మహిళా సంఘం సభ్యురాలు చనిపోతే రూ.2 లక్షల బీమా

women's association– 15 రోజుల్లో క్లయిమ్‌ వివరాలు సమర్పిస్తేనే అర్హులు
– లోన్‌ బీమా పథకం మార్గదర్శకాలు జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహిళా సంఘం సభ్యురాలు చనిపోతే రూ.2 లక్షలను మహిళా సంఘం ఖాతాల్లో జమచేసే లోన్‌ బీమా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను స్త్రీ నిధి క్రెడిట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.విద్యాసాగర్‌ రెడ్డి గురువారం విడుదల చేశారు. గుండె, రక్త, డయాబెటీస్‌, కాలేయ, ఊపిరిత్తులు, మూత్రపిండ సంబంధిత, క్యాన్సర్‌, అనీమియా, కామెర్లు, ప్రసవ మరణాలు, అపెండెంటీస్‌, వైరల్‌ ఫీవర్‌, హెచ్‌ఐవీ, పాండమిక్‌, అల్జీమర్స్‌, మస్క్యూలర్‌ డిస్టోప్రీ వ్యాధులతో మరణించిన వారికి ఈ బీమా వర్తించనున్నది. రోడ్డు, ట్రైన్‌, విమాన, ఫైర్‌ ప్రమాదాలు, కరెంట్‌ షాక్‌, జంతువుల దాడి, ఉద్యోగ సమయంలో ప్రమాదానికి గురికావడం, క్రీడల్లో ప్రమాదానికి గురికావడం, వరదలు, ప్రకృతివిపత్తులు, పిడుగులు పడిన సందర్భాల్లో మరణించినా, వంద శాతం, యాభై శాతం వైకల్యం పొందినా బీమా వర్తిస్తుంది. ఎస్‌హెచ్‌జీ గ్రూపులో 18 ఏండ్లకు పైబడి ఈ ఏడాది మార్చి 14 వరకు 60 ఏండ్ల లోపు వారికి వర్తిస్తుంది. సభ్యురాలు చనిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో జాప్యం జరుగకుండా వీఓ/ఎస్‌ఎల్‌ఎఫ్‌ అధికారులు వెంటనే తమ ట్యాబ్‌లలో అప్‌లోడ్‌ చేయాలి. జాప్యం చేస్తే క్లయిమ్‌ను పరిగణనలోకి తీసుకోరు. మరణంపై ధ్రువీకరించేందుకు సంఘంలోని 80 శాతం సభ్యులు సమావేశం కావాలి. సంబంధిత వీఓ/ఎస్‌ఎల్‌ఎఫ్‌ ఆ సమావేశాన్ని సమన్వయం చేయాలి. మరణ క్లయిమ్‌కు సంబంధించి రికార్డు డిటేయిల్స్‌పై సంఘం సమావేశంలో సమగ్రంగా చర్చ జరగాలి. ఆన్‌లైన్‌ క్లయిమ్‌ ఏడు రోజుల్లో ఉన్నతాధికారులకు సమర్పించాలి. అందులో చనిపోయిన సభ్యురాలి మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, ఇతర గుర్తింపు కార్డు, సంఘం చేసి తీర్మానం, వీఓ/ఎస్‌ఎల్‌ఎఫ్‌ తీర్మానం, చనిపోయిన సభ్యురాలు లోన్‌ తీసుకున్నప్పటి నుంచి చనిపోయే వరకు ఆమె ఖాతాకు సంబంధించిన లావాదేవీల వివరాలు పొందుపర్చాలి. ప్రమాదాల్లో మరణిస్తే ఎఫ్‌ఆర్‌ఐ కాపీ, పోస్టుమార్టం రిపోర్టు, మెడికల్‌ రిపోర్టు తప్పనిసరి. ఈ క్లయిమ్‌ క్షేత్రస్థాయిలో స్త్రీనిధి ఏఎమ్‌ లేదా మేనేజర్‌ తనిఖీ చేయాలి. ఈ రిపోర్టును రీజనల్‌ మేనేజర్‌ పంపిస్తే అక్కడ పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే బీమాకు అర్హురాలు అని స్త్రీనిధి రాష్ట్ర కార్యాలయానికి రీజినల్‌ మేనేజర్‌ సిఫారసు చేస్తారు. మూడు రోజుల్లో స్త్రీనిధి రాష్ట్ర కార్యాలయంలో సెటిల్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా 15 రోజుల్లో పూర్తికావాలి. ఈ బీమా వీఓ/ఎస్‌ఎల్‌ఎఫ్‌ యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాలి.

Spread the love