ఇప్పుడు ఎన్నికల కాలం నడుస్తోంది. పాత పార్టీలో తమ కొలువు (టిక్కెట్)లేదని తెలుసుకుంటున్న నేతలు… ఉపాధి, ఉద్యోగం (రాజకీయ భవిష్యత్) కోసం కొత్త పార్టీ లోకి జంపవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటిదాకా తామున్న పార్టీ ఇచ్చిన వాగ్దానాలపై విమర్శలు గుప్పిస్తూ.. ఇప్పుడు తాము చేరిన కొంగొత్త పార్టీల హామీలపై ప్రశంసలు కురిపిస్తూ ముందుకు సాగుతు న్నారు. ఈ వాగ్దానాలు, హామీల్లో ఇటీవల కాలంలో చర్చనీయాంశమైంది నియామకాలు. అసలు ప్రత్యేక తెలంగాణ నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ ట్యాగ్‌లైన్లలో ఇప్పటిదాకా యువత ఉత్సాహంగా ఎదురు చూసింది ఉద్యోగాలు. వాటి కోసం అదే యువత పడిగాపులు కాసింది.. అవి రద్దవటంతో నిర్లిప్తత, నైరాశ్యంలో కూరుకు పోయింది. కానీ ప్రస్తుత అసెంబ్లీ ఎలక్షన్ సీజన్‌లో ఈ అంశం చుట్టే కారు, కమలం పార్టీలు రాజకీయం చేస్తూ అసలు అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయి.
కేంద్రంలో ఉన్న బీజేపీ గత పదేండ్లుగా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానంటూ గద్దెనెక్కిన మోడీ సర్కార్… కొత్త కొలువుల సంగేతేమోగానీ, ఉన్న ఉద్యోగాలను ఊడబెరికి జనాలకు రోడ్ల పాల్జేసింది. విమానాలు, రైల్వేలు, పోర్టు లు, పోస్టా ఫీసులు, బ్యాంకులు… ఇలా ఒకటేమిటి గత పదేండ్లుగా ఒక్కో రంగాన్ని ప్రయివేటీకరిస్తూ లక్షలాది ఉద్యోగులను బయటకు గెంటేసింది. తద్వారా మును పెన్నడూ లేనంతగా నిరుద్యోగం తారాస్థాయికి చేరింది. మధ్యలో టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకు అగ్నిపథ్‌లాంటి పథకాన్ని తెరపైకి తెచ్చినా అది వికటించి.. నిరుద్యోగుల ఆగ్రహానికి గురైంది. ఈ వాస్తవాలను మరుగుపరుస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు… ఉద్యోగాలివ్వలేదంటూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండటం కడు విడ్డూరం.
ఇదే సమయంలో పదేండ్లలో తెలం గాణలో ఇచ్చినన్ని కొలువులు దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇవ్వలేదంటూ బల్లగుద్ది మరీ చెప్పిన గులాబీ పార్టీ… మరి ఈ పదేండ్ల కాలంలో జాబ్ క్యాలెండర్‌ను ఎందుకు ప్రవేశపెట్టలేదో చెప్ప నుగాక చెప్పదు. దేశం లోని అన్ని రాష్ట్రాలతో ఎందుకు గానీ… దక్షి ణాదిలోని కేరళ, తమిళ నాడుతో పోల్చి చూసు కుంటే, ఆ రెండు రాష్ట్రాల్లో ప్రతీయేటా ఎంత మంది ఉద్యో గులు రిటైర్ అవుతు న్నారు.. వారిలో మహిళలెంత..? పురు షులెంత..? అనే లెక్క లను శాఖలు, రంగాలు, జిల్లాల వారీగా తీసి మరీ జాబ్ క్యాలెండర్‌ను ప్రచురిస్తుం టారు. అలా ప్రకటించిన వెంటనే… అదే ఏడాది ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయటం, ఆ వెంటనే నిర్ణీత సమయంలోగా వాటిని భర్తీ చేయటం ఆయా రాష్ట్రాల్లో ఆనవాయితీ. కానీ ఇక్కడ అందుకు పూర్తి విరుద్ధం. ‘మాదేమైనా అహోబిల మఠం అనుకున్నరా.. ఫక్తు రాజకీయ పార్టీ.. మేం ఏం చేసినా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తం.. అందుకనుగుణంగానే మా చర్యలుంటరు…’ అంటూ తెలంగాణ వచ్చిన కొత్తలో పెద్ద సారు చెప్పి నట్టు… ఎన్నికలు, ఉప ఎన్నికల నోటి ఫికేషన్ల కోసమే ఉద్యోగ నోటిఫికేషన్లను బీఆర్‌ఎస్ సర్కారు వేస్తోందే తప్ప ఖాళీల భర్తీకి కాదనే అపవాదును అది మూట గట్టుకుంది. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి… ఇటీవల నిర్వహించిన ఓ మీట్ ది ప్రెస్‌లో ‘ఈసారి నుంచి కచ్చితంగా జాబ్ క్యాలెండర్ వేస్తం..’ అంటూ కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హామీ ఇచ్చినప్పటికీ, దానికి ఎలక్షన్ స్టంట్ అనే ముద్ర పడిపోయింది. ఎందుకంటే 2018 ముందస్తు ఎన్నికల్లో సైతం ‘నిరుద్యోగ భృతి’ అని వాగ్దాన మిచ్చి.. ఆ తర్వాత మొండిచేయి చూపారు కాబట్టి.
ఈ క్రమంలో ఉద్యోగాలు, కొలువులు, ఉపాధి అనే నినాదాలు రాజకీయ పార్టీలకు, వాటి నేత లకు ‘ఉపాధి హామీ పథకాలు’ కాకూడదు. ఈ స్లోగన్స్ కేవలం నాయకులకు ‘ఉద్యోగాలిచ్చే’ మార్గాలుగా మారకూడదు. ఒక రాష్ట్రం, దేశం స్వయం సమృద్ధిని సాధించా లంటే మొదట యువత తమ కాళ్ల మీద తాము నిలబడ గలిగే స్థితిని కల్పించాలి. అందు కోసం వారికి విరివిరిగా అవకాశాలు కల్పించాలి.
సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా దూసుకెళుతూ.. కొత్త పుంతలు తొక్కుతున్న వేళ… సరికొత్తగా అది లక్షలాది కొలువులను సృష్టించాలి. ఇందుకు ప్రభుత్వాలు, పాల కులు పూనుకోవాలి. వారు ఆ విధంగా పూనుకునేలా ఓటర్లు చేయాలి. ఓటనే తమ వజ్రాయుధంతో గట్టిగా బుద్ధి చెప్పాలి. తమకు ఉద్యోగాలు, ఉపాధి చూపించక పోతే… నేతలకు, పార్టీలకు ‘ఉద్యోగాలు ఊడిపోతాయి’ అనే విధంగా గట్టి హెచ్చ రికలు పంపగలగాలి. దానికి ప్రస్తుత ఎన్నికలే సరైన సమయం.