నవతెలంగాణ-హైదరాబాద్: నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. జీవితంలో హరీశ్ రావు, సంతోశ్ కుమార్‌నైనా క్షమిస్తా.. కానీ ప్రశాంత్ రెడ్డిని మాత్రం క్షమించనని కవిత తేల్చి చెప్పారు. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన రెండో రోజే కాంగ్రెస్ నాయకులను ఆయన కలిశారని ఆరోపించారు. కేసీఆర్ పెట్టిన తిండి తిని తండ్రీ, బిడ్డలను విడదీశారని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పెద్ద కొడుకుగా ప్రశాంత్ రెడ్డి చెప్పుకుంటారని.. కానీ, మహాభారతంలో శకుని వంటి వ్యక్తి ఆయనని మండిపడ్డారు.
నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త శక్తి రావాల్సిందేనని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ‘నిజామాబాద్ కోడలిగా ఇక్కడ పని చేశా. నాకు మళ్లీ ఒక అవకాశం ఇవ్వండి. మీరే నా ధైర్యం’ అని కవిత అన్నారు. రాజకీయాలు చేయాలనుకుంటే తాను ఎక్కడికైనా, ఏ పార్టీలోకైనా వెళ్లగలనని, కానీ ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసులను ప్రస్తావిస్తూ కవిత భావోద్వేగానికి గురయ్యారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో చేసిందేమీ లేదని కవిత ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం నిద్రపోతోందని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. సామాజిక న్యాయం జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తమ కార్యకర్తలను బెదిరించే రోజులు పోయాయని కవిత చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు విఫలమవుతున్నాయని అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త శక్తికి ప్రజలు అవకాశం ఇవ్వాలని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.



