వ్యంగ్య రచనలో ల్యాండ్‌మార్క్‌

A landmark in satireశీతాకాలం ఉదయం తొమ్మిది గంటల ఎండలా మిలమిల్లాడిన వయసులో కళ్ళలో పడి ఇప్పటికీ హదయ కొసలని దాటని పుస్తకం. అప్పుడప్పుడే పై పెదవి మీద మొలిచిన రాగి తీగల్లాంటి వెంట్రుకల నడుమ, ఊరుతున్న టెస్టోస్టిరాన్‌ వేగానికి తళ్లడిల్లిపోయే బాడీని కాపాడిన పుస్తకం. కళ్ళకి అడ్డుపడే కౌమార దశ ఉక్కిరిబిక్కిరి ఊగిసలాటలోంచి బయటికి లాగిన సతత ప్రియ పుస్తకం పతంజలి గారి ఒక దెయ్యం ఆత్మ కథ. ఇంటర్‌ మొదటి ఇయర్‌ లైబ్రరీలో చూసి,ఒక దెయ్యం ఆత్మకధ టైటిల్‌ నచ్చి తీసుకుని చదవడం మొదలు పెడితే ఏదో తెలియని ఇదీ అని చెప్పలేని రాయలేని అనుభూతి కలిగింది గానీ అర్ధం కాలేదు. నరాల్లోకి ఇంకలేదు. రక్తంలో కలవలేదు. అదే ఏడు పది పన్నెండు సార్లు లైబ్రేరియన్‌ని ఇవ్వను అన్నప్పుడల్లా బతిమాలుకొని చదివాను. చివరికి ఇచ్చేస్థాయి దాటిపోయాక తస్కరించి సూట్‌కేస్‌ లో దాచాను. ఆ నవలిక ప్రారంభ వాక్యాలు నన్నో నీలికళ్ల గులాబీరంగు ఆడపిల్లలా ఆకర్షించాయి. అనేకానేక సీతాకొక చిలుక రెక్కల మీద ఒక ప్రముఖ దెయ్యం రాసుకున్న ఆత్మ కథ అనే వాక్యాల్తో ప్రారంభం అయ్యి, అక్షరాలా యాబయి తొమ్మిది పేజీల ఈ చిన్ని నవలిక ఆద్యంతం ప్రతి పేజీ కళ్లు తిప్పకుండా చదివిస్తుంది. దెయ్యాల గురించి రాసినట్టు ఉంటుంది. ఆ దెయ్యం నేనే అనిపిస్తుంది. నేనే కాదు నా చుట్టూ మనుషులు కూడా దెయ్యాలే అని కూడా అనిపిస్తుంది. ఒక్కమనిషి పాత్ర లేని కథ. చిలక కథ. సాలె పురుగు కథ, తాబేలు కథ. కుందేలు కథ. తెల్ల కాకుల కథ. గబ్బిలాల కథ. మిడతల కథ. ఇలా పన్నెండు కథల కథ ఈ నవలిక మిడతల కథ నన్ను బాగా ఊహల్లో ముంచింది. వ్యంగ్య రచనలో ల్యాండ్‌మార్క్‌ ఈ రచన అనిపిస్తుంది. జంతువుల ద్వారా రకరకాల మానవ దుష్ట నష్ట నికష్ట కత్య నత్యాల్ని దెయ్యాన్ని ప్రతీకాత్మకంగా చేసి రాశారు. ఈ టెక్నిక్‌ ఈ ఫామ్‌ ఈ స్టైల్‌ ఇప్పటికీ నన్ను అబ్బురపరుస్తానే ఉంటాయి. ఇప్పటికీ ఎప్పటికప్పుడు ఈ టెక్స్ట్‌ కొత్త కొత్తగా అర్ధమవుతూ ఉంటుంది. తల పండిన తార్కికుడు జీవితాన్ని నిర్వచిస్తే ఎలా ఉంటుందో అచ్చం అలా ఉంటుంది. రసవిద్య తెలిసిన కవి దుఖాన్ని రాస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ప్రారంభంలో ఇలా రాయాలని తెగ ప్రయత్నించే వాడ్ని కానీ కుదిరేది కాదు. నాకే కాదు పతంజలి గారిలా రాయడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరైనా నేనూ ఇలా రాగలను రాస్తాను అనుకుంటే దానికి మించిన జోక్‌ ఇంకోటి ఉండదు. నా ఆల్‌ టైం బెస్టీ ఒక దెయ్యం ఆత్మకథ.
– మారాబత్తుల పెద్దన్న

Spread the love