కవి వ్యక్తాశ్రయ కవిత్వం రాసినప్పుడు పూర్తి అనుభూతి చెందుతాడు. కారణమేమిటంటే తాను పేపర్ మీద పెట్టేకంటే ముందే ఆ భావాలతో తాదాత్మ్యం చెందుతాడు. వేరే వస్తువును ఏర్చి కూర్చి అంతర్గత సంభాషణ చేయడం కష్టం. ×అbబఱశ్ర్‌ీ అయిన విషయానికి మెరుగుపెట్టడం కొంత సులువైన పని. ఇది ఓ కారణం కావచ్చు. ఇప్పటి జనరేషన్ ప్రేమను ఎలా తీసుకుంటుంది. మలినంగానా? అమలినంగానా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఓ వైపు సంస్కృతి, ఇంకో వైపు ప్రపంచీకరణ. ఈ రెండింటి మధ్య నలుగుతూ, మూలుగుతూ ప్రేమ స్వల్ప గాయాలతోనైతే బయటపడుతుంది.
కవి మాత్రం ఇప్పటికయినా, ఎప్పటికయినా తన ఊహాప్రేయసితో అమలినంగా సంభాషిస్తూనే ఉంటాడు. కవి చూపు వేరు. కవికి కావాల్సింది వేరు. కవి ప్రేమ తపస్సు లాంటిది. అందుకే కావచ్చు ప్రముఖులైన కవులు ఊహాప్రేయసితో ముచ్చటిస్తూ ఎన్నో అసాధారణ కవితాపంక్తులు సృజించారు. ఇప్పుడు యువతరం కవులు కూడా ఊహాప్రేయసితో తన గోడును వినిపిస్తున్నారు. ప్రేమను ప్రేమలా బతికించటం కొరకు ఇలాంటి కవిత్వం ఎంతో ప్రేరణ. జాబేర్ పాషా రాసిన ‘నీ ధ్యాసలో’ కవిత ప్రేమికుడి లోలోపలి ఏకాంత సంభాషణను ప్రేయసికి చేరవేస్తున్నది. ఇతడు ఊహాప్రేయసిని తలుచుకుంటూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో తనకు కలిగిన అనుభూతులను తాజాగా కవిత్వం చేశాడు. ఆ కవితను అవలోకిద్దాం.
శీర్షిక పెట్టడంలో వాడిన పదం ‘ధ్యాస’ పాతదే అయినా ఇక్కడ అది కవితాసారాంశాన్ని తెలిపేదిగా ఉంది. ఆ పదంతోనే భావుకత ఉట్టిపడుతుంది. ప్రేమ కవితలలో, విరహగీతాలలో ఈ పదం సాధారణంగా తొంగిచూస్తూ ఉంటుంది. ఎత్తుగడనంతా సూర్యుడు ఉదయిస్తున్న వేళల్లోకి తీసుకెళ్ళాడు. అందుకే ప్రేయసికి నారింజరంగు బొట్టు పెట్టాడు. కురులను కిరణాలతో కలిపి జడ వేశాడంటే కవి ఆలోచనావిధానంలో ఎంత తాజాదనం ఉందో అనిపిస్తుంది. కాలంతో పాటు కవిత్వం కూడా రూపం మార్చుకుంటుందంటే నేటి యువకుల కవిత్వదృష్టి ఎంత నాణ్యంగా ఉందో తెలుస్తుంది. ఏ ప్రేయసి అయినా ప్రేమికుడికి ఆకాశమే. కవి ఇంకాస్త ముందుకెళ్ళి తన ప్రేయసి కోసం సరికొత్తగా ముస్తాబు చేశాడు.
నిజమైన ప్రేమికుడు, ప్రేయసిని వదిలి ఉండడం అనేది బహుశా! ఇరువురు లేని తనంలోనే. ప్రేయసి ముందు ఉన్నప్పుడు తుంపర్ల వర్షం ముఖాన్ని ముద్దాడుతున్నట్టుగా ఉంటుంది. ఆమె లేనప్పుడు ముఖమంతా బాధతో తడిచి కళతప్పిపోతుంది. ఆ సందర్భంలో ఈ కవి సముద్ర తీరపు అలల్లో తనను తాను కోల్పోయి నడుస్తూ తన జ్ఞాపకాల ముద్దులను మూట కట్టుకుంటున్నాడు. ఎత్తుగడలో మొదటి స్టాంజాలో విరహాన్ని పలికించడంలో కవి సఫలీకతుడయ్యాడు. నారింజరంగు బొట్టు, కురుల కిరణాలు, అలల పెదాలు లాంటి ప్రయోగాత్మక ప్రతీకలు వాడి నూతన అభివ్యక్తిని సాధించాడు. ఎక్కడా వచనాన్ని వాడకుండా పూర్తి కవిత్వాన్నే రాశాడు. ఏ నేపథ్యంలోంచి కవిత రాసినా ఆ టోన్ ను పలికించగల సామర్థ్యమున్న కవి ఇతడు.
ఉదయంలోంచి, మధ్యాహ్నంలోకి వెళ్ళి అక్కడ స్థిమితంగా ఉండక సాయంత్రంలోకి ప్రవేశించాడు. సాయంత్రం వేళ పక్షులు గూటికి చేరటం, పశువులు, గొర్లు ఇళ్ళు చేరటం చూస్తుంటాం. అందరూ తమ తమ పనులను ముగించుకొని వెనక్కి మరలటం గమనిస్తుంటాం. ఒక్క ప్రేమికుడు మాత్రం మినహాయింపు. అతడు తన దారిలో అలా గడియారంలోని ముల్లులా ఆలోచనల సంద్రంలో మునిగి ముందుకు సాగుతూనే ఉంటాడు. దానికి ఉదాహరణ ఈ రెండవ స్టాంజా. కవి ఇక్కడ సమూహ ఒంటరితనం లోంచి ప్రేయసి సంభాషణననే వింటున్నాడు. లోతుల్లోకి కూరుకుపోయి తన రోజుల్ని ఆమెకు బహుమానంగా ఇస్తూ కాలాన్ని గడుపుతున్నాడు. ఈ ప్రేమికుడు ఉత్తమ ప్రేమికుడు. నడుస్తున్న దారిలోనే కాటగలిపేవాడు కాదు. ప్రేమను ఓ తీరానికి చేర్చి ప్రశాంతంగా జీవించాలనుకునే మనస్తత్వం కలవాడు. అందుకే ఒంటరితనాన్ని కూడా జంటగా మోస్తున్నాడు.
ఇక ముగింపు స్టాంజాలో రోజులో భాగంగా మిగిలిన రాత్రిని కవితావాక్యాలుగా మలిచాడు. కలలో కూడా ప్రేయసి కలవరింతలే. నిద్ర పట్టని రాత్రుల్లో గతకాలం ఉదారంగా, మధ్యాహ్నంగా, సాయంత్రంగా, జ్ఞాపకాలుగా కనబడుతూ తలను నిమురుతుందని ప్రేమ తీవ్రతను ప్రకటించాడు. కవి అనుభూతి చెందినట్లుగా జ్ఞాపకాలు జలపాతాలుగా మారినప్పుడు రోజులు, సంవత్సరాలు ఆలోచనల్లో కరిగిపోతునే ఉంటాయి. ప్రేమికుడు, ప్రేమ సజీవంగా మిగులుతాయి. కవి వాడిన పదబంధం నల్లని మబ్బే సందేశాన్ని మోసుకెళ్ళి ప్రేయసి ముఖం మీద తుంపర్లుగా కురిపించాలి. అక్కన్నుంచి తిరిగి కబుర్ల చల్లగాలిని మోసుకురావాలి.
– డా||తండా హరీష్, 8978439551
నీ ధ్యాసలో…
నారింజ రంగు బొట్టెట్టుకుని,
కురుల కిరణాలను సవరించుకుంటూ….
ప్రభాత సమయంలో ముస్తాబైన నింగిలా కనిపిస్తావు….
నల్లమబ్బు ముసిరిన మధ్యాహ్న తీరంలో,
పరధ్యానంగా నడుస్తున్నప్పుడు,
కడలిలా మారి అలల పెదాలతో ముద్దాడి పలకరిస్తావు….
గోధూళి వేళ,
సమూహాలన్నీ ఒంటరితనాన్ని మోస్తున్నప్పుడు,
ఒంటరి నాలో,
అనేక భావాల సమూహమై సంభాషిస్తావు…
కలలా వస్తావనుకున్న రాత్రి,
కునుకును వారించి, రెప్పలపై వాలి…
రెండో జాము చివర్లో, గతాన్ని నిమురుతూ,
జలపాతాల్ని ఒలికిస్తావు….
– జాబేర్ పాషా