పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం...బీజేపీ ప్రభుత్వ దాష్టీకం
దిస్పూర్ : అస్సాంలో బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆదివారం మధ్యాహ్నం దిభ్రూ జిల్లాలో బెంగాలీ ముస్లిం కుటుం బాలు నివసిస్తున్న ఇళ్లను కూల్చి వేసింది. దీంతో నాలుగు వేల మంది రోడ్డున పడ్డారు. అలమ్గంజ్ పార్ట్-9 గ్రామంలో ప్రభుత్వానికి చెందిన భూమిలో వీరంతా చాలా కాలంగా నివసిస్తున్నారు. పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వ అధికారులు గత రెండు సంవత్సరాలుగా అన్వేషిస్తుండగా బెంగాలీ ముస్లింలు నివసిస్తున్న ప్రాంతంపై వారి కన్ను పడింది. పార్కు ఏర్పాటు కోసం ఈ భూమిని పరిశ్రమల శాఖకు అప్పగిస్తామని ధుబ్రి జిల్లా కమిషనర్ దివాకర్ నాథ్ చెప్పారు. కాగా నివాసితులు ఈ ప్రాంతానికి వేర్వేరు సమయాలలో చేరుకొని స్థిరపడిపోయారు. కొందరు ఐదు సంవత్సరాల క్రితం రాగా మరికొందరు పదకొండు ఏండ్ల క్రితమే వచ్చి ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తమలో చాలా మందికి ఇతర ప్రాంతాల్లో భూములు ఉన్నాయంటూ అధికారులు చేస్తున్న ఆరోపణను వారు తోసిపుచ్చారు. గ్రామానికి చెందిన 80 సంవత్సరాల వృద్ధుడు అలీ చాంద్ ఫకీర్ మాట్లా డుతూ 'ఈ రోజు బుల్డోజర్లతో మూడు ఇండ్లు, చెట్లు, మరుగు దొడ్లను కూల్చివేశారు. అవన్నీ నేలమట్ట మయ్యాయి' అని వాపోయారు. బ్రహ్మపుత్ర నదికి వచ్చే వరదలు, వాటి కారణంగా సంభవించే కోతల కారణంగా పొరుగున ఉన్న గోల్పారా జిల్లా నుంచి 1962లోనే ఈ గ్రామానికి వచ్చానని, అప్పటి నుంచీ ఇక్కడే ఉంటున్నానని ఆయన చెప్పారు. 1972-2016 మధ్యకాలంలో చాలా మంది నివాసితులు తౌజీ విధానం కింద భూమిశిస్తు కూడా చెల్లించారని తెలిపారు. తౌజీ రసీదులు అంటే ప్రభుత్వ భూమిని ఆక్రమిం చుకున్న ప్రజలు చేసిన చెల్లింపులకు సంబంధించిన రికార్డులు. అస్సాంలో గత పది సంవత్సరాల బీజేపీ పాలనలో ప్రభుత్వ భూముల నుంచి 19,000 కుటుంబాలను ఖాళీ చేయించారని, వీరిలో అత్యధికులు ముస్లింలేనని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల డేటా చెబుతోంది.







కామెంట్లు (0)