Magazines

అయోధ్య రామాలయ విరాళాల నిధుల దుర్వినియోగం కేసులో చార్జిషీట్‌

1 గంట క్రితం

Chargesheet filed in case of misappropriation of funds donated for the Ayodhya Ram Mandir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

విచారణలో పిటిషనర్లకూ భాగస్వామ్యం.. సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగం కేసులో యూపీ ప్రభుత్వం చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఆలయానికి వచ్చిన విరాళాల లెక్కింపు సమయంలో కొందరు అధికారులు నగదును అక్రమంగా తీసుకునీ, ఇతర పెట్టుబడులకు మళ్లించినట్టు లేదా తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విచారణలో పిటిషనర్లు కూడా పాల్గొని, స్థానిక న్యాయస్థానానికి సహకరించవచ్చని సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. ఆలయంలో విరాళాల లెక్కింపు సమయంలోనే ఈ అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. నగదును లెక్కించే బాధ్యతల్లో ఉన్న కొందరు అధికారులు ఆ మొత్తాన్ని తీసుకుని ఇతర అవసరాలకు వినియోగించినట్టు, వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు అనుమానాలు ఉన్నాయని వివరించారు. ఈ వ్యవహారంలో ప్రజా ప్రయోజనం ఇమిడి ఉన్నందున పిటిషనర్లు విచారణలో సహకరించేందుకు అనుమతిస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. బాధితులకు క్రిమినల్‌ కేసుల విచారణలో సహకరించేందుకు ఎలాంటి అవకాశం ఉంటుందో, అదే తరహాలో పిటిషనర్లు కూడా స్థానిక న్యాయమూర్తికి సహకరించవచ్చని స్పష్టం చేసింది.

ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లను పరిష్కరించిన ధర్మాసనం.. విచారణను చట్ట ప్రకారం కొనసాగించాలని స్థానిక జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. అయితే, విరాళాల నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల వాస్తవాలు, నిందితుల పాత్ర, కేసు పూర్వాపరాలపై తాము ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇకపై స్థానిక న్యాయస్థానంలో విచారణ కొనసాగనుంది. ఆరోపణల్లో నిజానిజాలను న్యాయస్థానం ఆధారాల పరిశీలన అనంతరం తేల్చనుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్