కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి
సర్ రద్దు, సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్
100కు పైగా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు
చారిత్రాత్మక రైతు ఉద్యమానికి ఆరేండ్లవుతున్న సందర్భంగా మరోసారి ఉద్యమబాట
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో గురువారం దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఆందోళనలకు సిద్ధమయ్యాయి. చారిత్రాత్మక రైతు ఉద్యమానికి ఆరేండ్లు పూర్తవుతున్న సందర్భంగా, రాజ్యాంగ దినోత్సవం రోజున రైతులు మరోసారి ఉద్యమ బాట పట్టనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను రద్దు చేయాలనీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పీపుల్ ఎగైనెస్ట్ సర్, ఎస్‌ఎఫ్‌ఐ సహా పలు ప్రజాసంఘాలు కూడా ఈ ఆందోళనల్లో భాగస్వాములు కానున్నాయి. కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు రైతుల ఉద్యమానికి మద్దతు, సంఘీభావం ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల్లో వందకు పైగా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఢిల్లీలోని మందిర్ మార్గ్ నుంచి జంతర్‌మంతర్ వరకు రైతులు ప్రదర్శన నిర్వహించనున్నారు. ఢిల్లీలోని టిక్రీ, బహదూర్‌గఢ్ సరిహద్దుల వద్ద కూడా రైతులు పెద్ద సంఖ్యలో సమావేశం కానున్నారు.
2021 డిసెంబరులో రైతుల చారిత్రాత్మక ఉద్యమం ముగిసిన సందర్భంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. అయితే ఐదేండ్లు గడుస్తున్నా ఆ హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. సమగ్ర సాగు వ్యయం (సి2)పై 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయించి చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం నుంచి వైదొలగాలనీ, అన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. సమగ్ర రుణమాఫీ అమలు చేయాలనీ, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాయి. విద్యుత్, విత్తన బిల్లులను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను నిలిపివేయాలని కూడా ఉద్యమ కార్యాచరణలో భాగంగా డిమాండ్లు ముందుకు తెస్తున్నాయి.







కామెంట్‌లు (0)