ఏడో దశలో…199 మంది అభ్యర్థులు నేరచరితులే !

ఏడో దశలో...199 మంది అభ్యర్థులు నేరచరితులే !– 299 మంది కోటీశ్వరులు
న్యూఢిల్లీ : లోక్‌సభకు జూన్‌ 1వ తేదీన జరిగే ఏడవ, చివరి విడత ఎన్నికల్లో 904 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక ప్రకారం వీరిలో 22 శాతం మంది…అంటే 199 మందికి నేర చరిత్ర ఉంది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగే ఏడో విడత ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల అఫిడవిట్లను ఏడీఆర్‌, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ విశ్లేషించాయి. తుది దశలో బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, ఒడిషా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లోని 57 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
కేసుల స్వభావం
తమపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయని 151 మంది (17 శాతం) అభ్యర్థులు తమ అఫిడవిట్లలో ప్రకటించారు. ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల జైలుశిక్ష పడుతుంది. ఇవి నాన్‌ బెయిలబుల్‌ కేసులు. ఏడో దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 13 మందికి శిక్షలు పడ్డాయి. తమపై హత్య కేసులు నమోదై ఉన్నాయని నలుగురు తెలిపారు. 27 మందిపై హత్యాయత్నం కేసులు, 25 మందిపై విద్వేష ప్రసంగాల కేసులు ఉన్నాయి. మహిళలపై నేరాలకు సంబంధించి 13 మంది అభ్యర్థులపై కేసులు ఉన్నాయి. వీరిలో ఇద్దరిపై అత్యాచారానికి సంబంధించిన ఆరోపణలు ఉండడం గమనార్హం.
పార్టీల వారీగా…
పార్టీల విషయానికి వస్తే ఆమ్‌ఆద్మీ తరఫున పోటీ చేస్తున్న 13 మందిలో ఐదుగురిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వీరిలో నలుగురిపై తీవ్రమైన అభియోగాలు మోపారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన తొమ్మిది మంది అభ్యర్థుల్లో ఏడుగురిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. వారిలో ఆరుగురిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. బీజేపీకి చెందిన 51 మంది అభ్యర్థుల్లో 23 మందిపై క్రిమినల్‌ అభియోగాలు ఉన్నాయి. వీరిలో 18 మందిపై మోపిన ఆరోపణలు తీవ్రమైనవి. తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున తొమ్మిది మంది పోటీ చేస్తుండగా వారిలో ఏడుగురిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి.
సీపీఐ (ఎం)కు చెందిన ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఐదుగురు, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన 13 మందిలో ఎనిమిది మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఇక 31 మంది కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో 12 మంది, సీపీఐకి చెందిన ఏడుగురిలో ఇద్దరు, బీఎస్పీకి చెందిన 56 మందిలో 13 మంది కూడా నేరచరితులే.
కోటీశ్వరులు వీరే
ఏడో దశలో పోటీ పడుతున్న 904 మంది అభ్యర్థుల్లో 299 మందికి కోటి, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన ఆస్తులు ఉన్నాయి. శిరోమణి అకాలీదళ్‌కు చెందిన 13 మంది, అమ్‌ఆద్మీకి చెందిన 13 మంది, బీజేడీకి చెందిన ఆరుగురు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 9 మంది, కాంగ్రెస్‌కు చెందిన 30 మంది, తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిది మంది, బీజేపీకి చెందిన 44 మంది, సీపీఐ (ఎం)కు చెందిన నలుగురు, బీఎస్పీకి చెందిన 22 మంది అభ్యర్థులు కోటీశ్వరులే. వీరిలో అత్యంత ధనవంతుడైన శిరోమణి అకాలీదళ్‌ అభ్యర్థి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ఆస్తుల విలువ రూ.198 కోట్లు. బీజేపీకి చెందిన వైజయంత్‌ పాండా రూ.148 కోట్లు, హిందూత్వ పార్టీకి చెందిన సంజరు టాండన్‌ రూ.111 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఉత్కళ్‌ సమాజ్‌ పార్టీ అభ్యర్థి భానుమతి దాస్‌ తన ఆస్తుల విలువను కేవలం రూ.1,500గా చూపారు.

Spread the love