అక్రమ మైనింగ్‌ పై విచారణ..

– ఎక్కడి వారు అక్కడ గప్ చుప్
నవతెలంగాణ కు స్పందన
నవతెలంగాణ – బాన్సువాడ, నసురుల్లాబాద్
బాన్సువాడ మండలంలో నిర్వహిస్తున్న అక్రమ మొరం రవాణా వ్యవహారాలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మైన్స్‌ అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. బుధవారం  ‘గుట్టలను తవ్వేస్తున్న మురమ్మాఫియా’ అన్న శీర్షికతో నవతెలంగాణ దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మైన్స్  శాఖ అధికారిణి , రెవెన్యూ అధికారి కలసి విచారణ చేపట్టారు. పత్రికల్లో వార్త రావడంతో తనిఖీలు నిర్వహించినట్లు బాన్సువాడ తాసిల్దార్ వరప్రసాద్ తెలిపారు. అనుమతులు లేకుండా మైనింగ్‌ నిర్వహిస్తే, చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని బాన్సువాడ తహసిల్దార్ వరప్రసాద్ హెచ్చరించారు. నవతెలంగాణ వార్తాపత్రికలో అక్రమ మొరంపై వార్త ప్రచురితం కావడంతో, పాటు పేపర్ కటింగ్ వాట్స్అప్ గ్రూపుల్లో షేర్ కావడంతో అప్రమత్తమైన కొందరు. అలాగే అధికారుల అండదండలు ఉన్న మరో గ్రూప్ వారు నేడు బుడిమి, కొత్తబాది, సింగీతం శివారులో మధ్యాహ్నం వరకు జోరుగా అక్రమ మొరం రవాణా సాగింది. మైనింగ్ అధికారులు వస్తున్నారని సమాచారంను స్థానిక రెవెన్యూ అధికారులు కొందరు మొరం మాఫియా కు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన మొరం మాఫియా దీనితో ఎక్కడి వాహనాలు అక్కడ కొద్దిసేపు నిలిపివేశారు. మైన్స్ , రెవెన్యూ అధికారులు విచారణకు వెళ్లినప్పుడు అక్కడ వాహనాలు లేకపోవడంతో అధికారులు వెనుతిరి గారు. మొరం మాఫియాకు రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతోనే బాన్సువాడ మండలంలో అక్రమ మొరం రవాణా సాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా మొరం తరలిస్తున్నట్లు ఆరోపణలు నేపథ్యంలో అధికారులు వారి వంక చూడడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మొరం మాఫియా చేస్తున్న అక్రమ మైనింగ్‌పై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Spread the love