Magazines

ఐక్యత దిశగా ఇండియా బ్లాక్‌

59 నిమిషాల క్రితం

INDIA bloc moving towards unity
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 3 నిమిషాల చదవడం

రామ్‌లీలా మైదానంలో ప్రతిపక్ష నేతల సంఘీభావం 2024 నాటి విభేదాలకు భిన్నంగా తాజా ర్యాలీ

‘ఓట్‌ బచావో..
 దేశ్ బచావో’ నినాదంతో ఉమ్మడి పోరు

తాజా పరిస్థితులతో 
ఆత్మరక్షణలో ఎన్డీఏ

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో అక్రమాలు జరిగాయంటూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా బ్లాక్‌ నిర్వహించిన భారీ ర్యాలీ ప్రతిపక్ష ఐక్యతకు వేదికగా నిలిచింది. గతంలో ఇదే మైదానంలో 2024 మార్చి 31న నిర్వహించిన ర్యాలీతో పోలిస్తే ఈసారి నేతల మధ్య సాన్నిహిత్యం, పరస్పర సంఘీభావం స్పష్టంగా కనిపించాయి. గతంలో ఎవరి రాష్ట్ర రాజకీయాలు, పార్టీ ప్రయోజనాల గురించి వారు ఎక్కువగా మాట్లాడగా, ఈసారి సర్‌ అక్రమాలు, ఓటుహక్కు పరిరక్షణ ప్రధాన అంశాలుగా ప్రసంగాలు సాగాయి. ‘ఓట్‌ బచావో.. దేశ్‌ బచావో’ (ఓటును కాపాడండి.. దేశాన్ని రక్షించండి) నినాదంతో నేతలంతా ఐక్య పోరాటానికి పిలుపునిచ్చారు.

నా నాయకురాలు సోనియా : మమత

తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగం ఈ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సోనియా గాంధీని ‘నా నాయకురాలు సోనియాజీ’ అని సంబోధించడం ప్రతిపక్ష శిబిరంలో మారిన రాజకీయ వాతావరణానికి సంకేతంగా కనిపించింది. సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీని పలకరించడంతోపాటు వేదికపై ఉన్న వామపక్ష పార్టీల నేతల ఉనికిని కూడా ఆమె ప్రస్తావించారు.

పోరాటాన్ని విరమించం : అఖిలేశ్‌

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మాత్రం ప్రధానంగా యూపీ రాజకీయాలపైనే మాట్లాడారు. ఇండియా బ్లాక్‌ గళం వినిపిస్తుండటంతో బీజేపీకి తమ ఓట్లు కూడా తొలగిపోతున్నాయనే భయం పట్టుకుందని అన్నారు.

ఉమ్మడిగా పోరాడతాం: మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వేదికపై ఉన్న నేతలందరినీ పోరాట యోధులుగా అభివర్ణించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు మహారాష్ట్ర, బీహార్‌, యూపీ ప్రభుత్వాలు కూడా అక్రమ మార్గాల్లో ఏర్పడినవేనని విమర్శించారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి, రాజ్యాంగాన్ని కాపాడి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఉమ్మడిగా పోరాడతామని ప్రకటించారు.

ఇది సామూహిక పోరాటం : రాహుల్‌ గాంధీ

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ఈ ఉద్యమం ఏ ఒక్క పార్టీకి, ఏ ఒక్క నాయకుడికో పరిమితమైనది కాదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ భాగస్వాములవుతున్న సామూహిక పోరాటమని వివరించారు. దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతోపాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీ జరిగిందని మమతా బెనర్జీ ఉదాహరణలతో వివరించారని తెలిపారు.

ఈ ఉద్యమం మరో స్వాతంత్య్ర సంగ్రామం : 
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ

సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ మాట్లాడుతూ ఐక్య‌త‌తోనే ఉద్య‌మాన్ని మ‌రింత ఉధృతం చేస్తామ‌ని అన్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీలు చేస్తున్న ఉద్య‌మం మ‌రో స్వాతంత్ర సంగ్రామంగా అభివ‌ర్ణించారు. దేశ ప్ర‌జ‌లంతా ఐక్యంగా పోరాడుతున్నార‌ని, ప్ర‌తిప‌క్ష పార్టీలు కూడా ఐక్యంగా పోరాడుతున్నాయ‌ని తెలిపారు. దేశ ప్ర‌జ‌ల ఐక్య‌త‌తోనే మోడీ స‌ర్కార్‌ను గ‌ద్దెదించ‌గ‌ల‌మ‌ని అన్నారు.

2024 ర్యాలీకి భిన్నంగా...

2024 మార్చి 31న లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే రాంలీలా మైదానంలో ఇండియా బ్లాక్‌ ‘లోక్‌తంత్ర బచావో’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించింది. మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుందని, బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఐక్యం కావాలని అప్పట్లో నేతలు పిలుపునిచ్చారు. అయితే ఆ ర్యాలీలో ఉమ్మడి లక్ష్యం కంటే ఆయా పార్టీల రాష్ట్ర రాజకీయాలు, వ్యక్తిగత అజెండాలకే ఎక్కువ ప్రాధాన్యత కనిపించింది.

ఈ నేపథ్యంలో తాజాగా రాంలీలా మైదానంలో జరిగిన ర్యాలీలో ప్రతిపక్ష నేతల మధ్య కనిపించిన ఐక్యత రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటుహక్కు పరిరక్షణ, సర్‌ వ్యతిరేక పోరాటం కేంద్రంగా కూటమి నేతలు ఒకే వేదికపైకి రావడం భవిష్యత్తులో ప్రతిపక్ష ఐక్యతకు ఎంతవరకు దోహదపడుతుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ ఐక్యతా రాగం కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఆత్మరక్షణలో పడేసిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్