కుకీ-జో, నాగాల మధ్య ఘర్షణ
కుకీ-జో తెగకు చెందిన ముగ్గురి మృతి
కేంద్రం తీరుపై తీవ్ర నిరసనలు
ఇంఫాల్‌ను స్తంభింపజేసిన మణిపూర్ ఐక్యతా ర్యాలీ
ప్రభుత్వ వైఫల్యంపై ప్రజాగ్రహం
గువహతి: మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతల కు దారితీశాయి. నోనీ జిల్లాలో శనివారం ఉదయం నాగాల గ్రూపులతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు కుకీ-జో తెగకు చెందిన వ్యక్తులు మరణించారు.ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వేలాది మంది మెయిటీ, నాగాలు ఇంఫాల్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో నగరం స్తంభించిపోయింది. కుకీ సాయుధ గ్రూపులను ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం పరోక్ష యుద్ధానికి పాల్పడుతోందని ఆందోళన కారులు ఆరోపించారు. రాష్ట్రంలోని స్థానిక తెగల ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.
కాల్పుల్లో ముగ్గురు మృతి
మణిపూర్‌లోని నోనీ జిల్లాలో తజైకైఫున్ గ్రామ సమీపంలో శనివారం ఉదయం సుమారు 9 గంటలకు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు కుకీ-జో తెగవాసులు ప్రాణాలు కోల్పోయారు. నాగా తెగకు చెందిన సాయుధ గ్రూపులతో జరిగిన ఘర్షణే ఈ మరణాలకు కారణమని కుకీ ఇన్పి మణిపూర్ (కేఐఎం) ఆరోపించింది. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఐఎం), జెడ్‌యూఎఫ్ (కే) గ్రూపుల సభ్యులే ఎలాంటి కారణం లేకుండా దాడికి పాల్పడ్డారని పేర్కొంది. కుకీ-జో ప్రజలు నివసిస్తున్న గ్రామాలకు తగిన భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేఐఎం విమర్శించింది. ఈ దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకో వాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. గతనెల 19న సనాలోక్ ప్రాంతంలో జరిగిన ఘటనలో గాయపడిన మరో వ్యక్తి మరణించాడు. మెయిటీ తెగకు చెందిన వ్యక్తి సోరోఖైబామ్ ఇబోంచా శనివారం ఉదయం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ ఘటనలో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. వరుస హింసాత్మక ఘటనలు రాష్ట్రంలో భయాందోళనలను పెంచుతున్నాయి.
ఇంఫాల్‌లో భారీ నిరసన
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మెయిటీ, నాగా సంఘాలు సంయుక్తంగా ఇంఫాల్‌లో భారీ ర్యాలీ నిర్వహించాయి. కుకీ సాయుధ గ్రూపులతో కేంద్రం పరోక్ష యుద్ధం చేస్తోందని ఆరోపిస్తూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ ర్యాలీతో ఇంఫాల్ నగరంలోని సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. కోకోమీ (కోఆర్డినేటింగ్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ), జాయింట్ ట్రైబ్ కౌన్సిల్ మణిపూర్, ఫుట్‌హిల్స్ నాగా కో-ఆర్డినేషన్ కమిటీ, నాగా పీపుల్స్ యూనియన్ తదితర సంఘాలు ఈ ర్యాలీని నిర్వహించాయి. యునైటెడ్ నాగా కౌన్సిల్ కూడా దీనికి మద్దతు ప్రకటించింది. ర్యాలీలో ఆందోళనకారులు ఆరు ప్రధాన డిమాండ్లతో తీర్మానం చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, కుకీ-జో సాయుధ గ్రూపుల మధ్య కుదిరిన సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (ఎస్ఓఓ) ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. ఆ గ్రూపుల శిబిరాలను తొలగించి, వారి వద్ద ఉన్న ఆయుధాలను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. హింస కారణంగా ఇండ్లను వదిలి వెళ్లిన ప్రజలను తిరిగి వారి స్వస్థలాల్లో పునరావాసం కల్పించాలని కోరారు. సరిహద్దు, ఘర్షణ ప్రభావిత ప్రాంతాల నుంచి అస్సాం రైఫిల్స్‌ను ఉపసంహరించాలని, వాటి స్థానంలో తటస్థ భద్రతా బలగాలను మోహరించాలని సూచించారు.







కామెంట్లు (0)