ఇంటర్ ప్ర  ‘వేశాలు’

– విద్యాసంస్థల అక్రమ బాగోతం 
– అనుమతి లేకుండా అడ్డగోలు అడ్మిషన్లు
– సెప్టెంబర్ వరకు అనుమతి  ఇవ్వడం బోర్డుకి అలవాటే
– ఇది మాకు అలవాటేనంటున్న కళాశాల యాజమాన్యాలు
– అంటి  ముట్టనట్టు ఉంటున్న  అధికారులు
– కాసులకు కక్కుర్తి పడి చేతులు దులుపుకుంటున్న వైనం 
– విజిలెన్స్ దాడులు నిర్వహించాలని విద్యార్థి సంఘాల డిమాండ్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఇంటర్మీడియట్ అన్నది ఎంతో ముఖ్యమైన మజిలీ.. ఈ మజిలీ దగ్గరే విద్యార్థుల ఉన్నతమైన భవిష్యత్తు నిర్మితం అవుతుంది.ఇక్కడి నుండే  విద్యార్థుల  భవిష్యత్తు విద్యా ప్రణాళిక మొదలవుతుంది. ఉన్నతమైన డాక్టర్లుగా.. ఇంజనీర్లుగా.. ప్రొఫెషనల్ గా మారడానికి ఇంటర్మీడియట్ విద్యా ప్రామాణికంగా మారుతుంది. ఇంటర్ ను బేస్ చేసుకుని ఎన్నెన్నో ఎంట్రన్స్  ఎగ్జామ్స్ నిర్వహణ  జరుగుతుంది. ఏ విద్యార్థి అయినా ఈ మజిలీలో పొరపాటు చేస్తే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఇంటర్మీడియట్ గా మారాలన్న ఇంటర్ ఇడియట్ గా మారాలన్న ఇక్కడే పునాది పడుతుంది.అంతటి ప్రాముఖ్యత కలిగిన ఇంటర్ విద్యను కొందరు వ్యాపారంగా మార్చేస్తూ.. స్వలాభం కోసం లక్షల గడిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు.కొందరు ఇంటర్మీడియట్  విద్యాసంస్థల యాజమాన్యం వారు చేస్తున్న దుర్మార్గపు పనులతో బావి భారత పౌరుల బౌతవ్యం అంధకారమవుతుంది. అలాంటి కోవకే చెందుతాయి నల్లగొండ జిల్లాలోని అనుమతులు లేని కొన్ని  జూనియర్ కళాశాలలు. వివరాల్లోకి వెళితే ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల ఉదాసీనత వైఖరి వల్ల జిల్లాలో పలు జూనియర్ కళాశాల లు అనుమతి లేకుండానే అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. అనుమతి లేని కాలేజీలలో యాజమాన్యాలు అడ్మిషన్లు నిర్వహిస్తున్న డిఐఈఓ ఇదేమి తనకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం  136 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు నడుస్తున్నాయి. ప్రైవేటు కళాశాల ఏర్పాటు చేసేందుకు బోర్డు నిబంధనల ప్రకారం యాజమాన్యం సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కానీ నిబంధన ప్రకారం కావాల్సిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించకుండానే కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారులు అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.
అనుమతులు లేనివి ఎనిమిది..
నల్లగొండ జిల్లాలో అధికారికంగా జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఇచ్చిన లెక్కల ప్రకారం అనుమతి లేని కళాశాలలు 8 ఉన్నాయి. అందులో దేవరకొండలో 4, చిట్యాల 1, నల్లగొండ 1, హాలియాలో 1, త్రిపురారంలో 1 ఉన్నట్లు చెప్పారు.
అనుమతి లేకుండా.. షాపింగ్ కాంప్లెక్స్ లో నిర్వహణ
దేవరకొండ నియోజకవర్గం లోనే అధికంగా అనుమతి లేని జూనియర్ కళాశాలలు నడుస్తున్నాయి. డిఐఈవో చెప్పిన లెక్కల ప్రకారం జిల్లాలో 8 జూనియర్ కళాశాలలు అనుమతి లేకుండా నడుస్తున్నాయి. దేవరకొండ పట్టణంలో సత్యసాయి జూనియర్ కళాశాల, భవిత జూనియర్ కళాశాల, గాయత్రి ఒకేషనల్ జూనియర్ కళాశాల, కొండమల్లేపల్లి పట్టణంలో సాయి ప్రకర్ష ఒకేషనల్ జూనియర్ కళాశాలలు నడుస్తున్నాయి. ఇవి కాక చిట్యాల, నల్లగొండ పట్టణాలలో కూడా అనుమతి లేకుండా జూనియర్ కళాశాలలు బాహాటంగా నడుస్తున్నాయి. అయితే దేవరకొండ పట్టణంలోని సత్యసాయి జూనియర్ కళాశాల ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా అడ్మిషన్లు నిర్వహిస్తోందని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.షాపింగ్ కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్న ఈ భవనానికి ప్రతి సంవత్సరం అధికారులు అనుమతి ఇవ్వకుండా విద్యార్థులు ఫీజు కట్టే సమయంలో ముడుపులు తీసుకొని అనుమతులు ఇస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ కళాశాలలో ఫైర్ సేఫ్టీ, పొల్యూషన్ అనుమతి ఇచ్చే పరిస్థితి లేదని, కింద షాపింగ్ కాంప్లెక్స్ పైన గృహాల సముదాయం, ఏ కాంప్లెక్స్ లో ఫంక్షన్ హాల్ ఉండడంతో నిబంధనల ప్రకారం ఈ కళాశాలకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని, అయినా ఇంటర్మీడియట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కానీ గత నాలుగైదు సంవత్సరాలుగా విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టే చివరి తేదీ వరకు  మరుసటి సంవత్సరం నిబంధనల ప్రకారం ఫైర్ సేఫ్టీ, పొల్యూషన్ సర్టిఫికెట్లను జతచేస్తామని బోర్డు అధికారులకు లెటర్ ఇచ్చి అనుమతులను తెచ్చుకుంటున్నారు. కానీ యాజమాన్యం ఏ సంవత్సరం కూడా ఇచ్చిన హామీ మేరకు ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేయడం లేదు. ఒకే భవనంలో జూనియర్ కాలేజీని, డిగ్రీ కాలేజీని నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇది నేరం. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవడమే కాకుండా అందుకు  సహకరిస్తున్న ఇంటర్మీడియట్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు విద్యార్థి సంఘ నాయకులు  డిమాండ్ చేస్తున్నారు.
మాయాజాలం..
ఇంటర్ ప్రవేశాలపై కళాశాలల యాజమాన్యాలు మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. అఫిలియేషన్(అనుమతి) లేకున్నా తమ కళాశాలలో చేరాలంటూ విద్యార్థులపై ప్రలోభాలు, ఒత్తిడి తెస్తున్నాయి. విద్యార్థి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు లేకుండానే అడ్మిషన్లు చేపడుతున్నాయి. జిల్లాలో 51 ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. అఫిలియేషన్(కళాశాల గుర్తింపు) పొందాలంటే ఆట స్థలం, అగ్నిమాపక అనుమతులు, కాలుష్యం, భవన పటిష్టత, ట్రాఫిక్, తదితర ధ్రువీకరణ పత్రాలు అవసరం. బోధకులు, సిబ్బంది, వివరాలన్ని ఉంటేనే అనుబంధ గుర్తింపు లభిస్తాయి. కళాశాలల్లో అన్ని సౌకర్యాలుంటేనే అనుమతులు ఇస్తారు. ఇందులో ఏ ధ్రువీకరణ పత్రం లేకపోయినా అధికారులు గుర్తింపు సిఫారసు చేయరు. ఒకచోట బోధన చేస్తున్న అధ్యాపకులు, మరోచోట పనిచేయడానికి అవకాశం ఉండదు. అనుమతులు పొందిన వారే కళాశాలలు నిర్వహించాల్సి ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి: దస్రు నాయక్ (జిల్లా ఇంటర్మీడియట్ అధికారి)
నల్లగొండ జిల్లాలోనే కాదు. రాష్ట్రవ్యాప్తంగా చాలా జూనియర్ కళాశాలలు అనుమతి లేకుండా నడుస్తున్నాయి. విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టేనాటికి బోర్డు అనుమతి ఇవ్వడం సాధారణమే. నల్లగొండ జిల్లాల్లో 8 కళాశాలలు అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న మాట వాస్తవమే. హైదరాబాదులో కూడా షాపింగ్ కాంప్లెక్స్ లలో కళాశాలలు నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆదేశాలు ఇస్తేనే  చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
Spread the love