నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ విద్యుత్ వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం రెండురోజుల్లో నాశనం చేసిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. పదేళ్ల పాలనలో పటిష్టమైన విద్యుత్ వ్యవస్థను రూపొందించామని, బీజేపీ పాలనలో అది గాడి తప్పిందన్నారు. దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా గంటల కొద్ది కరెంట్ పోతుందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పెరగనుందని, దీంతో ఢిల్లీలో విద్యుత్ డిమాండ్ పెరగనుందని ఆయన చెప్పారు. అందుకు అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం వద్ద ముందస్తు చర్యలు లేవని ఆయన విమర్శించారు. డిమాండ్ తగ్గ సప్లయ్ లేకపోవడంతో ఢిల్లీ ప్రజలు కరెంట్ కోతలు ఎదురుకుంటున్నారని కేజ్రీవాల్ చెప్పారు. తమ ప్రభుత్వ పాలనలో ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా పకడ్బంధీగా చర్యలు తీసుకున్నామని, నిరంతర విద్యుత్ సరఫరాకు ఆప్ సర్కార్ కృషి చేసిందని ఆయన గుర్తు చేశారు.