జై బజ్‌రంగ్‌

జై బజ్‌రంగ్‌కైలాసంలో శివుడూ పార్వతి కొలువుదీరి ఉన్నారు. కొంతసేపటి నుండి శివుడి జటాఝటంలో ఏదో అలజడి. శివుడు కుదురుగా కూర్చోలేకపోతున్నాడు. అదంతా పార్వతి గమనిస్తూనే ఉంది.
”ఏమి స్వామి ఏదో ఇబ్బంది పడుతున్నారు?” అను నయంగా అడిగింది పార్వతి
”ఇబ్బంది నాకు కాదు దేవి గంగకు కాబోలు!” బదులి చ్చాడు శివుడు.
”పార్వతి విసురుగా లేచి నిలబడింది.”
”అలక ఎందుకు దేవీ! నీవు నా అర్థ భాగానివి! అన్నాడు శివుడు.
”కానీ తనను తలకెక్కించుకున్నారు!” అన్నది పార్వతి మరింత విసురుగా.
”ఇంతలో గంగ ప్రత్యక్షమయ్యింది! కాని ఆమె కంటిలో నీరు ప్రవహిస్తోంది.
గంగ కంటిలో నీళ్లు చూసి పార్వతి కదిలిపోయింది.
”ఎందుకు చెల్లా బాధ పడుతున్నావు!” ప్రేమగా అడి గింది పార్వతి.
”కారణం నేను చెబుతాను తల్లీ, నారాయణ!” అంటూ ప్రవేశించాడు నారదుడు.
”నారదా ఇపుడు నీ రాక ఎచటికి దారితీయునో, అక్కా చెల్లెళ్లు కలిసే ఉన్నారు కదా!
అన్నాడు శివుడు ఆందోళనగా.
”స్వామి నా రాక వల్ల మీకేమీ నష్టము లేదు! ఒకసారి అందరూ అటు చూడండి!”
అంటూ భూలోకం వైపు చూపాడు నారదుడు.
”భూ లోకంలో గంధ మాదన పర్వతం మీద హను మంతుడు ఎగిరి గంతులు వేస్తున్నాడు. ఆనందంతో నృత్యం చేస్తున్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చాలా కాలంగా ఎంతో
బాధగా ఉన్న ఆంజనేయుడు అకస్మాత్తుగా ఇంత సంతో షంగా మారిపోవటానికి కారణమేమిటో వారికర్థం కాలేదు!
”విష్ణుమూర్తి మళ్ళీ రామావతారం దాల్చుతున్నాడా ఏమి! నాతో ఒక్కమాటైనా చెప్పలేదు! అన్నాడు శివుడు.
”అనుమానాలు ఎందుకు స్వయంగా ఆంజనేయుడినే అడిగి ధృవ పర్చుకుందాము పదండి” అన్నది పార్వతి.
అందరూ ఆంజనేయుడి ముందు ప్రత్యక్షమయ్యారు. కాని ఆంజనేయుడు వారిని గమనించే పరిస్థితి లేడు ఆనందంలో మునిగి తేలుతున్నాడు.
”ఆంజనేయా!” శివుడి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు ఆంజనేయుడు.
”ఏమి స్వామి!”అన్నాడు ఆంజనేయుడు ఆనందంగానే.
”ఆంజనేయా! నీ ఆనందానికి కారణమేమి?” అడి గాడు శివుడు.
”నా ఆనందానికి గంగాదేవి కన్నీటికి ఒకటే కార ణము!” అన్నాడు ఆంజనేయుడు.
”ఆనాడు భారతీయ రెజ్లర్లు తాము సాధించిన పత కాలు అవార్డులు నాలో నిమజ్జనం చేయటానికి ప్రయత్ని ంచితే కొందరు. మీ సమస్య పరిష్కారం అవుతుంది! మీ పతకాలు గంగలో కలపొద్దు! ఆగండి! అన్నారు! దాంతో వారు ఆగిపోయారు. ఎంతో విలువైన మరింత పవిత్రమైన వారి అవార్డులు నాలో కలిపి ఉంటే నేను మరింత పునీ తమయ్యేదానను! ఆ అవకాశం తప్పిపోయిందని ఆవేదన చెందుతున్నాను” అన్నది గంగ.
”మరి నీ ఆనందానికి కారణమేమి?” అడిగాడు శివుడు.
”బజరంగ్‌ అనే పేరు నాకున్నందుకు ఇంత కాలం ఎంతో బాధపడ్డాను.నిన్నటి నుండి ఈ పేరు ఉన్నందుకు ఆనందపడుతున్నాను!” అన్నాడు ఆంజనేయుడు.
”ఇంతకు ముందు బాధ ఎందుకు? ఇప్పుడు ఆనందం ఎందుకు?” ఆశ్చర్యంగా అడిగింది పార్వతి.
”నా పేరు మీద బజరంగ్‌దళ్‌ అనే సంస్థను పెట్టి నాకు నచ్చని పనులు, నా స్వభావానికి విరుద్ధమైన కార్యక్రమాలు అనేకంగా చేశారు! అందుకే ఇంతకాలం ఎంతో బాధ పడ్డాను” వివరించాడు ఆంజనేయుడు.
”మరిప్పుడు నీ ఆనందానికి కారణమేమిటో తెలుపుము!” అన్నాడు శివుడు.
”తమ ఆత్మాభిమానం దెబ్బతిన్నదని. నిరసనగా తనకి చ్చిన బిరుదుని తన ప్రభువుకి తిరిగిచ్చేందుకు సాహసిం చాడు. బజరంగ్‌ అంతేకాదు! ఆ బిరుదుని తీసుకోకపో వటంతో రోడ్డు మీదే వదిలేశాడు!కీర్తి ప్రతిష్టల కోసం! నానా గడ్డి కరుస్తున్న ఈ రోజుల్లో తనకు కీర్తి తెచ్చిన అవార్డును తోటి క్రీడాకారిణి కోసం వదులు కున్న బజరంగ్‌ నాపేరుకు గౌరవ ప్రతిష్టలు కల్పించాడు. అందుకే ”ఈ ఆనందం” అన్నాడు ఆంజనేయుడు.
”నీ రాముడికి గుడి కట్టిస్తున్న రామభక్తులనే ఎదిరిం చుతున్న వారిని నీవు సమర్థిస్తావా?” అన్నాడు నారదుడు.
”నా రాముడికి గుడి అవసరం లేదు నారదా! తమ స్వార్థం కోసం రాముడికి గుడి కట్టినంత మాత్రాన రామ భక్తులై పోరు! రామాలయం ఉన్నంత మాత్రాన రామ రాజ్యమై పోదు!” అన్నాడు ఆంజనేయుడు కటువుగా.
”అదేమి ఆంజనేయా! భారతదేశంలో ఇపుడున్నదీ సాక్షాత్తు రామరాజ్యమేనని భక్తులంతా అనుకుంటున్నారు!” అన్నాడు నారదుడు వెనుకడుగులు వేస్తూ.
”ఆపు నారదా! మరొక్క మాట అన్నావంటే నీ తల వేయి ముక్కలు చేస్తాను! నా రాముడొక్కడే, రామ రాజ్యమూ ఒక్కటే. మరో రామరాజ్యము ఉండబోదు! ఈ రాజ్యానికి ఒక్కటైనా రామరాజ్య లక్షణముందా?” ఉగ్రరూపంతో ప్రశ్నించాడు ఆంజనేయుడు.
నారదుడు భయపడ్డాడు.
”తన రాజ్యంలో ఒక సామాన్య పౌరుడు తనను పరోక్షంగా విమర్శించితేనే సీతమ్మను అడవులకు పంపిన చరిత్ర నా రాముడిది. ఈ రాజ్యంలో ప్రజలు ఎన్నుకున్న నాయకులకే రాజసభలో నుండి బహిష్కరించిన దుర్నీతి ఉన్నది. తన రాజ్యంలో ప్రజలపై తీవ్రమైన హత్యాకాండ జరుగుతుంటే వెళ్ళి ఓదార్చలేని వాడు నాయకుడేనా? అదే నాయకుడు ఆటలు చూడటానికి రోజంతా వెచ్చిస్తాడా? మమ్మల్ని వేధిస్తున్నవాడిపై చర్య తీసుకోండి మహాప్రభో అని మొరపెట్టుకున్న క్రీడాకారులను పట్టించుకోని వాడు దేశ నాయకుడుగా ఉండటానికి సిగ్గు ఉండొద్దా! ఇలాంటి రాజ్యంలో ఉండటానికి నేనే ఇష్టపడటం లేదు! ఎంత గొప్ప గుడి కట్టినా నా రాముడు ఆ రాజ్యంలో ఉండలేడు. ఇది రామభక్తుల రాజ్యం కాదు! రామభోక్తల రాజ్యం! సెలవు!” అంటూ ఆంజనేయుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు.
అందరూ అనుసరించారు.
– ఉషాకిరణ్‌

Spread the love