ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

– ఫస్టియర్‌కు 91.72 శాతం, సెకండియర్‌కు 91.69 శాతం హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1 పరీక్షను నిర్వహించామని తెలిపారు. 85,165 మంది దరఖాస్తు చేయగా, 78,113 (91.72 శాతం) మంది హాజరయ్యారని వివరించారు. 7,052 (8.28 శాతం) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఖమ్మంలో ఇద్దరు విద్యార్థులపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులను నమోదు చేశామని వివరించారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 పరీక్షను నిర్వహించామని తెలిపారు. 32,310 మంది దరఖాస్తు చేస్తే, 29,625 (91.69 శాతం) మంది పరీక్ష రాశారని వివరించారు. 2,685 (8.31 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఒక విద్యార్థిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసును నమోదు చేశామని తెలిపారు.

Spread the love