ఎన్నికల బాండ్లతో తెర వెనుక భారీగా నిధులు సమీకరించిన బీజేపీ
నిరసనకారులపై కుట్ర ఆరోపణలు
విదేశీ విరాళాల నియంత్రణ పేరుతో స్వచ్ఛంద సంస్థలపై ఉక్కుపాదం
ఆర్‌ఎస్‌ఎస్‌కు మాత్రం మినహాయింపులా?
కేంద్రం తీరుపై అనేక ప్రశ్నలు
ప్రజా సమస్యలపై నిరసన తెలిపే విద్యార్థులు, యువతపై విదేశీ శక్తుల కుట్రలంటూ మోడీ ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తోంది. ఆందోళనల వెనుక విదేశీ నిధులున్నాయంటూ ప్రతిపక్షాలను దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. కానీ రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాలు, ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన అజ్ఞాత నిధులు, ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించిన విదేశీ విరాళాల విషయంలో మాత్రం కేంద్రం అనుసరిస్తున్న వైఖరి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. విదేశీ నిధుల పేరుతో ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తున్న బీజేపీ అసలు తన ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకతను ఎందుకు పాటించడం లేదన్నది కీలక ప్రశ్నగా మారింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. గాలి నాణ్యత పడిపోవడంతో పాఠశాలలు మూతపడుతున్నాయి. ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేయాలని సూచిస్తున్నారు. మరోవైపు దేశంలో రాజకీయ వాతావరణం కూడా నిరసనలు, ఆరోపణలతో వేడెక్కుతోంది. ఓటర్ల హక్కులను హరించేలా సాగుతోందన్న విమర్శలు ఎదుర్కొంటున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నిరసనలను ఎదుర్కొనే బదులు మోడీ ప్రభుత్వం వాటి వెనుక విదేశీ శక్తుల కుట్ర ఉందంటూ ఎదురుదాడికి దిగుతోంది.
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ సంస్థలతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. దేశంలో అశాంతి సృష్టించేందుకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయని ప్రచారం చేస్తోంది. అమెరికా, పాకిస్తాన్, జార్జ్ సోరోస్, గ్రెటా థన్‌బర్గ్, ఎలాన్ మస్క్ వంటి వ్యక్తులు, శక్తుల పేర్లను కూడా ఈ ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. విద్యార్థుల నిరసనలను విదేశీ నిధులతో నడిచే దేశ వ్యతిరేక కార్యకలాపాలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలకు ఆధారాలేమిటన్నది బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేయడం లేదన్నది ప్రధాన విమర్శగా ఉంది.
ఎన్నికల బాండ్లతో బీజేపీకి భారీ నిధులు
విదేశీ నిధులపై ఇంతగా ఆందోళన వ్యక్తం చేస్తున్న బీజేపీ.. తన పార్టీ ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం పారదర్శకత పాటించలేదని అర్థమవుతుంది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం రాజకీయ విరాళాల వ్యవస్థను మరింత రహస్యంగా మార్చింది. ఈ పథకం ద్వారా వ్యక్తులు, సంస్థలు తమ వివరాలు బయటపడకుండా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే అవకాశం కలిగింది. విదేశీ సంస్థల నుంచి కూడా విరాళాలు అందుకునేందుకు వీలు కల్పించేలా నిబంధనల్లో మార్పులు జరిగాయి. ఈ పథకం ద్వారా వచ్చిన విరాళాల్లో కొన్ని సంవత్సరాల్లో బీజేపీ ఏకంగా 95 శాతం వరకు సొంతం చేసుకుంది.
ప్రత్యర్థి పార్టీలతో పోలిస్తే ఎన్నికల్లో బీజేపీ భారీగా ఖర్చు చేయడానికి ఈ నిధులు దోహదపడ్డాయి. చివరకు 2024లో సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. ప్రజలకు తెలియకుండా రాజకీయ పార్టీలకు అందుతున్న నిధుల వివరాలు దాచిపెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని కోర్టు అభిప్రాయపడింది.
రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలపై అజమాయిషీ ఏదీ?
దేశంలో రాజకీయ పార్టీల ఆదాయ వివరాలపై సరైన పర్యవేక్షణ లేదని పరిశీలకులు అంటున్నారు. బీజేపీతోపాటు ఇతర రాజకీయ పార్టీలకు ఆదాయపు పన్ను మినహాయింపులు ఉన్నాయి. పార్టీలు ఆడిట్ చేసిన లెక్కలను వెల్లడిస్తున్నప్పటికీ.. ఆడిటర్లను ఆయా పార్టీలే ఎంపిక చేసుకుంటున్నాయి. ఆర్థిక లావాదేవీలపై ఎన్నికల సంఘానికి కానీ, ప్రజలకు కానీ పూర్తిస్థాయి విచారణ చేసే అవకాశం లేదు. దీంతో నిధుల మూలాలు, వాటి వినియోగంపై అనుమానాలు కొనసాగుతున్నాయి.
ఈ పరిస్థితిని ఉపయోగించుకుని నకిలీ కంపెనీలు, రాజకీయ పార్టీలు విరాళాల పేరుతో నల్లధనాన్ని చట్టబద్ధం చేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. దేశంలో గుర్తింపు పొందని రాజకీయ పార్టీల సంఖ్య 3,200 దాటిందనీ, 2022 నుంచి 2024 మధ్య రెండేండ్లలో ఇవి రూ.10 వేల కోట్లకు పైగా విరాళాలు పొందాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ మొత్తం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అందిన విరాళాల కంటే ఎక్కువగా ఉండటం ఆర్థిక వ్యవస్థలోని లోపాలను తెలియజేస్తోంది.
విదేశీ విరాళాల చట్టంలోనూ రాజకీయ లబ్ధి
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) విషయంలోనూ కేంద్రంలోని అధికార పార్టీలు సహకరించుకున్నాయని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 2014లో ఢిల్లీ హైకోర్టు విదేశీ కంపెనీ భారత అనుబంధ సంస్థ నుంచి విరాళాలు స్వీకరించినందుకు బీజేపీ, కాంగ్రెస్ రెండూ చట్టాన్ని ఉల్లంఘించాయని తేల్చింది. అయితే ఈ తీర్పు తర్వాత రెండు పార్టీలు కలిసి చట్టానికి సవరణ చేసి, అలాంటి విరాళాలకు మార్గం సుగమం చేయడం గమనార్హం.
ప్రజా ఉద్యమాలను అణచే పాత ఎత్తుగడ
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను విదేశీ కుట్రలుగా చిత్రీకరించడం నియంతృత్వ ధోరణులకు నిదర్శనమని విశ్లేషకులు అభి ప్రాయపడుతున్నారు. సెర్బియాలో విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో ఓటమి పాలైన ఆ దేశ మాజీ నాయకుడు అలెగ్జాండర్ వుసిక్ కూడా విదేశీ శక్తుల కుట్ర అంటూ ఆరోపణలు చేశాడు. అయితే ప్రజల అసంతృప్తి, సంఘటిత ఉద్యమాల ముందు ఆయన ప్రచారం నిలవలేదు.
భారత్‌లోనూ విద్యార్థుల ఆందోళనలతో మోడీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. అసలు సమస్యలకు సమాధానం చెప్పకుండా విదేశీ కుట్రల ప్రచారంతో ప్రజల దృష్టిని మళ్లిస్తోంది. రాజకీయ పార్టీలకు అందే నిధులపై పారదర్శకత లేకుండా, స్వచ్ఛంద సంస్థలపై మాత్రం కఠిన ఆంక్షలు విధించడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని మేధావులు ప్రశ్నిస్తు న్నారు. నిరసనకారులపై దేశద్రోహ ముద్ర వేయడం కాకుండా, రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్‌కు మాత్రం నిబంధనల వర్తింపు లేదా?
విదేశీ నిధుల విషయంలో మోడీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి ఆర్‌ఎస్‌ఎస్ ఉదాహరణగా నిలుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. వందేండ్ల చరిత్ర కలిగిన ఆర్‌ఎస్‌ఎస్ విదేశాల్లోని అనుబంధ సంస్థల ద్వారా లక్షల డాలర్ల విరాళాలు పొందుతున్నప్పటికీ, ఇతర స్వచ్ఛంద సంస్థలకు వర్తించే నిబంధనలు దానికి వర్తించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద హిందూత్వ సంస్థల నెట్‌వర్క్‌కు మూలమైన ఆర్‌ఎస్‌ఎస్ అసలు నమోదైన సంస్థ కూడా కాకపోవడంతో దాని నిధులపై పారదర్శకత, పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారాయి.
ఆర్టీఐ చట్టానికీ పార్టీల దూరం
రాజకీయ పార్టీల ఆర్థిక వ్యవహారాలను ప్రజలకు వెల్లడించాలనే ప్రయత్నాలనూ పార్టీలు అడ్డుకున్నాయి. 2013లో కేంద్ర సమాచార కమిషన్ ఆరు జాతీయ రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోని ప్రజా సంస్థలుగా ప్రకటించింది. కీలక సమాచారాన్ని ప్రజలకు అందించాలని ఆదేశించింది. అయితే కాంగ్రెస్, బీజేపీ సహా ఆరు పార్టీలు ఈ ఆదేశాలను పట్టించుకోలేదు. 2015లో సమాచార కమిషన్ కూడా ఈ విషయంలో చేతులెత్తేసింది. ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు రాజకీయ పార్టీలే అడ్డుపడుతున్నాయన్న విమర్శలకు ఇది బలం చేకూర్చింది.







కామెంట్‌లు (0)