మహారాష్ట్రలో 32,490 చెట్ల నరికివేతకు అటవీశాఖ అనుమతి
చిరుతలు, ఎలుగుబంట్లు సహా వన్యప్రాణుల ఆవాసాలకు ముప్పు
రూ.13,505 కోట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుపై స్థానికుల ఆగ్రహం
చెట్లు నరకడం ఆపి, ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ : పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడుతుందంటున్న ఓ భారీ విద్యుత్ ప్రాజెక్టు పశ్చిమ కనుమల్లోని అడవులకు ముప్పుగా మారింది. మహారాష్ట్రలోని రాయగడ జిల్లా కర్జత్ ప్రాంతంలో టోరెంట్ గ్రూప్ చేపడుతున్న 3,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు కోసం 32,490 చెట్లను నరికేందుకు అటవీశాఖ అనుమతివ్వడం తీవ్ర నిరసనలకు దారితీసింది. ప్రధాని మోడీ నవంబర్ 3న ఈ ప్రాంతంలో ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో పర్యావరణవేత్తలు, స్థానికులు, ప్రతిపక్షాలు ఆందోళనను ఉధృతం చేశాయి.
అనుమతులు..ఆందోళనలు
సైదోంగర్ ప్రాంతంలో చెట్ల నరికివేతకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. దీంతో ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ప్రాజెక్టు కోసం చెట్ల నరికివేతకు అక్టోబర్ 14న మహారాష్ట్ర అటవీశాఖ అనుమతిచ్చింది. అంతకుముందే ఈనెల జనవరి 12న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి త్వశాఖ పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. అయితే చెట్ల నరికివేతను నిలిపివేసినట్టు అటవీశాఖ వర్గాలు తెలిపినప్పటికీ.. తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారన్నదానిపై స్పష్టత లేదు. ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసేవరకు నిరసనలు కొనసాగిస్తామ ని శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ప్రకటించాయి. రూ.13,505 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 377 హెక్టార్ల భూమి అవసరం. ఇందులో 233 హెక్టార్లు అటవీ భూమి కాగా, మిగిలిన 144 హెక్టార్లు ఆరు గ్రామాలకు చెందిన భూమి. ఈ అడవుల్లో చిరుతలు, బద్ధకం ఎలుగుబంట్లు, తోడేళ్లు, నక్కలు, అడవి పిల్లులు, సాంబార్ జింకలు, నాలుగు కొమ్ముల జింకలు, అలుగు వంటి వన్యప్రాణులు ఉన్నాయి. అనేక రకాల పక్షులు, పాములు కూడా ఈ ప్రాంతంలో జీవిస్తున్నాయి.
చెట్ల పెంపకంతో నష్టాన్ని పూడ్చగలమా?
ప్రాజెక్టు పరిసరాల్లో 30 వేల చెట్లు, సతారా ప్రాంతంలో మరో 60 వేల చెట్లు నాటుతామని ప్రభుత్వం చెప్తోందని మోరే తెలిపారు. అయితే కర్జత్‌లో నరికిన చెట్లకు బదులుగా దూర ప్రాంతాల్లో చెట్లు నాటడం వల్ల స్థానిక అడవి కోల్పోయిన ప్రయోజనాలు తిరిగి రావని ఆయన అభిప్రాయపడ్డారు.
విద్యుత్ అవసరాలపై సందేహాలు
పంప్డ్ స్టోరేజీ విధానంలో దిగువ జలాశయం నుంచి నీటిని పై జలాశయానికి పంపేందుకు విద్యుత్ వినియోగిస్తారు. తిరిగి నీటిని కిందకు వదిలినప్పుడు టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మహారాష్ట్రలో నిజంగా అంతటి మిగులు విద్యుత్ ఉందా అనే ప్రశ్నకు సమాధానం అవసరమన్నారు. పశ్చిమ కనుమలు పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతమనీ, భారీగా చెట్ల నరికివేత, సొరంగాల నిర్మాణం వల్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతుందని పర్యావరణవేత్త కే.జే. జాయ్ హెచ్చరించారు.
ప్రభుత్వం, కంపెనీ వాదన
ఈ విమర్శలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. రాష్ట్రాన్ని పంప్డ్ స్టోరేజీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామనీ, ఈ ప్రాజెక్టు ద్వారా 3,000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు లేకపోతే అదే సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తుందని, దాని కాలుష్య ప్రభావాన్ని తగ్గించడానికి 28 కోట్ల పూర్తిగా ఎదిగిన చెట్లు అవసరమవుతాయని వాదించారు. ప్రాజెక్టు ప్రాంతంలో 90 వేల చెట్లు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడతామని తెలిపారు.టోరెంట్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయేశ్ దేశాయ్ మాట్లాడుతూ... ప్రాజెక్టుకు అవసరమైన అటవీ, ఇతర అనుమతులన్నీ పొందిన తర్వాతే పనులు ప్రారంభించామని వెల్లడించారు. సౌర, పవన విద్యుత్‌ను నిల్వ చేసి అవసరమైనప్పుడు వినియోగించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందనీ, తద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని, కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని వివరించారు. తప్పనిసరిగా కలిగే పర్యావరణ నష్టాన్ని ప్రత్యామ్నాయ వనాల పెంపకం, పచ్చదనం అభివృద్ధి, జీవవైవిధ్య పరిరక్షణ చర్యల ద్వారా తగ్గిస్తామని తెలిపారు.
బీజేపీకి టోరెంట్ గ్రూప్ రూ.137 కోట్ల విరాళం
టోరెంట్ గ్రూప్ 2019 మే నుంచి 2024 జనవరి మధ్య బీజేపీకి కనీసం రూ.137 కోట్ల ఎన్నికల బాండ్ల విరాళాలు ఇచ్చినట్టు గతంలో న్యూస్‌లాండ్రీ నివేదించింది. దీంతో ఈ విరాళాలకు, కర్జత్ ప్రాజెక్టుకు మధ్య సంబంధంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు వల్ల విద్యుత్ ప్రయోజనాల పేరిట వందల హెక్టార్ల అటవీ భూమి, జీవవైవిధ్యంపై పడే ప్రభావం ఎంతవరకు సమర్థనీయమన్న ప్రశ్న ఇప్పుడు మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది.
మూడు లక్షల చెట్లు నరికివేసే ప్రమాదం
ఇప్పటికే 2,700 చెట్లు నరికివేశారని ఉద్యమకారుడు, న్యాయవాది కైలాశ్ మోరే తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలైతే భవిష్యత్తులో మూడు లక్షల వరకు చెట్లు నరికివేసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 200 నుంచి 300 ఏండ్ల వయసున్న చెట్లను నరికితే ఆ పర్యావరణ వ్యవస్థకు కోలుకోలేని నష్టం జరుగుతుందని చెప్పారు. ప్రాజెక్టు జలాశయాలకు 2,300 కోట్ల లీటర్ల నీరు అవసరమవుతుందనీ, దీనివల్ల స్థానిక ప్రజలు, రైతులకు నీటి కొరత ఏర్పడవచ్చని హెచ్చరించా రు. విద్యుత్ లైన్లు, టవర్ల వల్ల కూడా విస్తృతంగా భూమి ప్రభావితమవుతుందని వివరించారు.







కామెంట్లు (0)