తెలంగాణ తల్లి విగ్రహంపై దిగజారి మాట్లాడడం సరికాదు

– నందిని సిధారెడ్డి ఆరోపణలు విరమించుకోవాలి : రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ జి.చిన్నారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రముఖ రచయిత, కవి, అభ్యుదయ భావాలు కలిగిన గొప్ప వ్యక్తి నందిని సిధారెడ్డి దిగజారి మాట్లాడడం ఆయన స్థాయికి తగదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ జి చిన్నారెడ్డి హితవు పలికారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయం మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడారు. ఆ ఆరోపణలను సిధారెడ్డి ఉపసంహరించుకోవాలని చిన్నారెడ్డి సూచించారు. దేవతలు, ప్రజలకు ప్రతిరూపం తెలంగాణ తల్లి విగ్రహం అని, అంత గొప్ప విగ్రహానికి విపక్షాలు వంకలు పెట్టడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దేవతా విగ్రహాన్ని గమనించినా భుజం కింది నుంచి చేతితో ఆశీర్వదిస్తున్నట్టుగానే ఉంటాయనీ, తెలంగాణ తల్లి విగ్రహం కూడా అలాగే ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకు దేవతా విగ్రహాల చిత్రాలను ఆయన ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని కలెక్టర్‌ కార్యాలయాలలో ప్రతిష్టించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు రాజ మోహన్‌ కూడా పాల్గొన్నారు.

Spread the love