పెరుగుతున్న ధరలు స్తంభించిన వేతనాలు

1 గంట క్రితం

prices
avatar
balaji

ప్రచురించబడింది నవం 30, 2026 | 3 నిమిషాల చదవడం

కుదేలైన సామ్యానుడి జీవన చక్రం

న్యూఢిల్లీ : నిత్యావసర వస్తువుల ధరలు గతంలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకోవడం, మరోవైపు వేతనాల్లో పెరుగుదల స్తంభించడంతో దేశంలో సామాన్యుడి జీవన చక్రం కుదేలయింది. సామాన్యుడికి రోజువారీ జీవనం ఒక తీవ్రమైన ఆర్థిక పోరాటంగా మారింది. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారమే, వంటగది నిత్యావసర వస్తువుల ధరలు గతేడాదితో పోలిస్తే అసాధారణమైన పెరుగుదలను చూశాయి. ఉల్లిపాయల ధర దాదాపు రెట్టింపు అయ్యి, గత ఏడాదితో పోలిస్తే 98 శాతం అధిక ధరలకు అమ్ముడవుతుండగా, చక్కెర 30 శాతం పెరుగుదలతో నిల్వదారుల లాభాలను మరింత పెంచింది. వంట నూనెల ధరలు 14 శాతం కంటే ఎక్కువగానూ, బియ్యం ధరలు 12 శాతం వరకూ పెరిగాయి. అలాగే, పాలు (5 శాతం), గుడ్లు వంటి రోజువారీ పోషకాహార వనరుల ధరలు కూడా నిలకడగా పెరుగుతూ సామాన్యుడిపై మరింత భారాన్ని మోపుతున్నాయి.ఈ ధరల పెరుగుదల సంక్షోభం కేవలం పేద- మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌‌కే పరిమితం కాలేదు.

ఈ సంక్షోభం ఒక లోతైన, నిర్మాణాత్మకమైన "సామాజిక పునరుత్పత్తి సంక్షోభాన్ని" సూచిస్తుందని, ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ వేతనాలు స్తంభించిపోవడంతో, పేద జేబుల నుంచి డబ్బు ధనవంతుల బ్యాంకు ఖాతాలకు తరలిపోతోందని ఆర్థికవేత్తలు అంటున్నారు.ఈ ఏడాది ఆగస్టులో, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖకు చెందిన పర్యవేక్షణ విభాగం నిత్యావసర వస్తువుల లభ్యత, అందుబాటు ధరలను నిర్ధారించడానికి క్రమబద్ధమైన మార్కెట్ జోక్యాలు చేపడతామని వాగ్దానం చేసింది. కానీ అది అమలు కాలేదు. పెరుగుతున్న ధరల సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ఆర్థికవేత్తలు డిమాండ్‌ ‌చేస్తున్నారు. అయితే బ్లాక్‌‌మార్కెట్‌, నిల్వలు, అధిక లాభాపేక్ష కారణంగా ఉల్లిపాయలు, చక్కెర, వంట నూనెలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు.

ధరల పర్యవేక్షణ విభాగం సమాచారం ప్రకారం ఈ నెల 27 నాటికి దేశవ్యాప్తంగా బియ్యం సగటు రిటైల్ ధర కిలోకు రూ. 48.35గా ఉంది. సరిగ్గా ఏడాది క్రితం ఇది రూ. 43.15గా ఉంది. అంటే, ఏడాది కాలంలో ధర 12.05 శాతం పెరిగింది.అదేవిధంగా, గోధుమలు- గోధుమ పిండి ధరలు ఏడాది క్రితంతో పోలిస్తే వరుసగా 3.6 శాతం-3.1 శాతం పెరిగాయి. దేశంలో అత్యధికంగా వినియోగించే పప్పుధాన్యాలలో ఒకటైన కందిపప్పు సగటు రిటైల్ ధర కిలోకు రూ.136.64గా ఉంది; ఇది ఏడాది క్రితంతో పోలిస్తే ఇది 17.6 శాతం ఎక్కువ. సన్‌ఫ్లవర్ ఆయిల్ సగటు రిటైల్ ధర కిలో ప్యాకెట్‌కు రూ. 191.10గా ఉంది, ఇది గత ఏడాది ఇదే తేదీతో పోలిస్తే 15.7 శాతం ఎక్కువ. ఇక ఈ నెల 27న ఉల్లిపాయల సగటు రిటైల్ ధర కిలోకు రూ. 53.32గా ఉంది, గత ఏడాది ఇదే సమయంలో ఇది రూ. 26.88గా ఉండేది. చక్కెర జాతీయ సగటు రిటైల్ ధర కిలోకు రూ. 60.80గా ఉండగా, గత ఏడాది ఇది రూ. 46.61గా ఉండేది.

పెరుగుతున్న ఇతర వ్యయాలు

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ నెల 15న విడుదల చేసిన 'నేషనల్ హెల్త్ అకౌంట్స్ (ఎన్‌‌హెచ్‌ఎ) అంచనాలు 2023-24 ప్రకారం ఆరోగ్యం కోసం ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. అలాగే, నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) ఏప్రిల్ నుంచి జూన్ 2025 మధ్య నిర్వహించిన 'కాంప్రహెన్సివ్ మాడ్యులర్ సర్వే' ప్రకారం పట్టణ ప్రాంతాల్లో పాఠశాల కోర్సు ఫీజుల కోసం చేసే సగటు వ్యయం రూ. 15,143గా అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ 3,979గా ఉంది.

ఒక కుటుంబం విద్యార్థిపై చేసే వ్యయంలో అత్యధిక భాగం కోర్సు ఫీజులు, తరువాత పాఠ్యపుస్తకాలు, స్టేషనరీకి వ్యయమవుతుంది.ఇక, ఇంటి అద్దె ఖర్చులు కూడా భారీ పెరుగుతున్నాయి. కేంద్రం విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే 2023-24 ప్రకారమే ఇంటి అద్దెలు 7 శాతం పెరిగాయి. పెరుగుతున్న వ్యయాలు పేద- కార్మిక వర్గ కుటుంబాలను అసమానంగా దెబ్బతీస్తుందని ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్, ఆర్థికవేత్త సత్యకి రాయ్ తెలిపారు. దేశంలో 90 శాతానికి పైగా కార్మిక వర్గానికి సామూహిక బేరసారాల కోసం సంస్థాగత యంత్రాంగాలు లేనందున, ధరలు పెరిగినప్పుడు కార్మికులు అధిక వేతనాలను డిమాండ్ చేయడం కష్టంగా ఉందని అన్నారు.


‘వాస్తవ వేతనాలు చాలా వరకు స్తబ్దుగా ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో తగ్గాయి కూడా. ఇది కార్మికుల జేబుల్లో నుంచి డబ్బును సంపన్న వర్గాలకు ఆదాయ బదిలీని సూచిస్తుంది’ అని చెప్పారు. నిత్యావసర ఆహార పదార్థాలు ధరలు అందుబాటు ధరలలో ఉండడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. అలాగే, భారీగా ఉన్న ఇంధన ధరల ప్రభావం అన్ని నిత్యావసర వస్తువుల ధరలపై పడుతోందని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్ కౌర్ తెలిపారు. “పెరుగుతున్న జీవన వ్యయాలకు వేతనాలు సరిపోవడం లేదు. ద్రవ్యోల్బణం కార్మికులు, వారి కుటుంబాలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఇది వారి పోషణ, పిల్లల విద్య, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను ప్రభావితం చేస్తోంది” అని చెప్పారు. ధరల పెరుగుదలపై తక్షణ నియంత్రణ, ఆహారం, మందులు, వ్యవసాయ ఉత్పత్తులు, యంత్రాలు వంటి నిత్యావసర వస్తువులపై జిఎస్‌‌టి తొలగింపు, పెట్రోలియం ఉత్పత్తులు, వంటగ్యాస్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించడం, హామీతో కూడిన ఆహార భద్రత, సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థను కార్మిక సంఘాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్