అది మూడు గోపురాల నిర్మాణమట !

అది మూడు గోపురాల నిర్మాణమట !– బాబ్రీ మసీదు పేరే ఎత్తని ఎన్సీఈఆర్టీ
న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు పేరునే తలవడానికి ఎన్సీఈఆర్టీ ఇష్టపడడం లేదు. జాతీయ విద్యా పరిశోధనా మండలి (ఎన్సీఈఆర్టీ) తన 12వ తరగతి రాజకీయ శాస్త్రం పాఠ్య పుస్తకంలో అయోధ్యలోని బాబ్రీ మసీదు పేరును ప్రస్తావించకుండా దానిని ‘మూడు గోపురాల నిర్మాణం’గా చెప్పుకొచ్చింది. దీనిని 16వ శతాబ్దిలో మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ వద్ద జనరల్‌గా పనిచేసిన మిర్‌ బాఖీ రామమందిరాన్ని కూల్చి నిర్మించాడని తెలిపింది. ‘ఈ నిర్మాణంలో హిందూ చిహ్నాలు స్పష్టంగా కన్పించాయి. నిర్మాణం లోపల, బయట కూడా కొన్ని హిందూ కట్టడాలకు చెందిన అవశేషాలు ఉన్నాయి’ అని వివరించింది.
16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదును మిర్‌ బాఖీ నిర్మించాడని పాత పాఠ్య పుస్తకంలో తెలియజేశారు. ఎన్సీఈఆర్టీ కొత్త పాఠ్య పుస్తకంలో అయోధ్య పాఠ్యాంశానికి కేవలం రెండు పేజీలు మాత్రమే కేటాయించారు. గతంలో నాలుగు పేజీల పాఠ్యాంశం ఉండేది. ఫైజాబాద్‌ జిల్లా కోర్టు ఆదేశాల మేరకు 1986 ఫిబ్రవరిలో బాబ్రీ మసీదు తాళాలు తెరిచారని, ఆ తర్వాత ఇరు పక్షాలు అక్కడ మోహరించాయని పాత పుస్తకంలో ఉంది. అయోధ్యలో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ విచారం వ్యక్తం చేసిందని అందులో చెప్పారు. అయోధ్య వివాదం లౌకికవాదంపై చర్చకు దారితీసిందని కూడా తెలిపారు.
కొత్త పుస్తకంలో మాత్రం ఇవేవీ లేవు. ‘నిర్మాణం తలుపులు తెరవాలని, ప్రార్థనలు చేసుకునేందుకు ప్రజలను అనుమతించాలని ఫైజాబాద్‌ (ఇప్పుడు అయోధ్య) జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో 1986లో మూడు గోపురాల నిర్మాణానికి సంబంధించిన పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఈ వివాదం అనేక దశాబ్దాల పాటు కొనసాగింది. దేవాలయాన్ని కూలదోసి శ్రీరామ జన్మస్థలిలో మూడు గోపురాల నిర్మాణం జరిపారని ప్రజలు విశ్వసించడంతో వివాదం మొదలైంది’ అని మాత్రమే కొత్త పాఠ్య పుస్తకంలో రాశారు. శ్రీరాముడి జన్మస్థలిని విస్మరించారని హిందువులు ఆందోళన వ్యక్తం చేశారని, నిర్మాణాన్ని తమ అధీనంలోనే ఉంచేలా హామీ ఇవ్వాలని ముస్లింలు కోరారని కొత్త పుస్తకంలో తెలియజేశారు. వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగులను కూడా పాత పాఠ్య పుస్తకంలో చేర్చారు. ‘బాబ్రీ మసీదు కూల్చివేత : కల్యాణ్‌ ప్రభుత్వానికి కేంద్రం ఉద్వాసన’ అనే శీర్షికతో వచ్చిన ఓ వార్తను ప్రదర్శించారు. ‘బీజేపీ తప్పుడు అంచనాలు ఘోరం’ అంటూ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ మరో పత్రిక పెట్టిన శీర్షికను కూడా పాత పుస్తకంలో చూపారు. కొత్త పుస్తకంలో మాత్రం అలాంటి క్లిప్పింగులేవీ కన్పించలేదు.

Spread the love