Wednesday, March 4, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిభద్రతలేని బతుకులు

భద్రతలేని బతుకులు

- Advertisement -

ఏపీలోని కాకినాడ జిల్లా బాణాసంచా తయారీ కేంద్రంలో మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్న సమయంలో పేలుడు జరిగి ఇరవై మూడు మంది చనిపోయారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు దెబ్బతిన్నాయి. రెండేళ్ల కిందట ఇదే కర్మాగారంలో పదిమంది చనిపోయారు. 2024 నుంచి ఇలాంటి ప్రమాదాలు పలుచోట్ల ఎనిమిదికి పైగా జరిగినా ప్రభుత్వం నుంచి చలనం లేదు. దేశంలో పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా పారిశ్రామిక భద్రతా విధానాన్ని తీసుకురావడం లేదు. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు మెరుగైన వసతి కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించకపోవడంతో కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

తెలంగాణలో కూడా సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించి 42మంది కార్మికులు చనిపోయారు. పరిశ్రమల భద్రత కోసం ఏర్పాటు చేసిన రెగ్యులేటరీ వ్యవస్థ ఎందుకూ పనికి రాకుండా పోయింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేలా విధానాలు రూపొందించాలి, ఫ్యాక్టరీలపై బలమైన పర్యవేక్షణ యంత్రాంగం, థర్డ్‌ పార్టీ తనిఖీలు ఉండడం లేదు. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇచ్చేలా చూడాలి. అలాగే జనావాసాలలో పరిశ్రమలు, గోదాములు, రద్దీ ప్రదేశాలలో ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిశ్రమల పట్ల ప్రభుత్వం కొరడా ఝుళిపించాలి. కానీ, ఎక్కడైనా ఇది జరుగుతుందా?

పారిశ్రామిక ప్రమాదాలు, గోదాములు, గుజరీ, తుక్కు వ్యాపార సముదాయాలల్లో నివారణ చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించక ఏండ్లు గడుస్తున్నాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత పనికిమాలిన సెక్షన్లు విధించి యజమానులు బయటకు వేస్తున్నారు తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. ప్రతినెలా పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ అంశంపై విస్తృతంగా చర్చించి నివారణోపాయాలు వెతకాలి. కొత్తగా ఇండస్ట్రియల్ సేఫ్టీ పాలసీ తీసుకువచ్చి, పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ పటిష్టం చేయాలి. దాదాపు డెబ్భై శాతం వాణిజ్య సముదాయాలు, షాపులు, గోదాములలో ఫైర్‌ ఎక్సటెంగ్విషర్లు ఉండటం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోని పరిశ్రమలు, ఇండస్ట్రియల్ పార్కులను హై రిస్క్‌ జోన్లను గుర్తించాలి. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమలున్నాయన్న వివరాలు ఇండస్ట్రియల్ అట్లాసులో పొందుపరచాలి.

పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారు కూడా ఇదే చేయాలి. కేటగిరీ ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో నిర్ణయించుకునేలా వివరాలుండాలి. పరిశ్రమలు కాంప్లియన్స్‌ నివేదికలను ఏడాదికి రెండుసార్లు ఇచ్చేలా చూడాలి.స్థానిక రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వారిని ఇండస్ట్రియల్, గోదాముల సేఫ్టీ సంఘంలో బాధ్యులుగా చేర్చాలి. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నామన్న అంశాన్ని సంబంధిత కంపెనీలు బోర్డులపై ప్రదర్శించాలి. థర్డ్‌ పార్టీ తనిఖీలు కూడా వీటిపై ఉండాలి. కేవలం పరిశ్రమల్లోనే కాకుండా ఇండస్ట్రియల్ పార్కుల్లో కూడా నిబంధనలు అమలవుతున్నాయా? లేదా? చూడాలి. పర్యవేక్షణ యంత్రాంగం బలంగా ఉండాలి. ఇప్పుడు జరిగిన దుర్ఘటనల్లో నిరోధకాలు ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదు. ఎవరూ పర్యవేక్షణ చేయకపోవడంవల్లే ఈ సమస్య వచ్చింది.

పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్‌ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానాలు వేస్తారు. కానీ, మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు.ఇక్కడా ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలి. పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. దేశంలోని పరిశ్రమల్లో సురక్షిత వాతావరణం కల్పించడం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి, ఇందుకోసం జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, బాయిలర్స్‌ విభాగం ఇన్‌స్పెక్టర్‌, కాలుష్య నియంత్రణ మండలి ఆర్వో, డిప్యూటీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌, జిల్లా అగ్నిమాపక అధికారి సభ్యులుగా జిల్లా స్థాయి కమిటీని రూపొందించాలి. బాయిలర్స్‌ విభాగంలో, పరిశ్రమల శాఖలో, అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలి. పరిశ్రమల్లో వంద రోజుల కొకసారి స్పెషల్‌ డ్రైవ్‌ను పూర్తి చేసి, ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలి. విష, ప్రమాదకర రసాయనాల తయారీ పరిశ్రమలు పదార్థాలను నిల్వచేసి, విభాగాలుగా వర్గీకరించాలి. పనిచేసేచోట ప్రమాద నివారణకు చర్యలు చేపట్టాలి.

  • డా.ముచ్చుకోట సురేష్‌ బాబు, 9989988912
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -