గ్రామపంచాయతీ కార్యదర్శి పై విచారణ..

నవతెలంగాణ – చండూరు  
చండూరు  మున్సిపాలిటీలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన పంచాయతీ కార్యదర్శి పై  చర్యలు తీసుకోవాలని రైతు సేవ సహకార సంఘం డైరెక్టర్ కట్ట బిక్షం, జర్నలిస్టు సాగర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డివిజనల్ పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. తప్పుడు దృవీకరణ పత్రాలు జారీచేసిన కార్యదర్శిని పూర్తి రికార్డులతో హాజరుకావాలని డిపిఓ ఆదేశించినప్పటికీ కార్యదర్శి ఎలాంటి రికార్డులు లేకుండా సమావేశానికి రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆధారాలతో ధృవీకరణ పత్రాలు  జారీ చేశారో ఆధారాలు సమర్పించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన ఎనిమిది సంవత్సరాలకు ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ చేసుకోవటం పట్ల వారు అనుమానం వ్యక్తం చేశారు.చండూరు గ్రామపంచాయతిగా కొనసాగిన సమయంలో ఇక్కడ పనిచేసిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు తమవద్ద పంచాయతీ కి సంబంధించిన రికార్డులు లేవని చెప్పటంపట్ల విచారణ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రికార్డులు లేకపోవడం పట్ల ఇంకా ఏ స్థాయిలో  అక్రమాలు జరిగాయో విచారణ చేయాలని అధికారులు ను జర్నలిస్టులు  డిమాండ్ చేశారు. అనంతరం అక్రమార్కులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఖాళీ ఇంటి స్థలాన్ని వారు పరిశీలించారు. ధ్రువీకరణ పత్రాలకు, స్థలానికి ఎలాంటి సంబంధం లేకపోవడంతో తప్పు జరిగినట్టు వారు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అనంతరం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి  తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఒకే రోజు తొమ్మిది డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్ లు అన్ని  ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ సమయంలో నే కావటం పట్ల అనుమానం వ్యక్తంచేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి  ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్న ఇంటి నెంబర్లకు,ఇంటి స్థలానికి పొంతన లేక పోవడం పట్ల విచారణ అధికారులు ఆశ్చర్య వ్యక్తం చేశారు. రెండు రోజులలో పూర్తిస్థాయి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పించి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఓ అనురాధ, జర్నలిస్టులు వంగూరి నగేష్,కంచర్ల అంజయ్య,ఎజాజుద్దీన్,సంగెపు మల్లేష్,బొల్లం పరమేష్, గంట శ్రీను,జక్కలి నాగరాజు,కర్నాటి వెంకటేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love