొచ్చుగా ఉంది కొష్టం. నేల మీద వాలకుండా, నేరుగా గేద మీద వాలింది గడ్డి గింజలు దొరికేతే తిందామని. కానీ, వాటి ముందు ఎండు గడ్డి కనిపించ లేదు. మూసి మురికిలో పెరిగిన పచ్చ గడ్డిని ఆవురావురుమంటూ తింటున్నాయి. దోమలు, ఈగలు జివ్వుమని చేసే రొద. అవి గేదలను కుడుతూ, వాటి రక్తాన్ని పీల్చ సాగాయి. వాటి కాళ్ళు రక్తాలు కారి, నిలబడ్డ చోట రక్తపు చినుకులు కనిపించాయి. వాటి బాధ భరించలేక తోకతో తోలుకుంటూ, నిలకడగా ఉండకుండా కాళ్ళు కదిలిస్తూ, అటూ.. ఇటూ … కదలాడ సాగాయి గేదెలు.
అలా పిచ్చుక వాలిందో లేదో దోమలు, ఈగలు జూమ్మంటూ కమ్ముకున్నాయి. పిచ్చుకకు ఊపిరి అందలేదు. వాలిన దోమలు, ఈగలు విపరీతంగా కుట్టసాగాయి. ‘ఇక్కడ ఒక్క క్షణం ఉన్నా ఇవి కుట్టి, కుట్టి చంపేస్తాయి’ అనుకొని రివ్వున పైకి లేసింది. దాని వెంట కొన్ని దోమలు, ఈగలు పరిగెత్తాయి. కానీ వాటికి అందకుండా దూరంగా వెళ్ళి, పక్కనే ఉన్న మొండి గోడ మీద కూర్చుంది గేదెల దీన స్థితి చూస్తూ. కిందకు చూసింది. గోడకు పక్కనే దూడ కనిపించింది. దాని మీద వాలి ”దూడ మిత్రమా… ఆ గేదలతో స్నేహం చేద్దామంటే, తిండి యావలో పడి నన్ను పట్టించుకోవడం లేదు. పాపం అవి దోమలతో, ఈగలతో నానా పాట్లు పడుతున్నాయి. నీకు కడుపు నిండింది కాబోలు, నువ్వు గడ్డి మేయడంలేదు. నాతో స్నేహం చేస్తావా..?” అని అడిగింది.
బదులివ్వలేదు దూడ. ”నీకు మాటలు రావా..? ఒప్పుకున్నట్లు తల ఊపొచ్చు కదా” అంది. మళ్ళీ బదులు లేదు.
”ఏమైంది నీకు” అని దూడ మీద వాలింది. నాతో మాట్లాడు… అన్నట్లు ముక్కుతో పొడిచింది. స్పందన లేదు. ముందుకు వెళ్ళి చూసింది. దూడలో ప్రాణం లేదు. రెండు కండ్ల స్థానంలో రెండు రంద్రాలు కనపడ్డాయి. పైన ఒట్టి తోలు మాత్రమే. లోపలంతా గడ్డి ఉంది. ‘ఈ మనుషులు తల్లి పాలు బిడ్డ తాగితే, తమకు లాభాలు తగ్గుతాయని దూడను చంపి, కేవలం గేదె పాలు ఇచ్చేందుకు, గడ్డి బొమ్మను వాడుకుంటున్నారు. ఇక్కడ ఉంటే ప్రమాదం. నన్ను కూడా ఏమైనా చేస్తారు’ అనుకుంటూ పైకి ఎగిరింది. కడుపులో ఆకలి కలవర పెట్టసాగింది. ఎక్కడైనా నాలుగు వడ్ల గింజలు, లేదా ఒక మిడత దొరుకుందేమోనని ఆకాశంలో రెక్కలు ఆడించుకుంటూ వెళ్ల సాగింది. ఎంత సేపు తిరిగినా బిల్డింగులు, వాహనాలు, మనుషులు తప్ప ఒక్క జొన్న కంకి కానీ, చారెడు వడ్ల గింజలు కానీ కనిపించడం లేదు. కండ్లింత చేసుకొని అలాగే తిరగ సాగింది. ఆకలితో తిరిగీ తిరిగీ రెక్కలు నొప్పి పుట్టాయి. ఒక స్తంభానికి మరో స్తంభానికి వేలాడ తీయబడ్డ కరెంటు తీగల మీద కొద్ది సేపు సేద దీరుదామనుకుంది. అప్పటికే వాటి మీద వరుసగా కొన్ని కాకులు కూర్చొని, ఆకలితో ఆరవ సాగాయి. దగ్గరికి వెళ్ళిందో లేదో… ఒక్కసారి పెద్ద మంట చేసింది. కరెంటు షాక్కు మూడు కాకులు నేలమీద పడి, గిలగిల కొట్టుకొని ప్రాణాలు వదిలాయి. ఒక తీగ మీద కూర్చున్న కాకి తోక మరో తీగకు తగలడంతో మంటలు లేశాయి. పిచ్చుక గుండె, గుబగుబ లాడింది. ఈ తీగలు చాలా ప్రమాదం అనుకుంటూ దూరంగా వెళ్లింది.
ఒక చోట రోడ్డు పక్కన కుప్ప తొట్టి కనపడ్డది. దాని పక్కనే తిని పడేసిన నాలుగు విస్తరాకులు కనిపించాయి. హమ్మయ్య, నా చిట్టి పొట్టకు ఓ నాలుగు మెతుకులు.. కడుపు నింపుకుంటే ఇంక అమ్మను వెదకొచ్చు” అనుకుంటూ తొట్టి అంచు మీద వాలింది. ఒక సారి విస్తర్ల వైపు చూసి, సంతోషంగా తోక ఊపి విస్తరు పక్కన వాలింది. అంతే. ‘భావ్ ..’ మని అరుచుకుంటూ, వీధి కుక్కలు నాలుగు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాయి. వాటి అరుపుకే పిచ్చుక గుండె ఆగినంత పనైంది. తినబోయే ఆహారాన్ని వదిలి పెట్టి, పక్కనే ఉన్న ఎత్తైన రాతి స్తంభం మీద కూర్చుంది. కుక్కలు ఆవురావురు మంటూ విస్తర్లలో మిగిలిన పదార్థాలు తింటుంటే, అక్కడున్న ఆహారమంతా నేల పాలయింది. ఆ కుక్కలకు ఒంటిమీద ఎముకలు తప్ప ఏమీ లేదు. ఆహారం కోసం ఒకదానితో మరోటి పోట్లాడుకో సాగాయి. విస్తర్లు చిరిగి పోయి కనిపిస్తున్నాయి. ‘అయ్యో. వీటికి ఎంత దుస్థితి. ఆహారం లేక, ఎముకల గూడులా ఉన్నాయే? నేను అడవి పక్కన చూసిన ఏ కుక్కలు కూడా ఇంత దీనంగా లేవు’ అనుకొంటూ పైకి ఎగిరింది. కొద్ది దూరంలో ఒక చిన్న చెట్టు కనపడ్డది. ‘అహా… మా నివాసము..’ అనుకుంటూ ఆనందంగా వెళ్ళి వాలింది. అప్పటికే కొన్ని పిచ్చుకలు కొమ్మ మీద కూర్చొని ఉన్నాయి. వాటి ఒంటి మీద ఊర పిచ్చుక రంగులు లేవు. రెక్కలకు నల్లటి రంగు పూసినట్లు, మసికొట్టుకొని ఉన్నాయి. ఇంతలో మరో నాలుగు పిచ్చుకలు వచ్చి. ‘దుర్జీ … బుర్…” మని శబ్దం చేస్తూ వచ్చి కొమ్మ మీద వాలాయి. పిట్టలు బలహీనంగా, జబ్బున పడ్డట్లు, దగ్గుతూ కనిపించాయి. పింకీకి ఆశ్చర్య మనిపించింది. ”మీరూ నా జాతి పిట్టలే కదా. ఎందుకలా రంగు మార్చుకొని, నల్లగా తయారయ్యారు?” అడిగింది సందేహంగా.
”లేదు లేదు… మేము ఈ నగరానికి వచ్చినప్పుడు, నీ లాగే అందమైన రూపంతో, హుషారుగా ఉండే వాళ్ళం. ఇక్కడి రోడ్ల మీద తిరిగే వాహనాల కాలుష్యం మా రూపాన్ని మార్చేసింది. ఎప్పుడూ ఈ నల్లటి పొగల్లోనే తిరిగి, మేం కూడా నల్లగా మారిపోయాం. చెప్పలేని జబ్బులు మమ్మల్ని పీడిస్తున్నాయి. గతంలోని ఉత్సాహం లేదు. పరిశుభ్రమైన ఆహారం దొరకదు. ఎప్పుడు ఎవరు ఎందుకు మరణిస్తారో తెలియదు. వీటికి తోడు, ఆ ఎత్తైన సెల్ టవర్లు…. వాటి నించి వెలువడే రేడియేషన్ వలన, ఉన్నట్టుండి మా పిట్టలు చచ్చి పోతున్నాయి. అందుకే మేమిలా ఉన్నాము. చావు కోసం ఎదురుచూస్తూ బతుకులు ఈడుస్తున్నాం”. బాధగా అంది ముసలి పిట్ట. ఈ దగ్గరలో దట్టంగా చెట్లు ఉన్న ప్రాంతం కానీ, తోటలు కానీ లేవా..?” అడిగింది పింకి
”మేం నగరానికి వచ్చిన కొత్తలో ఉండేవి గుబురు వనాలు. పెద్ద గుట్టలు. అందులోనే మేము గూళ్ళు కట్టుకొని కాపురాలు చేసేవాళ్లం. కానీ, ఈ మనుషులు డబ్బు కోసం ఆ చెట్లన్నీ కొట్టేసి, పెద్ద పెద్ద అపార్టుమెంట్లు కట్టారు. ఇప్పుడక్కడ ఒక్క చెట్టు కూడా లేదు. గుట్టల్ని యంత్రాలతో పిండి చేసి, ఆ రాళ్ళను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. రోడ్డున పడి బికారుల్లా తిరుగు తున్నాం. ఎవరి ఇంటి ముందైనా ఒక చెట్టు కనిపిస్తే, అక్కడో గూడు కట్టుకొని జీవిద్దామనుకుంటే, వాస్తు పేరుతోటి ఆ చెట్లను కూడా నరికేయిస్తున్నారు”.
.”ఇంత బాధతో ఎందుకిక్కడ ఉండటం. మా అడవిలోకి రావచ్చు కదా” అంది సానుబూతిగా..
”మేము ఈ నగర జీవితానికి అలవాటు పడిపోయాం. అడవికి రాలేం. నువ్వు క్షేమంగా జీవించాలనుకుంటే, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకు. వెళ్లిపో” అంది హితవు కోరుతూ పెద్ద పిచ్చుక.
నేనిక్కడ ఉండేందుకు రాలేదు. మా అమ్మ కనిపించక, వెదుక్కుంటూ వచ్చాను. వచ్చిన కాడించి అంతా ప్రాణం తీసే శత్రువులే కనిపిస్తున్నారు. ఆకలౌతోంది. ఏవన్నా ఆహారం పెట్టగలరా?” అంది అమాయకంగా.
”నగర జీవితం మన పిట్టలకు పనికి రాదు. అడవులే శ్రేయస్కరం. మీ అమ్మ ఈ దక్షిణం వైపు వెళితే కనిపించొచ్చు. అడవి అటే ఉంది. అన్నట్లు పొద్దటి నించి మేం కూడా ఏవీ తినలేదు. నీకేమీ పెట్టలేం” అంది పిచ్చుక..
”సరే..” అని కతజ్ఞతలు చెప్పి, ఆకాశంలోకి లేసింది. చాలా దూరం వెళ్ళాక, నగరం అంచున కొన్ని పచ్చని చెట్లు కనిపించాయి. గువ్వల మాదిరిగా గంతులు పెడుతూ పాఠశాలలో పిల్లలు కనిపించారు. ఓ ఇరవై మంది పిల్లలు చెట్ల కింద గుండ్రంగా కూర్చొని, ఇంటికాడ నుంచి తెచ్చుకున్న అన్నం కేరియర్లు విప్పుకొని మధ్యాహ్న భోజనాలు చేస్తున్నారు. ప్రాణం లేచి వచ్చింది. రివ్వున పిల్లల ముందు వాలింది. ఒక పాప, ఆలుగడ్డ ముక్కలు తెచ్చి, ముందు పెట్టింది తినమన్నట్లు. మరో బాబు పిడికెడు అన్నం పెట్టాడు. ఆకలితో ఉన్న పింకి, గబగబా తినసాగింది. ఒక బాబు కేరెట్ ముక్కలు చేతిలో పెట్టుకొని, తినమన్నట్లు పింకి ముందు పెట్టాడు. ఎగిరి చేతి మీద వాలి ముక్కలు, ముక్కుతో పొడుచుకొని తిన సాగింది. చేతి మీద పిట్ట వాలినందుకు పిల్లవాడు తెగ సంతోష పడి పోసాగాడు. ఇంతలో ఓ పిచ్చుకల గుంపు వచ్చి మైదానంలో వాలింది. ఆ పిచ్చుకలన్నీ అచ్చం పింకీ లాగే ఉన్నాయి .
”అదిగో మన పింకీ…” అని పిచ్చుకలన్నీ ఒక్కసారే కిచకిచ మన్నాయి. పింకీ మీద పడి ముద్దులు పెట్టుకున్నాయి. కొన్ని ప్రేమగా ముక్కుతో పొడిచాయి. మట్టిలో బొలిపి ఆనంద పడ్డాయి. వాటి ప్రేమకు పింకీ ఉక్కిరి బిక్కిరైంది. ఆ గుంపులో తన తల్లి కూడా ఉంది. పట్టలేని ఆనందంతో తల్లి దగ్గరకు చేరి, సంతోషంతో గంతులు వేసింది.” చెప్పకుండా ఎక్కడకు వెళ్లావు పింకీ. ఎంత భయపడ్డానో నీకేమన్నా అవుద్దని . ఈ నగరంలో మన పిచ్చుకల జీవితం చాలా దుర్బరంగా ఉంది . క్షేమంగా వచ్చావు అంతే చాలు” అని ముద్దు పెట్టుకుంది.
నిన్ను వెదుక్కుంటూ నగరంలో చాలా తిరిగానమ్మా. ఎన్ని అనుభవాలో..? ఇంటికి వెళ్లక చెబుతాలే” అంది పింకీ. బడి పిల్లలకు కతజ్ఞతలు తెలుపుకుంటూ, వాళ్ళ తలల మీద గుండ్రంగా ఒక చుట్టు తిరిగి, తల్లితో అడవి వైపు వెళ్లిపోయింది పింకి.
పుప్పాల కృష్ణమూర్తి – 99123 59345