డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం చర్యకు వామపక్ష పార్టీల ఖండన
మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్ నుంచి వేరు చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ : డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును తిరిగి ప్రవేశపెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఐదు వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఆర్‌ఎస్‌పీ, ఏఐఎఫ్‌బీ పార్టీల ప్రధాన కార్యదర్శులు ఆదివారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గత 104 రోజులుగా నిలిపేసిన పార్లమెంటు సమావేశాలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హడావుడిగా తిరిగి ప్రారంభించడం సరికాదని వామ పక్షాలు తెలిపాయి. కొన్ని ప్రతిపక్ష పార్టీలను చీల్చి, ‘ఆపరే షన్ లోటస్’ను రహస్యంగా అమలు చేసి, అవసరమైన సంఖ్యాబలాన్ని పెంచుకున్న తర్వాతే డీలిమిటేషన్ బిల్లును మళ్లీ తెరపైకి తెచ్చి, దాన్ని మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెడుతోందని విమర్శించాయి.
మహిళా రిజర్వేషన్‌పై జాప్యం
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం వామపక్షాలే నిరంతరం పోరాడాయని గుర్తుచేశాయి. 2023లో అన్ని పార్టీల మద్దతుతో పార్లమెంటు ఆమోదిం చిన చట్టాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేసిందన్నాయి. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించకుండా పక్షపాత వైఖరితో డీలిమిటేషన్‌ను ముందుకు తీసుకెళ్లాలని బిజెపి చూస్తోం దని వామపక్షాలు విమర్శిచాయి. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? కమిషన్‌ను ఎలా, ఎవరు ఏర్పాటు చేస్తారు? అనే విషయాల్లో స్పష్టత లేదని పేర్కొన్నాయి. దీంతో సమాజంలో ఇప్పటికే ఉన్న ప్రాంతీయ, కుల విభజనలు మరింత పెరుగుతాయని హెచ్చరించాయి.
రాజకీయ లబ్ది కోసమే..
కోట్లాది మంది అర్హులైన ఓటర్లను తొలగించి బిజెపికి ఎన్నికల సంఘం ఎలా లబ్ధి చేకూర్చిందో అలాగే, తమ విభజన ఎజెండా కోసం డీలిమిటేషన్ కమిషన్‌ను వాడుకుంటుందని ఆందోళనవ్యక్తం చేశాయి. ‘‘ఓట్ చోరీకి తోడు ఇప్పుడు బీజేపీ సీట్ చోరీ చేస్తుంది’’ అని వామ పక్షాలు విమర్శించాయి. డీలిమిటేషన్ పేరుతో బిజెపి చేస్తున్న గెర్రీమాండరింగ్ (రాజకీయ లబ్ది కోసం నియోజ కవర్గ సరిహద్దుల మార్పు) ప్రయత్నాలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నట్లు తెలిపాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ లాంటి కళంకిత వ్యక్తులను డీలిమిటేషన్ కమిషన్‌లో చోటు కల్పించరాదని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష పార్టీలకు, నిష్పాక్షిక న్యాయనిపుణులకు కమిషన్‌లో ప్రాతినిధ్యం ఉండాలని కోరాయి. మహిళా రిజర్వేషన్ అమలును డీలిమిటేషన్ నుంచి వేరు చేయాలని, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని, ముందు తరాలపై ప్రభావం చూపే ఇంతటి కీలక అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి, బహిరంగ చర్చ జరపాలని డిమాండ్ చేశాయి. బిజెపి ప్రభుత్వ అప్రజాస్వామ్య చర్యలను వ్యతిరేకిస్తూ ఈ ప్రక్రియను నిలువరించేందుకు, ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని వామపక్షాలు విజ్ఞప్తి చేశాయి.
ఈ ప్రకటనపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఆర్ఎస్‌పి ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, ఎఐఎఫ్‌బి ప్రధాన కార్యదర్శి జి దేవరాజన్ సంతకాలు చేశారు.







కామెంట్‌లు (0)