మహిళా రిజర్వేషన్ల బిల్లులపై హడావుడి ఎందుకు?

1 గంట క్రితం

Women's Reservation Bills?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 30, 2026 | 2 నిమిషాల చదవడం

30 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి : 34 మంది ప్రముఖుల డిమాండ్‌

దాదాపు మూడు రోజుల వ్యవధిలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టడంపై అభ్యంతరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుకు లేఖ

డీలిమిటేషన్‌ కమిషన్‌ స్వతంత్రత, పారదర్శకతపై ఆందోళన

న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రెండు కీలక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు కనీసం 30 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని 34 మంది ప్రముఖులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బిల్లుల ముసాయిదాలను ప్రజలకు అందుబాటులో ఉంచిన మూడు రోజుల్లోపే పార్లమెంటులో చర్చకు తీసుకురావడం వల్ల వాటిపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు, అభిప్రాయాలు వెల్లడించేందుకు తగిన సమయం ఉండదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్‌ ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజుకు రాసిన లేఖను సోషల్‌ మీడియాలో వెల్లడించారు. నవంబర్‌ 27 రాత్రి బిల్లుల ముసాయిదాలను విడుదల చేసి, నవంబర్‌ 30న పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం కానుండటాన్ని వారు తప్పుబట్టారు. వారాంతంతో కలిపి మూడు రోజుల లోపే గడువు ఇవ్వడం వల్ల ప్రజలకు, ఎంపీలకు అర్థవంతమైన చర్చకు అవకాశం ఉండదని పేర్కొన్నారు.

రాజ్యాంగ సవరణ (132వ) బిల్లు మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేయనుండగా, డీలిమిటేషన్‌ (రెండో సవరణ) బిల్లు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో రిజర్వేషన్ల అమలుతో పాటు నియోజకవర్గాల సంఖ్య, సరిహద్దుల మార్పులకు ఉద్దేశించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సీట్లను 50 శాతం పెంచడం, 2051 వరకు రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని కొనసాగించడం వంటి అంశాలను వారు స్వాగతించారు. అయితే, డీలిమిటేషన్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ నియామకం, పదవీకాలంపై కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో రాజకీయ పక్షపాతానికి తావులేకుండా స్వతంత్రత, పారదర్శకత, జవాబుదారీతనానికి హామీ ఇవ్వాలని కోరారు. కేంద్రం 2014లో రూపొందించిన ముందస్తు శాసన సంప్రదింపుల విధానం ప్రకారం బిల్లులను ఇంగ్లిష్‌, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ వివరణాత్మక వివరాలతో ప్రచురించి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. ఈ లేఖపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, యోగేంద్ర యాదవ్‌, హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై, మాజీ ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లవాసా, ఆర్థికవేత్త జయతి ఘోష్‌ తదితరులు సంతకాలు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్