మత్తు..యువత చిత్తు

– నేడు మహేశ్వరం ప్యాబ్‌ సీటీలో సదస్సు
– చిన్న వయసులోనే మత్తుకు బానిసై..
– కీలక రంగాలపై తీవ్ర ప్రభావం
– సమాజం మొత్తం స్పందించాలి
– తల్లిదండ్రుల నిఘా తప్పనిసరి డీసీపీ సునీతారెడ్డి
మత్తు యువతను చిత్తు చేస్తోంది. గతంలో గుట్కాలు, నాటుసారా వ్యవనాలకు బలైన యువత ఇప్పుడు గంజాయి, డ్రగ్స్‌ వంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. ఇటీవల బెంగళూరు రేవ్‌ పార్టీ కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మాదక ద్రవ్యాల నియంత్రణపై ఉక్కుపాదం మోపుతున్నా చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. రంగారెడ్డి జిల్లాలో పట్టుబడుతున్న కేసులే దీనికి నిదర్శనం. నేడు ‘ప్రపంచ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణ దినోత్సవం’ సందర్భంగా నేడు మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. అందుకు మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల నుంచి యువతను భారీ స్థాయిలో ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నారు. అందుకు స్థానిక పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.
నవతెలంగాణ-రంగారెడ్దిప్రతినిధి
14 నుంచి 19 ఏండ్ల వయసు వారు ఎక్కువగా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. అతి పేద కుటుంబాలకు చెందిన లేదా.. అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన యువత ఉంటున్నారు. గంజాయి కేసులో అరెస్టు అవుతున్న వారిలో 99 శాతం యువత ఉంటుంది. మరోవైపు పోలీసు శాఖ మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. యువతకు అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. చెడు వ్యసనాలకు, మత్తుకు దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగానే మహేశ్వరంలో నేడు అవగాహన సదస్సు నిర్వహించనుంది. మరోపక్క ప్రభుత్వం గుడుంబా రహిత రాష్ట్రం, గంజాయి రవాణా, వినియోగాన్ని పూర్తిగా రూపుమాపాలనే లక్ష్యాలు నిర్దేశించింది. ఆగస్టులోపు లక్ష్యాలు పూర్తి చేయాల్సిన ఆబ్కారీశాఖ తనిఖీలు ముమ్మరం చేసింది.
ఆ రంగాలపై ప్రభావం
మత్తు పదార్థాల వినియోగం పెరిగిన నేపథ్యంలో కొన్ని రంగాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయనే అంతర్గత నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. ఈ జాబితాలో విద్యా, క్రీడా, యువజన రంగాలను ప్రముఖంగా పేర్కొన్నట్టు సమాచారం. నివేదికను అనుసరించే ఇటీవల ప్రభుత్వం తనిఖీల శాఖలను అప్రమత్తం చేసి లక్ష్యాలు విధించింది. పది తర్వాత ఉన్నత ఆశయాలతో తల్లిదండ్రులు మహా నగరాలకు పంపిస్తున్న పిల్లలు కొందరు అక్కడ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. దీంతో విద్యా సంస్థలు అప్రమత్తమయ్యాయి. జిల్లా సరిహద్దు పట్టణాలు, శివారు గ్రామాల్లో ఉండి చిన్నచిన్న పనుల కోసం కొందరు యువకులు కాల క్రమేణా గంజాయి వినియోగిస్తూ, విక్రయిస్తూ పట్టుబడ్డారు.

తల్లిదండ్రుల నిఘా తప్పనిసరి
పట్టుబడే సమయానికి వ్యసనం దశ నుంచి విక్రయించే దశకు చేరుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై కచ్చితంగా దష్టి పెట్టాలి. అతి గారాబం, అతి నమ్మకం పనికిరాదు. ఇంట్లో, బయట వసతి గహాల్లో ఉంటూ చదువుకుంటున్న పిల్లల వ్యవహార శైలిని కనిపెట్టుకొని ఉండాలి. దొరికితే భవిష్యత్తు ఉండదనే స్పహ కల్పించాలి. కేవలం ప్రభుత్వ శాఖలే కాకుండా యావత్‌ సమాజం మొత్తం పదార్థాలపై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాలనీ కమిటీలు ప్రభుత్వ ఉద్యోగులు యువజన, విద్యార్థి సంఘాలు, సాధారణ ప్రజలు సైతం దీనికి వ్యతిరేకంగా నిలవాలి. అందుకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మహేశ్వరంలో యువతకు అవగాహన కల్పిస్తున్నాం. గాంజా, గుట్కా, జడదా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఈ సదస్సు ఏర్పాటు చేశాం.
– సునీతా రెడ్డి, డీసీపీ మహేశ్వరం

Spread the love