ఇజ్రాయెల్‌ మారణకాండ!

Israel massacre!పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్‌కు మద్దతు పలికేందుకు బుధవారం నాడు అమెరికా అధినేత జో బైడెన్‌ వచ్చి వెళ్లాడు. అతగాడి అడుగులో అడుగు వేస్తూ బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ గురువారం నాడు వెళ్లి, మేము కూడా మీతోనే ఉన్నాము అని చెప్పాడు. పశ్చిమదేశాల వారు రోజూ హక్కుల గురించి పేజీలకు పేజీలు సుభాషితాలు, మానవత్వం గురించి కడవల కొద్దీ కన్నీరు కారుస్తుంటారు. పచ్చి దుర్మార్గాలకు పాల్పడతారు, దురాగతాలను సమర్థిస్తారు. గాజా లోని ఒక ఆసుపత్రి మీద ఇజ్రాయెల్‌ విమానాలు బాంబులు వేసి 471 మంది రోగులు, సిబ్బందిని చంపిన తరువాత కూడా మేము మీతోనే ఉన్నాము, మీరింకా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని పెద్దఎత్తున మరిన్ని తీవ్ర దాడులు చేయండి, హమాస్‌ సాయుధులను అణచి వేయండి అని యూదు దురహంకారులకు వత్తాసు పలకటంకంటే మరొక అమానుషం లేదు. ఇలాంటి వారు గనుకనే మానవతా కారణాలతో దాడులను ఆపివేయాలని భద్రతా మండలిలో గడచిన మూడు రోజుల్లో పెట్టిన రెండు తీర్మానాల్లో ఒకటి వీగిపోగా, రెండవ దాన్ని అమెరికా వీటో చేసింది. ఇజ్రాయెల్‌ దాడులను పూర్తిగా సమర్థిస్తున్నట్లు బైడెన్‌ నిస్సిగ్గుగా చెప్పాడు. 2001లో న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడి సందర్భంగా తాము చేసిన పొరపాట్లను పునరావృతం కానివ్వవద్దని కూడా సలహా ఇచ్చాడు.
గాజా ప్రాంతంలోని ఆల్‌ అహిల్‌ ఆసుపత్రి మీద పాల స్తీనా తీవ్రవాదులే దాడి చేశారంటూ ఇజ్రాయెల్‌ చేస్తున్న ప్రచారాన్ని పశ్చిమదేశాల మీడియా అందుకుంది. ఆసుపత్రి మీద దాడి అంతర్జాతీయ యుద్ధనేరం గనుక అలాంటి ప్రకటనను ముందే సిద్ధం చేసి పెట్టుకుందన్నది స్పష్టం. దాని చరిత్ర తెలిసిన వారికి ఆశ్చర్యం కలిగించటం లేదు, కట్టుకథలను ఎవరూ నమ్మటం లేదు. ఆసుపత్రిపై బాంబు లతో సహా తాజా దాడుల్లో మొత్తం 750 మంది పిల్లలు మరణించినట్లు చెబుతున్నారు. బైడెన్‌ వచ్చి వెళ్లిన తరు వాత ఇజ్రాయెల్‌ దాడులను పెంచింది, దానికి ప్రతిగా ఇతర ప్రాంతాల్లో ఉన్న పాలస్తీనియన్ల బృందాలు కూడా దాడులు చేస్తున్నట్లు వార్తలు. తన అష్టదిగ్బంధంలో ఉన్న గాజాలోని 23లక్షల మంది పౌరు లకు విద్యుత్‌, మంచినీటితో సహా అన్ని రకాల సరఫరాలను ఇజ్రా యెల్‌ నిలిపివేసింది. బాంబు దాడు ల్లో వందలాది మరణించగా వేలాది మంది గాయపడ్డారు. వారికి అవస రమైన ఔషధాలు, ఇతర సరఫరాలు చేసేందుకు మానవతా పూర్వకంగా దాడులను నిలిపివేయాలని ఇజ్రా యెల్‌ను ఆదేశించేందుకు భద్రతా మండలిలో బుధవారం నాడు బ్రెజిల్‌ పెట్టిన తీర్మానాన్ని మొత్తం 15కు గాను 12 మంది సమర్ధించగా దాన్ని చెల్లకుండా అమెరికా వీటో చేసింది. అంతకుముందు సోమవారం నాడు మానవతా పూర్వక కారణాలతో దాడులను నిలిపి వేయాలని కోరుతూ రష్యా ప్రవేశపెట్టిన తీర్మానానికి చైనా మరో మూడు దేశాలు మద్దతు పలకగా నాలుగు దేశాలు వ్యతిరేకించాయి, ఆరుగురు ఓటింగ్‌లో పాల్గొనకపోవటంతో అది వీగిపోయింది. బ్రెజిల్‌ ప్రవేశ పెట్టిన తీర్మానంలో పౌరులపై దాడులు ఆపాలని, కాల్పు లను విరమించాలనే అంశం లేదంటూ వాటిని చేర్చాలని రష్యా ప్రతిపాదించిన రెండు సవరణలు వీగిపోయాయి. దాంతో తీర్మానం వృథా అంటూ ఓటింగ్‌కు వెళ్లలేదు. ఇజ్రా యెల్‌ ఆత్మరక్షణ హక్కు గురించి పేర్కొనలేదు గనుక తాము వీటో చేస్తు న్నట్లు అమెరికా పేర్కొ న్నది. ఆ సాకునే చెబు తూ బ్రిటన్‌ ఓటింగ్‌లో పాల్గొనలేదు.
1947లో ఐరాస తీర్మానం చేసినప్పటి నుంచి అంతకు ముందే శిక్షణ పొంది సిద్ధంగా ఉన్న ఇజ్రాయెల్‌ సాయుధ మూకలు పాలస్తీనా ప్రాంతాలపై దాడులకు దిగి అరబ్బులను తరిమివేసి వేలాది మందిని హత్య చేసిన దుర్మార్గం తెలిసిందే. దొంగే దొంగ అన్నట్లుగా తానే దాడులు చేస్తూ, ప్రాంతాలను ఆక్రమిస్తూ తనకు రక్షణ కావాలంటూ అప్పటి నుంచి ఆడుతున్న నాటకాలకు అమెరికా మొదటి నుంచీ మద్దతు ఇస్తోంది. ఇప్పటికీ అదే పాట పాడుతోంది. భారీ ఎత్తున నిధులు, ఆయుధాలు అందచేస్తున్న ఏకైక దేశంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈజిప్టు నుంచి మానవతా పూర్వక సాయాన్ని అందించేందుకు ఇజ్రాయెల్‌ను ఒప్పించినట్లు, జో బైడెన్‌ తిరుగు ప్రయాణంలో విలేకర్లతో చెప్పాడు. ప్రపంచ మంతటా పెరుగుతున్న ఒత్తిడి మేరకు విధిలేక జరిగింది తప్ప అమెరికా మారుమనసు పుచ్చు కొన్న ఫలితం కాదు. చివరికి ఇజ్రాయెల్‌ను సమర్ధిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా కారకులు ఎవరో చెప్పకుండా ఆసు పత్రిపై బాంబుదాడిని ఖండించాల్సి వచ్చింది. అరబ్బు దేశాలలో ఉన్న చీలిక కారణంగానే అమెరికా, ఇజ్రాయెల్‌ ఆటలు సాగుతున్నాయి. పాలస్తీనియన్లు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఎంతగా అణచివేసినా వారిలో స్వాతంత్య్ర కాంక్షను అణచటం ఎవరి తరమూ కాదు. యావత్‌ నాగరిక ప్రపంచమూ వారికి అండగా ఉంటుంది.

Spread the love