రెండో భాగంలోనే నా పాత్ర ఎక్కువ..కల్కిపై కమల్ కామెట్స్

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజు రూ.191 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని వీక్షించిన చాలామంది సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. మెగాస్టార్‌ చిరంజీవి ‘సినిమా విజువల్‌ వండర్‌గా, దేశం గర్వించేలా ఉందని చిత్ర బృందాన్ని ప్రశంసించగా, దర్శకధీరుడు రాజమౌళి సినిమా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిందని కొనియాడారు. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్‌ హాసన్ సుప్రీం యాస్కిన్‌ పాత్రతో ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా చెన్నైలో ఈ చిత్రాన్ని ఆయన చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘కల్కి’ రెండో భాగంలోనే నా పాత్ర ఎక్కువ నిడివి ఉంటుందని ముందే చెప్పారు. ఒక అభిమానిగా మొదటి భాగం చిత్రీకరణలో పాల్గొన్నా. భారతీయ సినిమా ఇప్పుడు గ్లోబల్‌ స్థాయిలో సందడి చేస్తోంది. నాగ్‌ అశ్విన్‌కు సహనం ఎక్కువ. పురాణాలను సైన్స్‌కు ముడిపెట్టి కల్కిని అందంగా రూపొందించారు. నన్ను యువనటుల జాబితాలో చేర్చాలా.. అలనాటి నటీనటుల లిస్ట్‌లో చేర్చాలా అని చాలా ఆలోచించారు. చాలా ఓపికగా కథను రాసుకున్నారు. అంతే ఓపికగా తెరకెక్కించారు’’ అని కమల్‌ ప్రశంసించారు. గతంలో ఎన్నో సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించినప్పటికీ కల్కిలో యాస్కిన్‌ పాత్ర భిన్నంగా కనిపించిందన్న ఆయన ఆ పాత్రను అంగీకరించడానికి ఏడాది పాటు ఆలోచించినట్లు తెలిపారు. ఆ పాత్ర తీరు వినగానే చేయగలనా లేదా అనే సందేహం వచ్చినట్లు ఆయన అన్నారు.

Spread the love