Magazines

రెవెన్యూ, అటవీ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం

1 గంట క్రితం

A permanent solution to boundary disputes between the Revenue and Forest departments
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 3 నిమిషాల చదవడం

జాయింట్ స‌ర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రెండు శాఖల మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఉండాలి

ఈ స‌ర్వేను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా : ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి పొంగులేటి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

రెవెన్యూ, అటవీ (ఫారెస్ట్) భూముల సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సోమ‌వారం హైదరాబాద్‌‌లోని డాక్ట‌ర్ బిఆర్‌ అంబేద్క‌ర్ సచివాలయంలో రెవెన్యూ, అటవీ విభాగాలు, సర్వే, సెటిల్‌మెంట్ అధికారులతో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ స‌రిహ‌ద్దు వివాదాల వల్ల సామాన్య ప్రజలు, రైతులు ఏమాత్రం నష్టపోకూడదని అన్నారు. రెండు విభాగాలు పూర్తి సమన్వయంతో జాయింట్ సర్వేలు నిర్వహించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో ముందుకు సాగుతోందని ‌వివరించారు. భూ వివాదాలు లేని తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహించాలి

రెవెన్యూ, అటవీ విభాగాలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వేలు చేపట్టాలని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ సర్వేలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పద్ధతుల సహాయంతో నిర్వహించి భూములకు స్పష్టమైన సరిహద్దులను గుర్తించాలని సూచించారు. రాష్ట్రంలో ప్ర‌ధానంగా ఉమ్మ‌డి ఖమ్మం, వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో అట‌వీ భూములున్నాయ‌ని కొన్ని ద‌శాబ్దాలుగా రెవెన్యూ, అటవీ విభాగాల మ‌ధ్య స‌రిహద్దు వివాదాలు ఉన్నాయ‌ని అన్నారు. ప‌ట్టా భూములు, రెవెన్యూ, అటవీ భూముల మ‌ధ్య కూడా వివాదాలు ఉన్నాయ‌ని చెప్పారు. ఈ అంశాల‌న్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని జాయింట్ స‌ర్వేతో శాశ్వ‌త ప‌రిష్కారం చూపించాల‌న్నారు.

క్షేత్రస్థాయిలో భూముల వాస్తవ పరిస్థితులను పరిశీలించి, రికార్డులు, మ్యాపులు, సర్వే వివరాలను సమగ్రంగా సరిపోల్చి వివాదాలకు తావులేకుండా స్పష్టమైన హద్దులను నిర్ధారించాలన్నారు.

సమన్వయంతో పరిష్కరించాలి

ఈ సమస్యలను ఒక శాఖపై మరొక శాఖ బాధ్యత కాదని నెట్టివేసే ధోరణి విడనాడాలనీ, పరస్పర సమన్వయంతో పరిష్కారం దిశగా అడుగులు వేయాలని మంత్రి స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిష్కరించగలిగే సమస్యలను అక్కడే పరిష్కరించాలనీ, ఉన్నతస్థాయి నిర్ణయాలు అవసరమైన అంశాలను వెంటనే రాష్ట్రస్థాయికి నివేదించాలని చెప్పారు.

ఏండ్ల తరబడి వివాదాలు కొనసాగడం వల్ల రైతులు, భూయజమానులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు న్యాయం జరిగేలా పారదర్శకంగా, వాస్తవ ఆధారాలతో సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిర్ణీత కార్యాచరణతో ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు. ఇకపై రెవెన్యూ–అటవీ భూ సరిహద్దు వివాదాల పరిష్కార ప్రక్రియను తాను స్వయంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. రెండు శాఖల మధ్య సమన్వయానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని అన్నారు.


భవిష్యత్తులోనూ ఎలాంటి వివాదాలు రావొద్దు

శాస్త్రీయంగా సరిహద్దులను నిర్ధారించడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు రాకుండా శాశ్వతంగా తెరపడుతుందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో భూ పరిపాలనను మరింత బలోపేతం చేయడంలో భాగంగా సర్వే, సెటిల్‌మెంట్, భూ రికార్డుల శాఖ ద్వారా ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు అమలు చేస్తోందని వెల్లడించారు.

భూ రికార్డుల్లో పూర్తి పారదర్శకత, ఖచ్చితత్వం తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పట్టుదలతో పనిచేసి దశాబ్దాల నాటి భూ వివాదాలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు.

ఈ స‌ర్వేకు క్షేత్ర‌స్దాయిలో రైతులు, ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని సూచించారు. జిల్లా, మండ‌ల స్జాయిలో రెవెన్యూ, అట‌వీ అధికారులు స‌మ‌న్వ‌యంతో క‌మిటీలను ఏర్పాటు చేసి ముందుకెళ్లాల‌ని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ కార్య‌ద‌ర్శి లోకేశ్‌ కుమార్‌, స‌ర్వే, సెటిల్‌మెంట్ క‌మిష‌న‌ర్ రాజీవ్‌గాంధీ హ‌నుమంతు, ‌పీసీసీఎఫ్ విన‌య్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్