Tuesday, May 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంథాయ్‌లాండ్‌లో భారత పర్యాటకుడి అనుమానాస్పద మృతి

థాయ్‌లాండ్‌లో భారత పర్యాటకుడి అనుమానాస్పద మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : థాయ్‌లాండ్‌లో పర్యటనకు వెళ్లిన భారత పర్యాటకులకు తీవ్ర అస్వస్థత ఎదురైంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫుకెట్‌లోని ఓ కేఫ్‌లో ఈ నెల 9న నలుగురు భారత టూరిస్టులు అపస్మారక స్థితికి చేరుకున్నారని, వారిలో ఒకరు మరణించారని థాయ్‌లాండ్‌లోని భారత ఎంబ‌సీ ధృవీకరించింది.

స్థానిక అధికారుల కథనం ప్రకారం.. ఈ నెల‌ 9వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఐదుగురు భారతీయ స్నేహితులు (కుశాగ్ర అగర్వాల్, రాహుల్ అగర్వాల్, అమన్ అగర్వాల్, ఆర్యన్ వర్మ, రాహుల్) ఫుకెట్‌లోని కమలా బీచ్ ప్రాంతంలో ఉన్న ఒక కేఫ్‌కు వెళ్లారు. అక్కడ ఉన్నట్టుండి వారిలో నలుగురు స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయారు. కేఫ్ సిబ్బంది వెంటనే స్పందించి అత్యవసర సేవలకు సమాచారం అందించారు. వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

అయితే, చికిత్స పొందుతూ 26 ఏళ్ల కుశాగ్ర అగర్వాల్ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం వచిరా ఫుకెట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మిగతా ముగ్గురి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన భారత రాయబార కార్యాలయం, మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. అసలు పర్యాటకులు ఎందుకు అపస్మారక స్థితిలోకి వెళ్లారన్న కోణంలో స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎంబసీ అధికారులు ఎక్స్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -