Magazines

మా నీరు సురక్షితం

4 గంటల క్రితం

మా నీరు సురక్షితం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 2 నిమిషాల చదవడం

థర్డ్ పార్టీ పరీక్షలో పాస్

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి నోటీస్‌ రాలేదు : వివరణ ఇచ్చిన బిస్లరీ యాజమాన్యం

‘‘మా నీరు తాగడానికి పూర్తిగా సురక్షితం’’ అని బిస్లరీ తెలిపింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కేసు సుమారు 14 నెలల నాటిదని పేర్కొంటూ ఒక ప్రకటన జారీ చేసింది. బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సురక్షితం కాదని, దీనిపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ విచారణకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.

బిస్లరీ ప్రకటన ప్రకారం... ఈ కేసు సెప్టెంబర్ 2025లో కంపెనీ గోవా ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన ఒక బ్యాచ్‌కు సంబంధించినది. బిస్లరీ నెట్‌వర్క్‌లో మొత్తం 143 ప్లాంట్లు ఉన్నాయి. సెప్టెంబర్ 30, 2025న గోవా యూనిట్ నుంచీ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆరు నమూనాలను సేకరించిందని కంపెనీ పేర్కొంది. మొదట్లో, ఐదు నమూనాలు అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ఆరవ నమూనాలో బ్రోమేట్ స్థాయి లీటరుకు 12 మైక్రోగ్రాములుగా ఉంది, అయితే అనుమతించదగిన పరిమితి లీటరుకు 10 మైక్రోగ్రాములు. ‘‘స్వతంత్ర పరీక్షలో బ్రోమేట్ స్థాయిలు అనుమతించదగిన పరిమితుల్లోనే ఉన్నట్లు తేలింది’’,

నవంబర్ 22, 2025న కంపెనీ చేసిన అప్పీల్‌ను అనుసరించి, నమూనాను పున:పరీక్ష కోసం ఒక రెఫరల్ ల్యాబ్‌కు పంపారు. బిస్లరీ వివరాల ప్రకారం.. బ్రోమేట్ స్థాయిలు అనుమతించదగిన పరిమితుల్లోనే ఉన్నాయని రెఫరల్ ల్యాబ్ కనుగొంది. కానీ విడిగా పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లను (పీఏహెచ్ లు) గుర్తించింది. ఈ రెండు ఫలితాల మధ్య వ్యత్యాసం కారణంగా, బిస్లరీ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో స్వతంత్ర పరీక్షను నిర్వహించింది. అక్కడ కూడా బ్రోమేట్ స్థాయిలు అనుమతించదగిన పరిమితుల్లోనే ఉన్నట్టు తేలింది.

ఫిబ్రవరి 2, 2026 తేదీ గల లేఖతో పాటు స్వతంత్ర పరీక్ష నివేదికను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పశ్చిమ ప్రాంతీయ కార్యాలయానికి సమర్పించినట్లు బిస్లరీ పేర్కొంది. తదుపరి సమాచారం ఏదీ రాకపోవడంతో, కంపెనీ ఈ విషయాన్ని ముగిసినట్లుగా భావించింది. బిస్లరీ వివరాల ప్రకారం... దానికి ఇంకా ఇమెయిల్ లేదా హార్డ్ కాపీ రూపంలో ఎలాంటి నోటీసు అందలేదు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెబ్‌సైట్‌లో కూడా అలాంటి నోటీసు ఏదీ కనిపించ లేదు.

బిస్లరీ తాగడానికి సురక్షితం

‘‘తాగునీటి భద్రత బిస్లరీకి అత్యంత ప్రాధాన్యత గల విషయం. మా పది దశల తయారీ ప్రక్రియలో 90కి పైగా పరీక్షలతో మేము కఠినమైన నాణ్యత నియంత్రణను పాటిస్తాము. సరైన నియంత్రణ ప్రక్రియ ద్వారా ఈ విషయాన్ని పరిష్కరిం చడానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి సహకరించడం కొనసాగిస్తాము. సంవత్సరాలుగా విశ్వసనీయ బ్రాండ్‌గా ఉన్న బిస్లరీ తాగడానికి సురక్షితంగానే ఉంది.’’ అని బిస్లరీ కంపెనీ పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్