సోలార్‌ లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయండి

– రామారావుపేట్‌ గ్రామస్తుల విజ్ఞప్తి
నవతెలంగాణ-జైపూర్‌
ఇందారం నుండి రామారావుపేట్‌ వరకు చెరువు కట్ట మీదుగా నిర్మించిన రోడ్డులో సోలార్‌ లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని రామారావుపేట్‌ గ్రామస్థులు కోరుతున్నారు. ఒక వైపు చెరువు మరో వైపు పంట పొలాలు, చెరువు కట్ట మీదుగా ప్రయాణం ప్రమాదకరంగా మారిందని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ మేరకు గ్రామ పంచాయతి కార్యదర్శి ద్వార సింగరేణి శ్రీరాంపూర్‌ ఏరియా జనరల్‌ మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. శ్రీరాంపూర్‌, ఇందారం ఓపన్‌కాస్ట్‌ గనుల విస్తరణతో రామారావుపేట్‌ గ్రామానికి సంబంధించిన దారులన్నీ మూసుకుపోవడంతో చెరువు కట్ట మీదుగా ప్రయాణించడం తప్ప మారో మార్గం లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్ట మీదుగా రాత్రి పూట ప్రయాణించాల్సిన సంధర్భంలో ఎప్పుడు ఏ ప్రమాదంలో ఇరుక్కొవల్సి వస్తుందో తెలియకుండా ఉన్నదని పేర్కొంటున్నారు. రామారావుపేట్‌ గ్రామానికి సంబంధించిన ఇతర మార్గాలను శ్రీరాంపూర్‌ ఓసీ విస్తరణతో మూసి వేశారని గ్రామస్థుల సౌకర్యార్థం ఇందారం-రామారావుపేట్‌ మధ్య రోడ్డు విస్తరిస్తూ పున:నిర్మించినట్లు తెలిపారు. అదే క్రమంలో చెరువు కట్ట మీదుగా రోడ్డు పొడవు లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తామని గతంలో సింగరేణి అధికారులు హామీ ఇచ్చినప్పటికి నిర్లక్ష్యం చేస్తుండటం ఇబ్బందిగా మారిందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామస్థులు సింగరేణి శ్రీరాంపూర్‌ జీఎం సంజీవ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై స్పందించిన జీఎం సంజీవ రెడ్డి సోలార్‌ లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు హామీ ఇచ్చినట్లు స్థానిక నాయకులు నామాల తిరుపతి, తంగళ్లపల్లి వెంకటేశ్‌, ముదాం రమేష్‌, దుర్గం రాజకుమార్‌, గోలి యాదగిరి, గుండ శ్రీనివాస్‌ తెలిపారు.

Spread the love