నల్లగొండ చరిత్ర, పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపే లక్ష్యం : ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్
సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
నవంబర్‌లో ఎంజీయూలో 13, 14, 15 తేదీల్లో నిర్వహణ
నవ తెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
దక్షిణ భారత చారిత్రక వైభవాన్ని చాటడంతోపాటు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ చరిత్రపై లోతైన పరిశోధనలకు 45వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ వేదిక కానుందని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. నవంబర్ 13, 14, 15 తేదీల్లో ఎంజీయూలో నిర్వహించనున్న ఈ జాతీయ స్థాయి సదస్సు నల్లగొండ జిల్లా చరిత్ర, పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురానుందని చెప్పారు. సోమవారం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ పేరుతో నిర్వహిస్తున్న ప్పటికీ దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి చరిత్ర పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొంటారని, సుమారు 1,000 నుంచి 1,200 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు. చరిత్ర, పర్యాటక విభాగాల కృషితో ఎంజీయూకు ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహించే తొలి అవకాశం లభించిందని తెలిపారు. మూడ్రోజుల సదస్సులో దక్షిణ భారత సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ చరిత్ర, అణగారిన వర్గాల చరిత్ర, హిస్టోరియోగ్రఫీ, మారిటైమ్ హిస్టరీ, డిజిటల్ అండ్ ఆన్లైన్ ప్రదర్శనలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐసీటీ వంటి అంశాలపై పరిశోధనాత్మక చర్చలు, పత్ర సమర్పణలు ఉంటాయని వివరించారు. యూనివర్సిటీలో పర్యాటక మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని, నల్లగొండ జిల్లా పర్యాటక ప్రాచుర్యాన్ని పెంచేందుకు ప్రత్యేక పుస్తకాన్ని కూడా తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సు తెలంగాణ చారిత్రక వారసత్వాన్ని జాతీయ స్థాయిలో పరిచయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సు నిర్వహణకు ఇంజినీరింగ్ కళాశాలలో 500 మంది సామర్థ్యం కలిగిన సెమినార్ హాల్‌ను సిద్ధం చేశామని, అదనపు ఏర్పాట్లతో 800 నుంచి 900 మంది ప్రతినిధులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 600 నుంచి 700 మంది వసతి కోసం స్థానిక హోటళ్లలో బుకింగ్స్ చేయడంతో పాటు యూనివర్సిటీ హాస్టళ్లను సిద్ధం చేశామన్నారు. ఇప్పటివరకు అవుట్ స్టేషన్ నుంచి 270 మంది, స్థానికంగా 30 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు.
ప్రారంభోత్సవానికి బెంగళూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ షేక్ మస్తాన్ అలీ కీనోట్ స్పీకర్‌గా, ముగింపు కార్యక్రమానికి హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ భంగ్యా భూక్య హాజరవుతారని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కె. విజయబాబును అడ్జంక్ట్ ప్రొఫెసర్‌గా నియమించినట్టు స్పష్టం చేశారు. సదస్సు నిర్వహణకు రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి కన్వీనర్‌గా, ఇతర కో-కన్వీనర్లు, కోఆర్డినేటర్లు, డాక్టర్ రామకృష్ణ (లోకల్ సెక్రటరీ)తో కూడిన కమిటీ పనిచేస్తోందన్నారు. అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణప్రియ, ఆచార్య విజయబాబుతో కలిసి సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చరిత్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ పనస రామకృష్ణ, డాక్టర్ షరీఫ్, వివేక్ పాల్గొన్నారు.







కామెంట్లు (0)