హాట్‌..హాట్‌

1 గంట క్రితం

Parliament
avatar
balaji

ప్రచురించబడింది నవం 30, 2026 | 5 నిమిషాల చదవడం

నేటి నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు

డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ బిల్లుల ఆమోదానికి కేంద్రం యత్నం

దానికి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న ఇండియా బ్లాక్..డీఎమ్‌‌కే స్టాలిన్‌‌తో చర్చలు విఫలం

బిల్లుకు మద్దతు కొనసాగుతుందని పునరుద్ఘాటన..జెర్రీ మాండరింగ్‌ అసలు సమస్య


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో ​
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌), మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన కీలక బిల్లులను ఆమో దించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యం లో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాను న్నాయి. నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 3 వరకు జరిగే ఈ సమావేశాల్లో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాల సంఖ్యను 50 శాతం పెంచడం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 ఎన్నికల నుంచే అమలు చేయడం లక్ష్యంగా కేంద్రం కొత్త బిల్లుల ను ప్రవేశపెట్టనుంది. ఇదే అంశంపై ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ప్రతిపక్షాలు ఉమ్మడిగా తిరస్కరించాయి. దీనితో ఈ బిల్లుకు అవసరమైన మద్దతు లేకపోవడంతో వీగిపోయింది.

ఈ నేపథ్యంలో తాజాగా సవరించిన ప్రతిపాదనలతో కేంద్రం మరోసారి పార్లమెంటు ముందుకువ స్తుంది. ఈ ప్రయత్నాన్ని అడ్డుకొనేందు కు ఇండియా బ్లాక్‌ ‌ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అయితే ఇండియా బ్లాక్‌లో భాగస్వాములుగా ఉన్న డీఎంకే, ఎన్‌సీపీ, జేఎంఎం వంటి పార్టీలు బిల్లుకు అనుకూలంగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇండియా బ్లాక్ పార్టీలు ఐక్యంగా ఉండేందు కు కాంగ్రెస్ నేత‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ వంటి నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే చెన్నై వెళ్లిన ప్ర‌తిప‌క్ష నేత‌ల బృందం డీఎంకే అధినేత ఎంకె స్టాలిన్‌తో భేటీ అయ్యారు. అలాగే ముంబయి వెళ్లి ఎన్‌సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వ‌ర్‌తోనూ భేటీ అయ్యారు. అయితే రెండుచోట్లా తాము కేంద్ర ప్రతిపాదనకు మద్దతు ఇస్తామని ఆపార్టీల నేతలు తేల్చిచెప్పారు.

​2051 వరకు స్థానాల కేటాయింపులో మార్పులుండవా?

రాష్ట్రాల మధ్య ప్రస్తుత స్థానాల నిష్పత్తికి భంగం కలగకుండా ప్రతి రాష్ట్రానికి, కేంద్రపాలిత ప్రాంతానికి 50 శాతం పెంపు చేయాలన్నది కేంద్రం ప్రతిపాదన. ఈ పెంపుతో రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరిగినా, వాటి మధ్య ప్రస్తుత సాపేక్ష ప్రాతినిధ్య నిష్పత్తిని కొనసాగించాలని పేర్కొంటోంది. స్థానాల పెంపు, కేటాయింపుల విషయంలో 2051 వరకు స్థిరత్వం కొనసాగించాలనే ప్రతిపాదన ఉన్న‌ట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్‌ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల స్థానాల నిష్పత్తి తగ్గకూడదని పలువురు నేతలు డిమాండ్‌ చేశారు.

​ఏప్రిల్‌లో వీగిన బిల్లులు

​ఈ ఏడాది ఏప్రిల్‌ 16, 17 తేదీల్లో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్‌ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన ప్రత్యేక మెజారిటీ లభించకపోవడంతో ఏప్రిల్‌ 17న లోక్‌సభలో బిల్లు వీగిపోయింది. అనంతరం అనుబంధ డీలిమిటేషన్‌ బిల్లులపై ముందుకు వెళ్లలేదు. ఈసారి పాత బిల్లును ఉపసంహరించుకొని కొత్త ప్రతిపాదనలతో 132వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్‌ రెండో బిల్లులను తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు సభలో హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మూడింట రెండొంతుల మద్దతు అవసరం కావడంతో కేంద్రానికి ప్రతిపక్షాల మద్దతు కీలకంగా మారింది.

​సమావేశాల షెడ్యూల్‌

​నవంబర్‌ 30న లోక్‌సభ సమావేశాలు ప్రారంభమవుతాయి. డిసెంబర్‌ 1న కూడా లోక్‌సభ కొనసాగుతుంది. డిసెంబర్‌ 2న లోక్‌సభతో పాటు రాజ్యసభ సమావేశమవుతుంది. డిసెంబర్‌ 3న రెండు సభల్లో ప్రభుత్వ కార్యకలాపాలు చేపట్టనున్నారు. ఇవి వర్షాకాల సమావేశాలకు కొనసాగింపుగా నిర్వహిస్తున్న ప్రత్యేక సమావేశాలు. ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్‌, ప్రైవేట్‌ సభ్యుల కార్యక్రమాలు ఉండవని తాత్కాలిక షెడ్యూల్‌ పేర్కొంది. ఈ ప్రత్యేక సమావేశాలు కేంద్ర ప్రభుత్వానికి కీలక రాజకీయ పరీక్షగా మారనున్నాయి. మహిళా రిజర్వేషన్ల అమలుపై ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, వాటిని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడంపై వివాదం కొనసాగుతోంది. బిల్లులకు అవసరమైన మెజారిటీ సాధించి ఆమోదించుకోవడంలో కేంద్రం విజయం సాధిస్తుందా, లేక ప్రతిపక్షాల వ్యతిరేకతతో మరోసారి ప్రతిష్టంభన ఏర్పడుతుందా అన్నది పార్లమెంట్‌ సమావేశాల్లో తేలనుంది.

​371 మంది ఎంపీల మ‌ద్ద‌తు ల‌భిస్తోందిః కేంద్ర ప్ర‌భుత్వం

​మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపునకు ఉద్దేశించిన 132వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. ఈ బిల్లుకు 371 మంది ఎంపిల మద్దతు లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను డీలిమిటేషన్ కమిషన్ చైర్మె న్‌గా నియమించబోతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశాయి. గతంలో ఉన్న డీలిమిటేషన్ కమిషన్ చట్టంలో ఎటువంటి మార్పులు, చేర్పులు చేయలేదని పేర్కొన్నాయి. మహిళా రిజర్వేషన్ అంశాన్ని మాత్రమే కొత్త డిలిమిటేషన్ కమిషన్ చట్టంలో చేర్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పడుతుందని, ప్రతి రాష్ట్రంలో ఐదుగురు ఎంపిలు కమిషన్‌లో సభ్యులుగా ఉంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఖర్గే ఆరోపణల్లో కూడా నిజం లేదని, ఎస్‌సి, ఎస్‌టిల నియోజకవర్గాలు కూడా 50 శాతం పెరుగుతాయని స్పష్టం చేసింది. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరిగితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరిగేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంగీకరించాయి. లోక్‌సభ స్థానాలను 543 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడం, రాష్ట్రాలవారీగా ప్రస్తుతం ఉన్న స్థానాలను 50 శాతం పెంచడం వంటి ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉన్నాయి. ​


తెరపైకి జెర్రీమాండరింగ్

ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల్లో ప్రయోజనం కలిగేలా లేదా ప్రత్యర్థి పార్టీలకు మద్దతిచ్చే ఓటర్ల ప్రభావాన్ని తగ్గించేలా నియోజకవర్గాల సరిహద్దులను ఉద్దేశపూర్వకంగా మార్చడాన్నే జెర్రీమాండరింగ్ అంటారు. ఈ పదం 1812లో అమెరికాలో పుట్టింది. అప్పట్లో మసాచుసెట్స్ గవర్నర్ ఎల్‌బ్రిడ్జ్ గెర్రీ ఆమోదించిన ఓ ఎన్నికల జిల్లా ఆకారం సాలమాండర్ అనే ఉభయచర జీవిని పోలి ఉందని ఓ వ్యంగ్య చిత్రం ప్రచురితమైంది. గెర్రీ పేరులోని ‘గెర్రీ’, సాలమాండర్‌లోని ‘మాండర్’ పదాలను కలిపి ‘జెర్రీమాండర్’ అనే పదాన్ని సృష్టించారు. అప్పటి నుంచి రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను మలచే ప్రక్రియకు ఈ పదం వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు భారతదేశంలోనూ ఇదే తరహా రాజకీయ ప్రయోగం జరిగే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.​ ప్రతిపక్షాల ప్రధాన అభ్యంతరం డీలిమిటేషన్ ద్వారా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగడంపై మాత్రమే కాదు. ఆ సీట్లను ఏ ప్రాంతాల్లో, ఎలాంటి భౌగోళిక విభజనతో ఏర్పాటు చేస్తారన్నదే అసలు సమస్య. సీట్ల సంఖ్య పెరగడం వల్ల ప్రజలకు శాసనసభల్లో మెరుగైన ప్రాతినిధ్యం లభిస్తుందని, మహిళలకు రాజకీయాల్లో మరింత అవకాశాలు, గొంతు లభిస్తాయని మోడీ సర్కార్‌ ‌ప్రచారం చేస్తుంది. కానీ తెరవెనుక జెర్రీ మాండరింగ్‌ ప్రమాదం పొంచే ఉంది. రాజ్యాంగం సహా అనేక వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్న కేంద్రం ఇప్పుడు నియోజకవర్గాల మ్యాపుల్ని తనకు అనుకూలంగా మార్చుకోదనే గ్యారంటీ ఏమీ లేదని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ​


మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌ మెలిక

​2023లో పార్లమెంట్‌ ఆమోదించిన
నారీశక్తి వందన్‌ చట్టం ప్రకారం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. అయితే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేలా నిబంధనలు రూపొందించారు. దీంతో 2029 ఎన్నికల నాటికి అమలు సాధ్యం కాకపోవచ్చనే ఆందోళనలు వ్యక్తమ య్యాయి. ఈ నేపథ్యంలో జనగణన గణాంకాల కోసం వేచి ఉండకుండా, స్థానాల సంఖ్యను 50 శాతం పెంచి మహిళా రిజర్వేషన్లను త్వరగా అమలు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. పెరిగిన స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్లు కేటాయించడంతో పాటు, నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు డీలిమిటేషన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని బిల్లులో పేర్కొంది. మహిళలకు కేటాయించిన స్థానాలను కమిషన్‌ నిర్ణయించిన పద్ధతిలో రొటేషన్‌ ప్రకారం కేటాయించే ప్రతిపాదన కూడా ఉంది.


​ప్రతిపక్షాల అభ్యంతరాలు

​మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల్లోనే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యంలో అసమానతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బిల్లులపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నాయి. ఏప్రిల్‌లో బిల్లును వ్యతిరేకించిన ప్రతిపక్షాలు ఈసారి కూడా తమ వైఖరిని స్పష్టం చేయనున్నాయి. కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, వామ‌ప‌క్షాల‌తో స‌హా అన్ని పార్టీలు తమ లోక్‌సభ సభ్యులకు సభకు తప్పనిసరిగా హాజరుకావాలని విప్‌ జారీ చేశాయి. బిల్లులపై చర్చ, ఓటింగ్‌ జరిగే రోజుల్లో సభ్యులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించాయి.


మూడు కీలక బిల్లులు

​రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు-2026, డీలిమిటేషన్‌ (రెండో స‌వ‌ర‌ణ‌) బిల్లు-2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (రెండో సవరణ) బిల్లులను సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న‌ది. ఈ బిల్లుల‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర న్యాయ శాఖ‌మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ బిల్లుల‌కు ఇప్ప‌టికే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచాలని డీలిమిటేషన్‌ (రెండో) బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ పెంపుతో లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుత 543 నుంచి 816కు చేరే అవకాశం ఉంది. రాష్ట్రాల శాసనసభల్లోనూ ఇదే తరహాలో స్థానాల పెంపును ప్రతిపాదించారు.






ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్