ప్రభుత్వ వైద్య వ్యయం పెరిగిందంటూ కేంద్రం గొప్పలు
అయినా అప్పులపాలవుతున్న కుటుంబాలు
జీడీపీలో ఆరోగ్య రంగానికి కేటాయింపులు లక్ష్యానికి దూరం
మోడీ పాలనలో దేశ ప్రజలకు దక్కని ఆర్థిక భరోసా
న్యూఢిల్లీ : దేశంలో ఆరోగ్య రంగానికి ప్రభుత్వ ఖర్చు మూడు రెట్లు పెరిగిందనీ, వైద్యానికి ప్రజలు సొంతంగా భరిస్తున్న ఖర్చు గణనీయంగా తగ్గిందని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆస్పత్రి ఖర్చులు, మందుల ధరలు, వైద్య పరీక్షల భారం నుంచి సామాన్యులకు ఇంకా విముక్తి లభించడం లేదు. అనారోగ్యం వస్తే అప్పులు చేయడం, ఆస్తులు అమ్ముకోవడం, ఇతర అవసరాలకు పెట్టాల్సిన డబ్బును చికిత్స కోసం ఖర్చు చేయడం అనేక కుటుంబాలకు తప్పడం లేదు. దీంతో మోడీ సర్కారు చేసే ప్రచారానికీ, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు మాత్రం పొంతన కనబడటం లేదు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ గణాంకాల్లో కనిపిస్తున్న పురోగతి ప్రజలకు నిజమైన ఆర్థిక భరోసాగా మారలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన జాతీయ ఆరోగ్య ఖాతాల గణాంకాల ప్రకారం.. దేశ మొత్తం ఆరోగ్య వ్యయంలో కుటుంబాలు నేరుగా భరించే ఖర్చు 2013-14లో 64 శాతంగా ఉండగా... 2023-24 నాటికి 43 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యయం రూ.1.30 లక్షల కోట్ల నుంచి రూ.4.14 లక్షల కోట్లకు చేరింది. ఒక్కొక్కరిపై ప్రభుత్వ ఆరోగ్య వ్యయం రూ.1,042 నుంచి రూ.2,959కు పెరిగిందని కేంద్రం వెల్లడించింది. అయితే ఈ పెరుగుదలతో ప్రజల వైద్య కష్టాలు తీరిపోయాయని చెప్పలేమని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2022 జులై నుంచి 2023 జూన్ వరకు 3.02 లక్షల కుటుంబాలపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఆస్పత్రిలో చేరకుండా వైద్యం పొందిన కుటుంబాల్లో 38 శాతం, ఆస్పత్రిలో చేరిన కుటుంబాల్లో 46 శాతం మంది తమ ఆర్థిక స్థోమతకు మించిన వైద్య ఖర్చులను భరించారు.
ప్రభుత్వ బీమా ఉన్నవారిలోనూ ఈ సమస్య కొనసాగుతోంది. అంటే ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ వైద్య ఖర్చుల నుంచి కుటుంబాలకు పూర్తి రక్షణ లభించడం లేదని స్పష్టమవుతోంది.
మరోవైపు కేంద్రం చెప్తున్నట్టుగా ప్రభుత్వ ఆరోగ్య వ్యయం పెరిగినట్టు కనిపిస్తున్నా.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే పెరుగుదల అంత భారీగా లేదని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి చెందిన ఆర్థికవేత్త ఇంద్రనీల్ ముఖోపాధ్యాయ్ వివరించారు. 2023-24లో దేశ జీడీపీలో ప్రభుత్వ ఆరోగ్య వ్యయం 1.43 శాతానికి పరిమితమైంది. 2022-23లో ఇది 1.48 శాతంగా ఉంది. ఇక 2025 నాటికి జీడీపీలో 2.5 శాతం ఆరోగ్య రంగానికి ఖర్చు చేయాలన్న 2017 జాతీయ ఆరోగ్య విధానం లక్ష్యం కూడా నెరవేరకపోవడం మోడీ సర్కారు చిత్తశుద్ధికి అద్దం పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
జీడీపీ పెరుగుదల కారణంగా ప్రభుత్వ వ్యయం పెరిగినా.. జీడీపీలో దాని వాటా తగ్గిందని కేంద్రం సమర్థించుకుంటోంది. కానీ ప్రజలకు కావాల్సింది గణాంకాల గొప్పలు కాదనీ, అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం, ఉచిత మందులు, పరీక్షలు, బలమైన ప్రభుత్వ ఆస్పత్రులని మేధావులు సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఆరోగ్య రంగానికి తగిన నిధులు కేటాయించకుండా, ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించకుండా మోడీ సర్కారు చేసే అభివృద్ధి ప్రచారంతో ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.







కామెంట్లు (0)