ఇక సమరమే

1 గంట క్రితం

battle
avatar
balaji

ప్రచురించబడింది నవం 30, 2026 | 3 నిమిషాల చదవడం

ఢిల్లీలో లక్షమందితో మహా ప్రదర్శన

కార్మికులపై కేంద్రం చిన్నచూపు..డిసెంబర్‌ 1 నుంచి 3 వరకు ఆందోళన

రూ.42 వేల కనీస వేతనం.. రూ.21 వేల పెన్షన్‌ కోసం పోరాటం

నాలుగు లేబర్‌ కోడ్‌ల రద్దు, ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణకు డిమాండ్‌

మహిళా కార్మికులకు ఉద్యోగుల గుర్తింపు.. ఖాళీల భర్తీకి పట్టు

సీఐటీయూ ఆధ్వర్యంలో పార్లమెంట్‌ మార్చ్‌


దేశంలో కార్మికుల హక్కులు, వేతనాలు, ఉద్యోగ భద్రతను పట్టించుకోకుండా కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై కార్మిక సంఘాలు పోరాటానికి సిద్ధమయ్యాయి. కనీస వేతనాలు పెంచాలని, సామాజిక భద్రత కల్పించాలని, కార్మిక హక్కులను బలహీనపరిచే నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో భారీ నిరసనకు పిలుపునిచ్చాయి. సీఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొననున్నారు.


న్యూఢిల్లీ : ప్రతి కార్మికుడికి నెలకు కనీసం రూ.42 వేల వేతనం ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్‌ చేస్తోంది. స్వయం ఉపాధితో జీవించే వారికీ ఈ కనీస ఆదాయం వర్తింపజేయాలని కోరుతోంది. ప్రస్తుతం కేంద్రం నిర్ణయించిన జాతీయ కనీస వేతన పరిమితి రోజుకు రూ.178 మాత్రమే. అంటే నెలకు రూ.4,628. నేటి ధరలతో పోలిస్తే ఈ మొత్తం జీవనానికి ఏమాత్రం సరిపోదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. 1957లో భారత కార్మిక సదస్సు నిర్దేశించిన ప్రమాణాలు, కుటుంబ అవసరాలు, ఆహారం, దుస్తులు, నివాసం, విద్య, వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకుని రూ.42 వేల డిమాండ్‌ను రూపొందించినట్టు తెలిపాయి. సంపన్నులపై పన్నులు.. పేదలకు భరోసా రూ.21 వేల కనీస వృద్ధాప్య పెన్షన్‌ ఇవ్వాలని కూడా కార్మికులు డిమాండ్‌ చేస్తు న్నారు. రూ.42 వేల కంటే తక్కువ సంపాదిం చే కార్మికులకు మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం దేశంలోని అత్యంత సంపన్నులపై 10 శాతం సంపద పన్ను, 33 శాతం వారసత్వ పన్ను విధించాలని కోరుతున్నారు. పేదలకు రాయితీ లు ఇచ్చే బదులు సంపన్నులకు పన్ను ప్రయో జనాలు కల్పిస్తున్న కేంద్ర విధానాలు అసమా నతలను పెంచుతున్నాయని సీఐటీయూ విమర్శించింది. నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చడాన్ని కార్మిక సంఘా లు వ్యతిరేకిస్తున్నాయి. సమ్మెకు ముందస్తు నోటీసు నిబంధనలను

విస్తరించడం, అసంఘటిత రంగ కార్మికులకు స్పష్టమైన సామాజిక భద్రత కల్పించకపోవడం వంటి అంశాలు కార్మిక హక్కులను దెబ్బతీస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. ఈ కోడ్‌లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ఉపాధి హామీ చట్టానికి మళ్లీ ప్రాణం పోయాలి

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)ను పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. దాని స్థానంలో తీసుకొచ్చిన వీబీ-జీ రామ్‌ జీ చట్టం ద్వారా పేదలకు ఉపాధి అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని విమర్శిస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఖర్చు భారాన్ని 60:40 నిష్పత్తిలో పంచడం వల్ల పేద రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మహిళా కార్మికులకు ఉద్యోగుల గుర్తింపు

అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం కార్మికులను ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం, పీఎఫ్‌, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వీరిని ఉద్యోగులుగా కాకుండా వాలంటీర్లు, గౌరవ వేతనం పొందేవారిగా పరిగణిస్తున్నారు. నెలకు కేవలం రూ.2,500 నుంచి గౌరవ వేతనం అందుతున్న పరిస్థితి ఉందని సంఘాలు పేర్కొన్నాయి. మహిళల భద్రతకు హామీ లేకుండా రాత్రి పూట పని చేసేందుకు అనుమతించడం కూడా ఆందోళనకరమని విమర్శించాయి.

ఖాళీలు భర్తీ చేయాలి.. భద్రత కల్పించాలి

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 8.23 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగ విధానాన్ని నిలిపివేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. యజమానుల నిర్లక్ష్యం వల్ల జరిగే నేరాలకు జైలు శిక్షలను తొలగించి జరిమానాలతో సరిపెట్టే జన విశ్వాస్‌ చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)ను రద్దు చేయాలని కోరుతున్నాయి.

లక్షమందితో ఢిల్లీకి కార్మికులు

డిసెంబర్‌ 1 నుంచి 3 వరకు రాంలీలా మైదానం నుంచి పార్లమెంట్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని సీఐటీయూ నిర్ణయించింది. ఇప్పటికే 55 వేల మందికి పైగా రైలు టికెట్లు బుక్‌ చేసుకున్నారని, 50 వేల మందికి పైగా మహిళా కార్మికులు పాల్గొంటారని వెల్లడించింది. అయితే పార్లమెంట్‌ వరకు ర్యాలీకి ఢిల్లీ పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వలేదు. కార్మికుల సమస్యలపై చర్చించాల్సిన భారత కార్మిక సదస్సు 2015 నుంచి జరగకపోవడంపై కూడా సీఐటీయూ అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్పొరేట్లకు ప్రాధాన్యం ఇచ్చే విధానాలు కాకుండా, శ్రమజీవుల జీవన ప్రమాణాలను పెంచే విధానాలు అమలు చేయాలని ఈ పోరాటం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేయాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్