బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక లైంగికదాడి, కుటుంబ సభ్యుల హత్యకు సంబంధించిన కేసులో ఇద్దరు దోషుల కు విధించిన జీవిత ఖైదును సుప్రీంకోర్టు సోమవారం నిలిపివేసింది. ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేసింది. బిపిన్ చంద్ర జోషి, ప్రదీప్ మోర్థియా 17 ఏండ్లుగా జైలులో ఉన్నారని జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ పి.బి.వర్లేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. వాదనలు విన్న అనంతరం, అప్పీలుదారులు 17 ఏండ్లకు పైగా జైలులో ఉన్నారని, వారిలో ఒకరు తీవ్రమైన వైక ల్యంతో బాధపడుతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ అప్పీలులో వాస్తవాలు, చట్టపరమైన అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అక్టోబర్ 28న వెలువరించిన ఉత్తర్వుల్లో తెలిపింది.
ఈ ఉత్తర్వులు తాజాగా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి.దీంతో అప్పీలులోని అంశాల ను పరిగణనలోకి తీసుకుని, అప్పీలుదారుల శిక్షను నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. సంబంధిత విచారణ కోర్టు విధించే నిబంధనలు, షరతులకు లోబడి వారు బెయిల్‌పై విడుదల కావచ్చని పేర్కొంది.ఈ ఇద్దరు వ్యక్తులు 17 ఏండ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్నారని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వాదించారు. 2002 అల్లర్ల నేపథ్యంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో వీరిలో ఒకరి పేరు లేదని, దాదాపు మూడేండ్ల తర్వాత అతడిని ఈ కేసులో ఇరికించారని ఆయన పేర్కొన్నారు.అదనపు సొలిసిటర్ జనరల్ రాజా థాక్రే ఈ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. హైకోర్టు, విచారణ కోర్టులు రికార్డుల్లో ఉన్న సంబంధిత సాక్ష్యాధా రాలను పరిగణనలోకి తీసుకున్నాయని, ముఖ్యంగా ఈ నేరం అత్యంత తీవ్రమైనదని ఆయన స్పష్టం చేశారు.
కేసు వివరాలు
2002, ఫిబ్రవరి లో గుజరాత్ అల్లర్ల సమయంలో 21 ఏళ్ల వయస్సు, ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై నిందితులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె మూడేండ్ల కుమార్తెతో సహా కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. జోషీ, మోర్ధియాలను ట్రయల్ కోర్టు దోషులుగా నిర్థారించి, జరిమానాతో పాటు జీవిత ఖైదు విధించింది. జనవరి 8, 2024న, సుప్రీంకోర్టు ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వం 11 మంది దోషులకు కల్పించిన శిక్షా తగ్గింపును రద్దు చేసింది. గుజరాత్ ప్రభుత్వం నిందితులకు "సహకరించడం" ద్వారా తన విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేసిందని తీవ్రంగా విమర్శించింది. ఈ కేసులో మోర్ధియా, జోషీలతో పాటు గోవింద్ నాయి, రమేష్ చందనా, మితేష్ భట్, బకాభాయ్ వోహానియా, కేసర్ భాయ్ వోహానియా, జశ్వంత్ నాయి, రాధేశ్యామ్ షా, రాజుభాయ్ సోనీ, శైలేష్ భట్‌లు దోషులుగా ఉన్నారు. దోషుల శిక్షను తగ్గించినందుకు గుజరాత్ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు, శిక్షా తగ్గింపును మంజూరు చేసే అధికారాన్ని ఆ ప్రభుత్వం "అక్రమంగా తన చేతుల్లోకి తీసుకుందని" పేర్కొంది. బిల్కిస్ బానో కేసును గుజరాత్ కోర్టు నుండి ముంబైలోని కోర్టుకు బదిలీ చేసినందున, శిక్షా తగ్గింపును మంజూరు చేసే అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.







కామెంట్‌లు (0)