నవతెలంగాణ-చేవెళ్ల
డబ్బుల కోసం సొంత మేనమామతో గొడవపడి హత్య చేసిన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన రుల్లా ఖాన్(58) భార్య పిల్లలతో కలిసి నగరంలో నివాసం ఉండేవాడు. రెండేండ్ల క్రితం రుల్లా ఖాన్ ఆరోగ్యం బాగు లేకపోవడంతో సొంత గ్రామానికి వచ్చి ఉంటున్నాడు. ఆరోగ్యం బాగుపడడంతో తనకు ఉన్న భూమిలో వ్యవసాయం చేస్తూ రుల్లా ఖాన్ ఒక్కడు గ్రామంలోని ఉంటున్నాడు. అక్క కొడుకు ఖాజాపాషా అప్పుడప్పుడు వచ్చి వెళ్లుతుండేవాడు. డబ్బులు కావాలని పలుసార్లు మామను అడిగాడు. గురువారం సాయంత్రం ఖజా పాషా మేనమామను హత్య చేసేందుకు కత్తి తీసుకుని స్నేహితులు షేక్ ముస్తఫా, అఫ్జల్‌లను తన వెంట తీసుకుని స్కూటీలపై తంగడపల్లి లోని మామ ఇంటికి వచ్చారు. రాత్రి వరకు మాట్లాడుకుంటూ ఉన్నారు. రాత్రి రెండు గంటల సమయంలో మామ అల్లుడు ఇద్దరి మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. మేనమామను తన వెంట తీసుకు వచ్చిన కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఇంటికి దూరంగా పెట్టిన స్కూటీని తీస్తుండగా గ్రామస్తులు గమనించారు. అనుమానం వచ్చి గ్రామస్తులు వెంటపడ్డారు. స్కూటీని వదిలి ఖాజా పాషా అతని స్నేహితులు పరారయ్యారు. హత్య విషయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య జాకీయ బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హత్య చేసిన ఖాజా పాషాను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.
రెండు రోజుల్లో రెండు హత్యలు..
గడిచిన రెండు రోజులుగా చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు హత్యలు జరిగాయి. పోలీసులు గస్తీ తిరగక పోవడం.. గ్రామాలపై రాత్రివేళలో నిఘా లేకపోవడంతో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. చేవెళ్ల మండలంలో అడ్డ గోళ్లు గా ఫామ్ హౌస్ లు ఏర్పాటు చేయడం, వాటిలో ఏం జరుగుతుందో తెలియక పోవడం.. విల్లాలు నిర్మాణం చేస్తున్నారు. వాటిలో ఇతర ప్రాంతాలకు చెందిన లేబర్ పనులకు రావడం క్షణికావేశంతో దారుణలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా గ్రామాల వారీగా ఉన్న పోలీసులు నిఘా పెంచాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు
హత్యకు గురైన సలీమ్ మామిడి తోటలు పట్టుకుని మామిడి పండ్లు అమ్ముకుని జీవనోపాధి పొందేవాడని గ్రామస్తులు తెలిపారు. గ్రామ శివారులో పండ్ల దుకాణం ఏర్పాటు చేశాడు. దీంతో జీవనం సాగిస్తూ నగరంలోని భార్య, పిల్లలకు డబ్బులు పంపేవాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన స్థలాన్ని క్లూస్ టీమ్. చేవెళ్ల ఏసీపీ, సీఐ, ఎస్‌ఐలు పరిశీలించారు.