కోహ్లి శతకం.. పాక్‌ ఖేల్‌ ఖతం

Kohli's century.. Pak Khel's death– 6 వికెట్లతో పాక్‌పై భారత్‌ ఘన విజయం
– ఛేదనలో విరాట్‌ కోహ్లి అజేయ సెంచరీ
– రాణించిన శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌
ఛేదనలో మొనగాడు విరాట్‌ కోహ్లి (100 నాటౌట్‌) చెలరేగాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్‌ చాంపియన్‌, ఆతిథ్య జట్టు పాకిస్థాన్‌ కథ ముగిసింది. పాకిస్థాన్‌కు చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా అదరగొట్టింది. బ్యాట్‌తో, బంతితో దుమ్మురేపిన భారత్‌.. 2017 చాంపియన్స్‌ ఫైనల్‌ పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఓటమితో చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌ నాకౌట్‌ ఆశలు ఆవిరయ్యాయి.
స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (3/40), హార్దిక్‌ పాండ్య (2/31)తో విజృంభించగా తొలుత పాకిస్థాన్‌ 241 పరుగులకే కుప్పకూలింది. కఠిన పిచ్‌పై ఛేదనలో విరాట్‌ కోహ్లి అజేయ సెంచరీతో కదం తొక్కగా, శ్రేయస్‌ అయ్యర్‌ (56) అర్థ సెంచరీతో రాణించాడు. మరో 45 బంతులు ఉండగానే భారత్‌ లాంఛనం ముగించింది. గ్రూప్‌-ఏ నుంచి భారత్‌ సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకోగా.. పాకిస్థాన్‌ మరో మ్యాచ్‌ ఉండగానే ఇంటిబాట పట్టింది.
నవతెలంగాణ-దుబాయ్
చిరకాల ప్రత్యర్థి, దాయాది పాకిస్థాన్‌పై ఛేదనలో విరాట్‌ కోహ్లి (100 నాటౌట్‌, 111 బంతుల్లో 7 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. సవాల్‌తో కూడిన పిచ్‌పై సమయోచిత ఇన్నింగ్స్‌తో కదం తొక్కిన విరాట్‌ కోహ్లి వన్డేల్లో రికార్డు 51వ శతకం నమోదు చేశాడు. 242 పరుగుల లక్ష్యాన్ని 42.3 ఓవర్లలోనే పూర్తి చేసిన టీమ్‌ ఇండియా మరో 45 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ నాకౌట్‌ రేసు నుంచి ఆతిథ్య జట్టు, డిఫెండింగ్‌ చాంపియన్‌ పాకిస్థాన్‌ నిష్క్రమించింది. గ్రూప్‌-ఏలో వరుసగా రెండో విజయంతో టీమ్‌ ఇండియా సెమీఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌ (56, 67 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), శుభ్‌మన్‌ గిల్‌ (46, 52 బంతుల్లో 7 ఫోర్లు) రాణించారు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 49.4 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. సయీద్‌ షకిల్‌ (62, 76 బంతుల్లో 5 ఫోర్లు), కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (46, 77 బంతుల్లో 3 ఫోర్లు), ఖుష్దిల్‌ షా (38, 39 బంతుల్లో 2 సిక్స్‌లు) రాణించారు. భారత బౌలర్లు కుల్దీప్‌ యాదవ్‌ (3/40), హార్దిక్‌ ఫాండ్య (2/31) బంతితో అద్భుత ప్రదర్శన చేశారు. ఛేదనలో సూపర్‌ సెంచరీ సాధించిన విరాట్‌ కోహ్లి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. చాంపియన్స్‌ ట్రోఫీ గ్రూప్‌-ఏలో చివరి మ్యాచ్‌లో మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్‌ ఆడనుంది.
ఛేదనలో విరాట పర్వం :
242 పరుగుల ఛేదనలో భారత్‌కు మంచి ఆరంభం లభించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (20) సహజశైలిలో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో ధనాధన్‌ షో చేశాడు. శుభ్‌మన్‌ గిల్‌ (46) సూపర్‌ ఫామ్‌ను కొనసాగించాడు. షహీన్‌ షా అఫ్రిది బంతికి పవర్‌ప్లేలోనే రోహిత్‌ నిష్క్రమించినా.. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌తో కలిసి విరాట్‌ కోహ్లి (100 నాటౌట్‌) ఛేదనను ముందుండి నడిపించాడు. పవర్‌ప్లేలో పదునైన పేస్‌ను ఎదుర్కొన్న కోహ్లి.. మిడిల్‌ ఓవర్లలో స్పిన్‌తో పాక్‌ కవ్వించినా సహనంతో బ్యాటింగ్‌ చేశాడు. దూకుడుగా ఆడే ప్రయత్నం చేయకుండా పరుగుల వేటపై దృష్టి నిలిపాడు. ఒక్కో పరుగు జోడిస్తూ స్కోరు బోర్డును కదిలించాడు. కోహ్లి, గిల్‌ జోడీ రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించి భారత్‌ను మూడంకెల స్కోరుకు చేర్చింది.
శ్రేయస్‌ అయ్యర్‌ (56)తో జతకట్టిన విరాట్‌ కోహ్లి మూడో వికెట్‌కు ఏకంగా 114 పరుగులు జోడించాడు. అయ్యర్‌, విరాట్‌ భాగస్వామ్యం మ్యాచ్‌ను టీమ్‌ ఇండియా వశం చేసింది. అయ్యర్‌ కాస్త దూకుడుగా ఆడినా.. విరాట్‌ కోహ్లి సహనం కోల్పోలేదు. నాలుగు ఫోర్లతో 62 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన కోహ్లి.. మరో మూడు ఫోర్లతో 111 బంతుల్లో కెరీర్‌ 51వ వన్డే సెంచరీ సాధించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 63 బంతుల్లో అర్థ సెంచరీ అందుకున్నాడు. ఇమామ్‌ ఉల్‌ హాక్‌ సూపర్‌ క్యాచ్‌తో శ్రేయస్‌ అవుటైనా.. అక్షర్‌ పటేల్‌ (3 నాటౌట్‌) తోడుగా కోహ్లి లాంఛనం ముగించాడు. హార్దిక్‌ పాండ్య (8) ఓ బౌండరీతో మెరిశాడు. ఖుష్దిల్‌ షా ఓవర్లో బౌండరీ బాదిన కోహ్లి భారత్‌కు గెలుపుతో పాటు శతకం సైతం అందుకున్నాడు. పాక్‌ బౌలర్లలో అఫ్రిది (2/74), అబ్రార్‌ (1/28) రాణించారు.
మెరిసిన బౌలర్లు :
బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో పాక్‌ను ఆలౌట్‌ చేశారు. ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (10), బాబర్‌ (23)లు త్వరగా అవుటైనా.. సయీద్‌ షకిల్‌ (62), మహ్మద్‌ రిజ్వాన్‌ (46)లు మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి పాక్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కానీ ఈ ఇద్దరు నిష్క్రమణతో కథ మొదటికొచ్చింది. సల్మాన్‌ ఆఘా (19), ఖుష్దిల్‌ షా (38) చివర్లో మెరవటంతో పాకిస్థాన్‌ 241 పరుగులైనా చేయగలిగింది. కుల్దీప్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్‌ రెండు వికెట్లు తీసుకున్నాడు. మహ్మద్‌ షమికి వికెట్లు దక్కలేదు.
స్కోరు వివరాలు :
పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ : ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (రనౌట్‌) 10, బాబర్‌ ఆజామ్‌ (సి) రాహుల్‌ (బి) హార్దిక్‌ పాండ్య 23, సయీద్‌ షకిల్‌ (సి) అక్షర్‌ పటేల్‌ (బి) హార్దిక్‌ పాండ్య 62, మహ్మద్‌ రిజ్వాన్‌ (బి) అక్షర్‌ పటేల్‌ 46, సల్మాన్‌ ఆఘా (సి) జడేజా (బి) కుల్దీప్‌ యాదవ్‌ 19, తయ్యబ్‌ తాహిర్‌ (బి) జడేజా 4, ఖుష్దిల్‌ షా (బి) కోహ్లి (బి) హర్షిత్‌ రానా 38, షహీన్‌ షా అఫ్రిది (ఎల్బీ) కుల్దీప్‌ యాదవ్‌ 0, నసీం షా (సి) కోహ్లి (బి) కుల్దీప్‌ యాదవ్‌ 14, హరీశ్‌ రవూఫ్‌ (రనౌట్‌) 8, అబ్రార్‌ అహ్మద్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 17, మొత్తం : (49.4 ఓవర్లలో ఆలౌట్‌) 241.
వికెట్ల పతనం : 1-41, 2-47, 3-151, 4-159, 5-165, 6-200, 7-200, 8-222, 9-241, 10-241.
బౌలింగ్‌ : మహ్మద్‌ షమి 8-0-43-0, హర్షిత్‌ రానా 7.4-0-30-1, హార్దిక్‌ పాండ్య 8-0-31-2, అక్షర్‌ పటేల్‌ 10-0-49-1, కుల్దీప్‌ యాదవ్‌ 9-0-40-3, రవీంద్ర జడేజా 7-0-40-1.
భారత్‌ ఇన్నింగ్స్‌ : రోహిత్‌ శర్మ (బి) షహీన్‌ షా అఫ్రిది 20, శుభ్‌మన్‌ గిల్‌ (బి) అబ్రార్‌ అహ్మద్‌ 46, విరాట్‌ కోహ్లి నాటౌట్‌ 100, శ్రేయస్‌ అయ్యర్‌ (సి) ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (బి) ఖుష్దిల్‌ షా 56, హార్దిక్‌ పాండ్య (సి) రిజ్వాన్‌ (బి) షహీన్‌ షా అఫ్రిది 8, అక్షర్‌ పటేల్‌ నాటౌట్‌ 3, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (42.3 ఓవర్లలో 4 వికెట్లకు) 244.
వికెట్ల పతనం : 1-31, 2-100, 3-214, 4-223.
బౌలింగ్‌ : షహీన్‌ షా అఫ్రిది 8-0-74-2, నసీం షా 8-0-37-0, హరీశ్‌ రవూఫ్‌ 7–0-52-0, అబ్రార్‌ అహ్మద్‌ 10-0-28-1, ఖుష్దిల్‌ షా 7.3-0-43-1, సల్మాన్‌ ఆఘా 2-0-10-0.

Spread the love